ఫిరాయింపులను ప్రశ్నించే నైతికత..బీఆర్​ఎస్​కు ఉందా?

ఫిరాయింపులను ప్రశ్నించే నైతికత..బీఆర్​ఎస్​కు ఉందా?

రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు ఇచ్చి ప్రభుత్వ మార్పిడిని కోరుకున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడిన ఒకటి రెండు వారాలకే  మాజీ మంత్రులు కేటీ రామారావు, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత, సంతోష్ రావు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, బీఆర్​ఎస్​పార్టీ ఇతర నాయకులు ప్రజల తీర్పును గౌరవించకుండా  ఆరోపణలు ఎక్కుపెట్టారు. నూతన ప్రభుత్వం కేవలం మూడు నాళ్ళ ముచ్చటే అని అది అతి త్వరలో కూలిపోతుందని అవాకులు, చవాకులు పేలడం జరిగింది.  

గత తొమ్మిదిన్నర  సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రం అన్ని విధాల దోపిడీకి, అణచివేతకు, కుల వివక్షతకు, బంధుప్రీతికి గురైనందువల్ల  ఈ ఎన్నికలలో ప్రజలు ఒక మార్పు దిశలో తీర్పు ఇవ్వడం జరిగింది. కల్వకుంట్ల కుటుంబ సభ్యులు గానీ, ఆ పార్టీ నాయకులు కానీ ప్రజాతీర్పును ఒప్పుకోకపోవడం మన ప్రజాస్వామ్యంలో  దురదృష్టకరం. వరద ముంపులతో  ప్రజలు అనుభవిస్తున్న ఇక్కట్ల గురించి మాట్లాడకుండా కేవలం తమ ఎమ్మెల్యేలు పార్టీ మార్చినారని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఓడిపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి గెలుపొందిన కౌశిక్ రెడ్డిని ముందు పెట్టి తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు.

ప్రజాస్వామ్య విలువలకు బీఆర్ఎస్ తిలోదకాలు

కల్వకుంట్ల నాయకులు ప్రజాస్వామ్యాన్ని  ఏ విధంగా అపహాస్యం చేసిండ్రో  ప్రజలు ఇంకా మర్చిపోలేదు. 2014 నుంచి  రెండుసార్లు ప్రజలు ఎన్నికలలో కేసీఆర్​కు అధికారం ఇచ్చినప్పటికీ ప్రజలు ఎన్నుకున్న ప్రతిపక్ష సభ్యులను నయానా భయానా తన పార్టీలో కలుపుకున్నాడు.  వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా గమనించిన తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు ఆందోళనకు గురై   ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్ష నాయకులు నిరసనలు  తెలిపినప్పటికీ ఫలితం శూన్యం. అది కేవలం పార్టీల విలీనం అని ఒక దుర్మార్గపు ఆలోచనను తెరపైకి తీసుకు రావడం జరిగింది.  

తీరుమారలేదు

కల్వకుంట్ల పాలనలో తొమ్మిదిన్నర సంవత్సరాల కాలం అనేక  అప్రజాస్వామిక నిర్ణయాలు, సంఘటనలు జరిగినప్పుడు ఆ ప్రభుత్వంలో మంత్రులతో పాటు అనేక అధికార పదవులు అనుభవించిన నాయకులు, మేధావులు పెదవి విప్పలేదు. ప్రజాస్వామ్యం పట్టపగలు ఖూనీ అవుతున్నదని మేధావులు, పత్రికలు,  ప్రతిపక్ష నాయకులు గగ్గోలు పెట్టినప్పటికీ పాలక పక్షం నిస్సిగ్గుగా తన ఒంటెద్దు పోకడలతో ఫిరాయింపుల పరంపరను కొనసాగించింది.  ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇవ్వడం జరిగింది. ప్రతిపక్షాలను లేకుండా చేసి రాజరికపు వ్యవస్థను నిర్మాణం చేసిన కల్వకుంట్ల కుటుంబా నికి ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ తీరు మారడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కేసీఆర్ నిరంకుశ పాలన

ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం తెరాస ఎమ్మెల్యేలు పదిమంది పార్టీ మారినప్పుడు కూడా ప్రజాస్వామ్యవాదులు, ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు నిరసించారు.  చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా అధికారం పొందిన వెంటనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం,  భారత కమ్యూనిస్టు పార్టీ, బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యేలను గంపగుత్తగా తన పార్టీలో చేర్చుకొన్నాడు.   అనేకమందికి మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు, వందల కోట్ల రూపాయల ప్రాజెక్టులు నజరానాలు పంచి తన నిరంకుశ ప్రభుత్వ పాలనకు తెరలేపడం జరిగింది. తన పాలనకు ఎదురు లేకుండా.. కేసీఆర్​ తొమ్మిదిన్నర  సంవత్సరాల కాలంలో తన కుటుంబ సభ్యులను, దగ్గరి బంధువులను కేబినెట్లో చేర్చుకుని, తన సామాజిక వర్గానికి అనేక ప్రతిష్టాత్మకమైన ఉన్నత పదవులు ఇచ్చి ఆదరించాడు. తోటి అల్లుడి కుమారునికి కూడా రాజ్యసభ సీటు బహుమతిగా ఇచ్చాడు. రాష్ట్రంలో తన పార్టీ, తన కుటుంబం, తన బంధు వర్గం, ఒకే సామాజిక  వర్గం ద్వారానే ప్రభుత్వం నడిపిన కాలం..  తెలంగాణ రాజకీయ చరిత్రలో చీకటిరోజులుగా నిలిచిపోతాయి.

ఫిరాయింపులపై మాట్లాడే హక్కు ఉందా? 

ప్రస్తుతం రాష్ట్రంలో జరిగిన పార్టీ  పిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులు​ హరీష్ రావు,  కేటీఆర్,  వారి కుటుంబ సభ్యులకు గానీ ఇంకా ఆ పార్టీ నాయకులకుగానీ లేదని గుర్తుపెట్టుకోవడం మంచిది. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంటుంది.  దుర్మార్గులు రచ్చకెక్కినట్లుగా ఉంది. పార్టీ  పిరాయింపులపై బీఆర్ఎస్​ నాయకులు గత వారంలో జరిపిన సంఘటనలను గమనించిన తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు, ప్రజాస్వామ్యవాదులు నివ్వెరపోతున్నారు. బీఆర్ఎస్​ నాయకుల  ప్రకటనలు వింటున్న మహిళలు  ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ విలువలు, ప్రజల హక్కులు ఈ కుటుంబ సభ్యులు అర్థం చేసుకుంటే సంతోషించవలసిందే. 

అపుడు ఈ రాజ్యాంగమే అక్కరలేదని..ఇపుడు హక్కుల గురించి మాట్లాడటమా?

పార్టీ పిరాయింపులను ప్రజలు,  ప్రజాస్వామ్యవాదులు ఎప్పుడూ సహించలేదు. ప్రస్తుతం జరిగే పార్టీ పిరాయింపులను వ్యతిరేకించవలసింది ప్రజాస్వామ్యవాదులేనని కేటీఆర్​ తదితరులు గుర్తుంచుకోవాలి. కల్వకుంట్ల వారి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ కావడమే కాక సామాజిక న్యాయం పూర్తిగా బొంద పెట్టబడింది. ఈ రాజ్యాంగమే అక్కరలేదని చెప్పిన మీకు రాజ్యాంగం హక్కులు, విలువల గురించి మాట్లాడే నైతికత ఉందా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో శాసనసభ గౌరవాన్ని, ప్రతిపక్షాల ప్రాముఖ్యతను సహచర కేబినెట్ మంత్రుల ఆత్మగౌరవాన్ని కూడా లెక్కచేయని మీకు రాజ్యాంగ విలువలు ప్రజాస్వామ్య హక్కులు ఇప్పుడిప్పుడే అర్థమవుతుండటం శుభ పరిణామంగా భావించవచ్చు. 

బీసీలు, దళితులపై దాష్టీకాలు

రాజకీయంగా,  ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన కులాల ప్రజలను అణగదొక్కిన చీకటి రోజులు కేసీఆర్​ పాలనలో ఉన్నాయి. అనేకమంది దళితులను నిర్బంధాలకు గురిచేసి మరియమ్మలాంటి వారిని లాకప్ డెత్   కు గురిచేసిన పాలన బీఆర్ఎస్​ వారిది.  కల్వకుంట్ల వారి బంధువుల అక్రమ ఇసుక లారీలను అడ్డగించినందుకు నేరెళ్ల దళిత యువకులను చిత్రహింసలకు గురిచేసిన రోజులు ప్రజలు మర్చిపోలేరు. బాధ్యతాయుతంగా ఉండవలసిన గౌరవ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి ఒక వీధి రౌడీలాగ  ప్రవర్తించడం జుగుప్సాకరమైన విషయంగా సభ్య సమాజం, ప్రజలు భావిస్తున్నారు. 

రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్వీర్యం చేసి, ప్రజారోగ్య వ్యవస్థను చిన్నాభిన్నం చేసి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి,  ప్రభుత్వ పాలనా వ్యవస్థను అవినీతిమయం చేసి,   ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసి తొమ్మిదిన్నర సంవత్సరాల కాలం తమ నిర్వాకం ఇప్పటికీ  తెలంగాణ ప్రజలను విస్మయానికి గురి చేస్తున్నది. ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో దిగిపోయింది . అన్న వస్త్రం అడగబోతే ఉన్న వస్త్రం లాక్కున్నట్లుగా.. నమ్మి అధికారం చేతికిస్తే అన్ని రంగాలను విధ్వంసం చేసి ఈ రాష్ట్రం ఇంకా 20 సంవత్సరాలు గడిచినాగానీ బాగుపడదని ప్రజలు ఉద్యమకారులు, మేధావులు తీవ్ర ఆందోళన పడుతున్నారు. 

ప్రజలకు కనీసం క్షమాపణ చెప్పలే

దోపిడీ, నిరంకుశత్వం,  కుల వివక్ష, బంధు ప్రేమ, కుటుంబ పాలన సహించలేక ప్రజలు  ఓటమిపాలు చేసినా అహంకారంలో మార్పు రాలేదు.  ఓటమిపాలైనప్పటికీ ప్రజలకు కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. అధికారం కోల్పోయి పదవులు పోయి  కనీసం ఒక ఐదు సంవత్సరాలు అయినా ఓపిక పట్టకుండా రచ్చకు ఎక్కడం తెలంగాణ ప్రజలు సహించలేరని ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.  ఆగడాలు ఆపండి, లేకుంటే ఈ ప్రజాస్వామ్యంలో  ఉనికి, అడ్రస్ లేకుండా పోవడం ఖాయమని తెలుసుకోవాలి. 

- కూరపాటి వెంకట్ నారాయణ