సంస్థాన్‌నారాయణపురం, వెలుగు : మునుగోడు ఉప ఎన్నికల్లో అభ్యర్థిని కాకుండా కారు గుర్తును, కేసీఆర్‌ను చూసి ఓటు వేయాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చెప్పారు. యాదాద్రి జిల్లా సంస్థాన్‌నారాయణపురంలో ఆదివారం నిర్వహించిన టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. రాజగోపాల్‌రెడ్డి ఎంపీగా పోటీ చేసినప్పుడు అసలు ఆయనకు కాంగ్రెస్ సభ్యత్వం ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతుందంటున్న రాజగోపాల్‌రెడ్డికి ఆయన అన్న, భార్య పోటీ చేసినప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా అని ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయం పేరుతో రౌడీయిజం చేస్తున్నారని విమర్శించారు. మునుగోడు నియోజకవర్గంలో తాను తిరిగినన్ని గ్రామాలు కూడా రాజగోపాల్‌రెడ్డి తిరగలేదన్నారు. అనంతరం గుడిమల్కాపూర్ ఎంపీటీసీ శివరాత్రి కవిత సాగర్, మునుగోడు మండలం పులిపల్పుల ఎంపీటీసీ బలుగూరి లింగయ్య మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. సమావేశంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ గుత్తా ఉమాదేవి, జడ్పీటీసీ వీరమల్ల భానుమతి, మండల అధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, పీఏసీఎస్ చైర్మన్ జక్కిడి జంగారెడ్డి పాల్గొన్నారు.
స్వాతంత్ర్య స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధి
నల్గొండ అర్బన్, వెలుగు : స్వాతంత్ర్య స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరుగుతోందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చెప్పారు. నల్గొండ పట్టణంలో ఆదివారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మర్రిగూడ బైపాస్‌లో ఏర్పాటు చేసిన బుద్ధవనం, బుద్ధుడి విగ్రహాన్ని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం క్లాక్‌టవర్ సెంబర్‌లో 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. నల్గొండ ప్రజలు కోరుకున్న విధంగా అభివృద్ధి జరుగుతోందన్నారు. పట్టణంలో కళాభారతి నిర్మాణానికి త్వరలోనే సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారన్నారు. అంతకుముందు పలువురు స్టూడెంట్లు ఎన్‌జీ కాలేజీ నుంచి సుభాశ్ చంద్రబోస్ విగ్రహం వరకు 1500 మీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించారు. కార్యక్రమంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ రెమా రాజేశ్వరి, అడిషనల్ కలెక్టర్ రాహుల్‌శర్మ, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, వైస్‌చైర్మన్ అబ్బగోని రమేశ్, ప్రజారోగ్య శాఖ ఎస్‌ఈ కందుకూరి వెంకటేశ్వర్లు, ఈఈ సత్యనారాయణ, డీఈవో భిక్షపతి పాల్గొన్నారు.