- మాజీ మంత్రి హరీశ్‌రావు
- కొనుగోలు కేంద్రాల్లో రైతులు తిప్పలు పడుతున్నారని విమర్శ
సిద్దిపేట రూరల్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి రైతుల బాధలు పట్టించుకోవడం లేదని, రైతులు రోజుల తరబడి వడ్లు అమ్ముకునేందుకు సెంటర్లలో తిప్పలు పడుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటే, ఇప్పుడు రైతులను ఏడిపిస్తూ రేవంత్ ఆనంద పడుతున్నారని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో పంటను కొనకపోవడంతో కోతులు, కుక్కలు, పందుల బారి నుంచి కాపాడుకునేందుకు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్నది రైతు ప్రభుత్వం కాదని, రాబందుల ప్రభుత్వం అని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లాలో కనీసం ఒక కిలో సన్న వడ్లను అయినా కొన్నారా? చూపిస్తారా? అని సవాల్ విసిరారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సీజన్ లో 91 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని గొప్పగా ప్రకటించారని, అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేస్తానని ఒట్టు వేసి మాట తప్పినందుకు ముక్కు నేలకు రాసి క్షమాపణలు అడగాలన్నారు. అనంతరం సీఎంకు అడ్వాన్స్ గా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట మారెడ్డి రవీందర్ రెడ్డి, వేలేటి రాధాకృష్ణ శర్మ, గన్నమనేని శ్రీదేవి చందర్ రావు, ప్రభాకర్ వర్మ ఉన్నారు.