ఒవైసీ అక్రమ నిర్మాణాలు కూల్చండి

ఒవైసీ అక్రమ నిర్మాణాలు కూల్చండి
  • జేసీబీలు లేకపోతే నేను తీసుకొచ్చి ఇస్త: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
  • ఓల్డ్ సిటీ నుంచి కూల్చివేతలు ప్రారంభించాలి
  • కొందరిని టార్గెట్ చేసుకుని హైడ్రా పని చేస్తున్నది
  • పర్మిషన్ ఇచ్చినోళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: పాతబస్తీలోని సల్కం చెరువులో ఒవైసీ నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చే దమ్ము ప్రభుత్వానికి, హైడ్రాకు ఉందా? అని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. అంత ధైర్యం ఉంటే వెంటనే ఆ ప్రక్రియ ప్రారంభించాలని సవాల్ విసిరారు. హైడ్రా కమిషనర్​కు అక్కడి అక్రమ కట్టడాలు కనిపించడం లేవా? అని నిలదీశారు. ఒకవేళ కనిపించకపోతే తాను వచ్చి చూపిస్తానని, జేసీబీలు లేకుంటే పక్క రాష్ట్రం నుంచి తెప్పించి ఇస్తానని స్పష్టం చేశారు. ఓల్డ్ సిటీ నుంచే కూల్చివేతలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

బీజేపీ స్టేట్​లో ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను తెరపైకి తీసుకొచ్చిండు. ఆయనకు దమ్ముంటే ఓల్డ్ సిటీలోని అక్రమ నిర్మాణాలు కూల్చేయాలి. కొందరిని టార్గెట్​గా చేసుకుని హైడ్రా పని చేస్తున్నట్లు అనుమానం వస్తున్నది. ఓల్డ్ సిటీ గుర్రం చెరువు, జల్పల్లి చెరువు అక్రమ నిర్మాణాల వివరాలు ఉన్నాయా? పంపించాలా? ఒవైసీ చేపట్టిన అక్రమ నిర్మాణాలు ఎప్పటిలోగా కూల్చేస్తారో చెప్పాలి. వాటికి పర్మిషన్ ఇచ్చిన వారిపై చర్యలు ఏమైనా తీసుకుంటారా? లేదా? చెప్పాలి’’అని మహేశ్వర్ రెడ్డి అన్నారు.

భూముల లెక్కలపై శ్వేతపత్రం రిలీజ్ చేయండి

బీఆర్ఎస్ ప్రభుత్వం అయ్యప్ప సొసైటీ విషయంలో ఇలాగే హైడ్రామా చేసిందని మహేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ కూడా ఇప్పుడు అలాగే చేస్తున్నదేమో అన్న అనుమానం కలుగుతున్నదని విమర్శించారు. ‘‘రాష్ట్రంలో ఉన్న చెరువులు ఎన్ని? ఆక్రమణకు గురైన చెరువులు ఎన్ని? అన్యాక్రాంతమైన భూముల లెక్కపై శ్వేతపత్రం విడుదల చేయాలి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? తనపై బుల్లెట్ల వర్షం కురిపించండి కానీ.. తన విద్యాసంస్థలను కూల్చొద్దని అక్బరుద్దీన్ చేసిన కామెంట్లు సిగ్గుచేటు.

నిజమైన ప్రజాప్రతినిధి అయితే.. అక్రమ నిర్మాణాలను స్వచ్ఛందంగా కూల్చేయాలి’’అని అన్నారు. 2022–-23 ప్రభుత్వ లెక్కల ప్రకారం హైదరాబాద్ లో ఆక్రమణకు గురైన 134 చెరువుల మీద ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం 8,718 నిర్మాణాలు జరిగాయని తెలిపారు. బఫర్ జోన్ పరిధిలో 5,343 నిర్మాణాలు జరిగినట్టు అధికారులు నివేదిక ఇచ్చారని అన్నారు. ఈ లెక్కన మొత్తం 13వేల నిర్మాణాలను కూలగొట్టే దమ్ము, ధైర్యం ప్రభుత్వానికి ఉందా..? చెప్పాలని డిమాండ్ చేశారు.