ఓబీసీ/బీసీ రిజర్వేషన్ల అమలులో క్రీమిలేయర్(సంపన్న శ్రేణి) ఆదాయ పరిమితిని 1993 నుంచి 2021 వరకు తొమ్మిది సార్లు పెంచాలి. కానీ, నేటి వరకు క్రీమిలేయర్‌ను నాలుగుసార్లు మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమీక్షించాయి. క్రీమిలేయర్‌ను పెంచకపోవడం వల్ల లక్షలాది మంది ఓబీసీ నిరుద్యోగులు, స్టూడెంట్లు రిజర్వేషన్లు కోల్పోతున్నారు. ఓబీసీ క్రీమిలేయర్ వార్షిక ఆదాయ పరిమితిని రూ.8 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచాలి. ఆదాయ పరిమితిని సమీక్షించి క్రీమిలేయర్‌ను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వాధికారాలు ఉన్నాయి. కేంద్రం పెంచకపోయినా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సమీక్షించి ఆదాయ పరిమితిని పెంచవచ్చు. ఇప్పటికైనా క్రీమిలేయర్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. అప్పుడే ఓబీసీ యువతకు న్యాయం జరుగుతుంది.
కేంద్రంలో వీపీ సింగ్ ప్రధానమంత్రిగా జనతాదళ్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1990లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులుగా గుర్తింపు పొందిన ఇతర వెనుకబడిన తరగతుల(ఓబీసీలు)కు 27% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సదరు రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తొమ్మిది మంది జడ్జిల కాన్‌స్టిట్యూషనల్ బెంచ్ 6:3 మెజారిటీతో తీర్పు చెప్పింది. ఓబీసీ రిజర్వేషన్లను ఆమోదిస్తూ ఓబీసీ/బీసీ కోటాలో క్రీమిలేయర్(సంపన్న శ్రేణి) వర్గాలను గుర్తించి వారిని రిజర్వేషన్ల పరిధి నుంచి తొలగించాలని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. 1992లో కేంద్రం ఓబీసీల్లో సంపన్న శ్రేణి వారిని గుర్తించడానికి జస్టిస్ రామ్ నందన్ ప్రసాద్ అధ్యక్షతన ఎక్స్‌పర్ట్స్ కమిటీని నియమించింది. సదరు కమిటీ నివేదికను సమర్పిస్తూ ఓబీసీల్లో ఆరు వర్గాల వారి సంతతిని క్రీమిలేయర్లుగా గుర్తించింది. చివరిదైన ఆదాయ పరిమితిలో తల్లిదండ్రుల వార్షిక ఆదాయ పరిమితి లక్ష రూపాయలుగా నిర్ధారిస్తూ, ఇందులో ఉద్యోగుల జీతభత్యాలు, వ్యవసాయ ఆదాయాలను మినహాయించింది. అదేవిధంగా ప్రతి మూడు సంవత్సరాలకు పునఃసమీక్షించి ఆదాయ పరిమితిని పెంచాలని సూచించింది. అవసరమైతే రూపాయి విలువ హెచ్చుతగ్గులను దృష్టిలో పెట్టుకుని కాలపరిమితికి ముందే సమీక్షించాలని స్పష్టం చేసింది. సదరు నివేదికను 1993లో కేంద్రం ఆమోదిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అయితే నేటికి నాలుగుసార్లు మాత్రమే ఆదాయ పరిమితిని పెంచారు. ప్రస్తుత వార్షిక ఆదాయ పరిమితి చివరిగా 2017లో సమీక్షించి 8 లక్షల రూపాయలుగా నిర్థారించారు.
రెండు రకాలుగా రిజర్వేషన్లు
సుప్రీంకోర్టు మండల్ కమిషన్ తీర్పులో రిజర్వేషన్లకు సంబంధించి ప్రధాన అంశాలపై సవివరంగా తేల్చిచెప్పింది. ఇందులో రిజర్వేషన్లు స్థూలంగా రెండు రకాలు. (1) షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను సామాజిక రిజర్వేషన్లుగా వీటిని నిలువు రిజర్వేషన్లుగా పరిగణించాలని తెలిపింది. (2) మహిళా, వికలాంగులు మొదలగు రిజర్వేషన్లను ప్రత్యేక రిజర్వేషన్లుగా వీటిని సమాంతర రిజర్వేషన్లుగా పరిగణించాలని తెలిపింది. సదరు తీర్పులో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్లను ఒక చేతితో, ఇతర వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను మరో చేతితో చూడాలని చెప్పింది. ముఖ్యంగా ఆర్టికల్ 15(4),16(4) ప్రకారం అమలు చేస్తున్న ఓబీసీ రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల మాదిరిగా కుల/తెగ ప్రాతిపదికన ఏర్పాటు చేసినవి కావని తెలుపుతూ, ఓబీసీ రిజర్వేషన్లు తరగతుల/వర్గాల ప్రాతిపదికన కల్పిస్తున్నాయని తెలిపింది. ఓబీసీ/బీసీ జాబితాలో ప్రభుత్వాలు కులాలను చేరుస్తున్నాయి. కనుక ఆయా కులాల కుటుంబాల్లో సామాజికంగా అభివృద్ధి చెందిన వారిని సంపన్న శ్రేణిగా గుర్తించి రిజర్వేషన్ల అర్హత నుంచి తొలగించాలని ఆదేశించింది.
2014 నుంచి అన్ని శాఖల్లో అమలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో బీసీ రిజర్వేషన్లలో క్రీమిలేయర్ విధానాన్ని విద్యుత్ సంస్థలు మినహా అన్ని శాఖల్లో 2006 నుంచి అమలు చేస్తున్నారు. తెలంగాణలో 2014 నుంచి విద్యుత్ సంస్థలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలు క్రీమిలేయర్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు సంవత్సరాలకు సమీక్షించి ఆదాయ పరిమితిని తొమ్మిదిసార్లు పెంచినట్లయితే నేడు వార్షిక ఆదాయ పరిమితి 30 లక్షల రూపాయలుగా ఉండేది. కేంద్ర ప్రభుత్వం దీనిని సమీక్షించకపోవడంతో లక్షలాది మంది ఓబీసీ స్టూడెంట్లు రాజ్యాంగబద్ధంగా అమలు చేస్తున్న రిజర్వేషన్లు కోల్పోతున్నారు.
రాజ్యాంగాన్ని సవరించాలి
బీసీ క్రీమిలేయర్ సమస్యను అధిగమించాలంటే రాజ్యాంగ సవరణే మార్గం అని గుర్తించాలి. రాజ్యాంగంలో విద్యా, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ఆర్టికల్స్ 15 (4), 15 (5), 340, 338బి, 342ఎ, 366లోని 26 (సి)లలో సూచించినట్లు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులు(Socially and Educationally Backward Classes) అనే పదాలను సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలు(Socially and Educationally Backward Castes)గా మార్చాలి. అదేవిధంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 243డి, 243టి ఆర్టికల్స్‌లో పేర్కొన్నట్లు వెనుకబడిన తరగతులు(Backward Classes) అనే పదాలను సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలు(Socially and Educationally Backward Castes)గా మార్చాలి. లేనట్లయితే బీసీ రిజర్వేషన్లలో క్రీమిలేయర్ సమస్యను తొలగించడం, జనాభా దామాషా పద్ధతిలో బీసీ రిజర్వేషన్ల పెంపు, ఓబీసీ కులగణన మొదలగు సమస్యలను అధిగమించడం అసాధ్యమని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం వెంటనే బీసీ రిజర్వేషన్ల అమలుపై న్యాయపరమైన సమస్యల శాశ్వత పరిష్కారానికి రాజ్యాంగాన్ని సవరించాలి. – కోడెపాక కుమారస్వామి, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం