- కుక్కల బెడద తీరేదెట్లా..?
- డైలీ సగటున 20 మంది ఎంజీఎంకు పరుగులు
- మాటలకే పరిమితమైన మరో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్
- నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్న అధికారులు
హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరంలో రోజురోజుకూ కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. సాధారణంగా ఎండకాలంలో నీళ్లు, ఆహారం సరిగా దొరక్క కుక్కలు దాడులు చేసే అవకాశం ఉంటుంది. వర్షాలు మొదలైనా వాటి బెడద మాత్రం తప్పడం లేదు. దీంతో నిత్యం సగటున 20 మంది వరకు కుక్క కాటుతో ఎంజీఎం ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు.
నగరంలో కుక్కల పెరుగుదలను నియంత్రించేందుకు చింతగట్టు సమీపంలో యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) సెంటర్ ఉండగా, దానిపై భారం ఎక్కువ పడుతోంది. గతేడాది కుక్కల దాడులు ఎక్కువ కాగా, నగరంలో కొత్తగా మరో ఏబీసీ సెంటర్ను ఏర్పాటు చేస్తామని లీడర్లు, ఆఫీసర్లు ప్రకటించారు. కానీ, ఇప్పటికీ రెండో ఏబీసీ సెంటర్ జాడే లేదు. ప్రస్తుతం సిటీ కుక్కల సంఖ్య పెరిగి, దాడులు పెరిగిపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
డైలీ 20 మందికి కుక్కకాట్లు..
నగరంలో విలీనమైన 42 గ్రామాలతో పాటు వరంగల్ ట్రై సిటీ వ్యాప్తంగా దాదాపు 40 వేలకు పైగా కుక్కలు ఉన్నట్లు గతేడాది అధికారులు గుర్తించారు. వాటి నియంత్రణలో అధికారులు విఫలం కావడంతో కుక్కలు గుంపులుగా తిరుగుతూ వచ్చిపోయే జనాలపై దాడులకు దిగుతున్నాయి. ఇటీవల ఎంహెచ్ నగర్ లో ఓ వృద్ధుడిని తీవ్రంగా గాయపర్చగా, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
నగరంలోని 66 డివిజన్ల పరిధిలో ప్రతిరోజు 20 నుంచి 30 మందికిపైగా కుక్కల దాడులకు గురవుతుండగా, ఎంజీఎంకు 20 మందికిపైగా రేబిస్ వ్యాక్సిన్ కోసం క్యూ కడుతున్నారు. కుక్క కాటుతో పాటు కోతుల బాధితులు కూడా వ్యాక్సిన్ కోసం వస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు.
మాటల్లోనే బర్త్ కంట్రోల్..
నగరంలోని కుక్కలకు సంతానోత్పత్తి జరగకుండా స్టెరిలైజేషన్ చేసే పనిని బల్దియా అధికారులు ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. ఈ మేరకు సదరు ఏజెన్సీ హసన్ పర్తి సమీపంలోని చింతగట్టు క్యాంప్ వద్ద యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. ఫిర్యాదులు వచ్చిన చోటు నుంచి ప్రతి రోజు 20 నుంచి 30 కుక్కలను పట్టుకెళ్లి స్టెరిలైజేషన్ చేస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు.
ఇదిలాఉంటే స్టెరిలైజేషన్ ప్రక్రియలో భాగంగా మూడు రోజులపాటు వాటి సంరక్షణ, వాటికి ఆహారం, సర్జరీ, వాటిని తీసుకొచ్చే సిబ్బంది వేతనాలు, వెహికిల్ ఖర్చులు అన్నీ కలిపి బల్దియా ఒక్కో కుక్కకు రూ.800 వరకు ఏజెన్సీకి చెల్లిస్తోంది. ఈ లెక్కన గడిచిన ఐదేండ్లలో దాదాపు రూ.50 లక్షలకుపైగా కుక్కల ఆపరేషన్లకే కేటాయించారు. అయినా క్షేత్రస్థాయిలో కుక్కల బెడద కంట్రోల్ కావడం లేదు. నగరంలో పిల్లలు, వృద్ధులపై కుక్కల దాడులు పెరుగుతున్న దృష్ట్యా మరో ఏబీసీ సెంటర్ ను ఏర్పాటు చేసి, డాగ్ బైట్ కేసులను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తొందర్లోనే ఇంకో ఏబీసీ సెంటర్ ప్రారంభిస్తం..
కుక్కల దాడులపై ఎక్కడ ఫిర్యాదులు వచ్చినా వెంటనే యాక్షన్ చేపడుతున్నాం. కుక్కల పెరుగుదల నియంత్రణకు చింతగట్టు వద్ద ఏర్పాటు చేస్తున్న మరో ఏబీసీ సెంటర్ ను తొందర్లోనే వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇంకో నెల రోజుల్లో దానిని అందుబాటులోకి తీసుకొచ్చి, కుక్కల నియంత్రణకు తగిన యాక్షన్ తీసుకుంటాం.
- డాక్టర్ మల్లం రాజేశ్, సీఎంహెచ్వో, గ్రేటర్ వరంగల్