- ఆలయ సంప్రోక్షణ చేసిన అర్చకులు
- భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భక్తుల డిమాండ్
యాదగిరిగుట్ట, వెలుగు : శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆలయ అధికారులు, భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ప్రధానాలయంలోకి శునకం(కుక్క) వచ్చిన ఉదంతం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం బ్రేక్ దర్శనాలు ముగిసి ఉచిత, వీఐపీ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ప్రధానాలయ తూర్పు రాజగోపురం నుంచి త్రితల గోపురం, హనుమాన్ టెంపుల్ పక్క నుంచి ప్రధానాలయంలోకి చేరుకు నేలా ఏర్పాటు చేసిన క్యూలైన్ల గుండా శునకం ఆలయంలోకి వెళ్లిందని చూసిన భక్తులు తెలిపారు.
శునకం వచ్చిన విషయాన్ని గమనించిన ఆలయ అధికారులు.. వెంటనే దాన్ని లిఫ్ట్ ద్వారా ఆలయం వెలుపలకు పంపించినట్లు తెలిసింది. అనంతరం ఆఫీసర్లు దర్శనాలను కాసేపు నిలిపివేయించారు. గుట్టుచప్పుడు కాకుండా ప్రధానాలయ ప్రాంగణాన్ని శుద్ధి చేసి అర్చకుల చేత సంప్రోక్షణ పూజలు చేపించి తిరిగి దర్శనాలను పునరుద్ధరించినట్టు తెలిసింది. ఆలయంలోకి శునకం వచ్చిన ఉదంతంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతమంది ఆలయ అధికారులు, భద్రతా సిబ్బంది ఉన్నా ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. భద్రతా సిబ్బంది నిఘా వైఫల్యం వల్లే ఆలయంలోకి శునకం వెళ్లిందని, దీనిపై వెంటనే విచారణ చేపట్టి సంబంధిత ఆఫీసర్లు, భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.