
హైదరాబాద్,వెలుగు: ఇన్వెస్టిగేషన్‌లో డాగ్ స్క్వా డ్ కీలకపాత్ర పోషిస్తుందని డీజీపీ రవిగుప్తా పేర్కొన్నారు. కీలకమైన కేసులను ఛేదించడంలో పోలీసులకు జాగిలాలు ఎంతో సహకరిస్తున్నాయని తెలిపారు. మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ(ఐఐటీఏ)లో శుక్రవారం 21 జాగిలాల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. డీజీపీ రవి గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ బి. శివధర్‌రెడ్డి సహా ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. నిందితులను పట్టుకోవడంలో పోలీసులకు సహకరిస్తున్నాయన్నారు.
రాష్ట్ర ఐఐటీఏ దేశంలోనే ప్రముఖ స్థానంలో నిలిచిందన్నారు. ఇతర రాష్ట్రాల జాగీలాలకు కూడా శిక్షణ ఇస్తుందన్నారు. భవిష్యత లో ఐఐటీఏ సిబ్బంది మరిన్ని విజయాలు సాధించాలని ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి అభినందించారు. రాష్ట్రానికి చెందిన పోలీస్ జాగిలాలతో పాటు బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన పోలీసు జాగిలాలకు ఐఐటీఏలో శిక్షణ ఇస్తున్నారు.
23వ పాసింగ్ అవుట్ పరేడ్‌లో 21 జాగిలాలు 28 మంది కేనైన్ హ్యాండర్లు ప్రదర్శించారు. 2004లో 11 జాగిలాలతో ప్రారంభమైన శిక్షణ ప్రస్తుతం 771కు చేరింది. ఉత్తమ ప్రతిభ చూపిన జాగిలాలకు వాటి హ్యాండర్లకు బహుమతి ప్రదానం చేశారు. జాగిలాలు చేసిన సెల్యూట్, ఫ్లవర్ బొకే డ్రిల్స్, ఒబిడియన్స్, రెఫ్యూజల్ ఆఫ్ ఫుడ్, లగేజ్ సెర్చ్, క్రాస్ వాక్ ,క్రైమ్ సీన్ డ్రిల్ ,క్యాచ్ ఆఫ్ ఎవిడెన్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.