నాగర్ కర్నూల్, వెలుగు: కుక్కలు పగబట్టినట్లే ప్రవర్తిస్తున్నాయి. స్కూల్‌కు వెళ్లే చిన్నారులు మొదలుకుని మహిళలు, వృద్ధుల వరకు ఎవరినీ వదలడం లేదు. ఒంటరిగా కనిపిస్తే చాలు గుంపులుగా వెంటపడి కురుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో జనవరి, ఫిబ్రవరి నెలలోనే 4,061 మంది కుక్కకాటుకు గురయ్యారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరంతా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ కోసం క్యూ కడుతున్నారు. జిల్లా, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో యాంటీ రేబిస్ ఇంజక్షన్ అందుబాటులో ఉన్నా.. పీహెచ్‌సీల్లో తప్పుడు లెక్కలు చెబుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
కలవరపెడుతున్న గణంకాలు
ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదవుతున్న కుక్కకాటు కేసుల గణాంకాలు కలవరపెడుతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో జనవరిలో 410 మంది, ఫిబ్రవరి ఇప్పటివరకు 1,232 మంది, మహబూబ్‌నగర్ జిల్లాలో జవవరిలో 958, ఫిబ్రవరిలో 359 మంది ఏఆర్‌వీ ఇంజక్షన్లు తీసుకున్నారు. నారాయణపేట జిల్లాలో జనవరిలో68, ఫిబ్రవరిలో 56, గద్వాలలో జనవరిలో 64, ఫిబ్రవరిలో 95, వనపర్తిలో జనవరిలో 475, ఫిబ్రవరిలో 344 మంది కుక్కకాటుకు గురయ్యారు.
హడలెత్తించిన ఫిబ్రవరి
నాగర్ కర్నూల్ జిల్లాలో ఫిబ్రవరి 25 వరకు ట్రీట్ మెంట్ తీసుకున్న వారి సంఖ్య 1,232 మందికి చేరింది. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో యావరేజ్‌గా రోజుకు ఐదు మంది చొప్పున ఇప్పుటి వరకు 160 మందికి ట్రీట్‌మెంట్ ఇచ్చినట్లు సూపరింటెండెంట్ డా.రఘు తెలిపారు. కల్వకుర్తి కమ్యూనిటీ హాస్పిటల్ 74, అచ్చంపేట కమ్యూనిటీ హాస్పిటల్‌లో 121 , కొల్లాపూర్ కమ్యూనిటీ హాస్పిటల్‌లో 121, పీహెచ్‌సీల్లో 723 మందికి ఏఆర్‌వీ ఇచ్చినట్లు మెడికల్ ఆఫీసర్లు వెల్లడించారు.
పీహెచ్‌సీల్లో తప్పుడు లెక్కలు
కమ్యూనిటీ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్‌లో యాంటీ రేబిస్ ఇంజక్షన్ అందుబాటులో ఉన్నా.. పీహెచ్‌సీల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. కుక్క, పాము కాటుకు సంబంధించిన యాంటీ రేబిస్, యాంటీ వీనస్ వాయిల్స్ సప్లై, స్టాక్ డిటెయిల్స్‌తో పాటు బాధితులకు ట్రీట్‌మెంట్ ఇచ్చినట్లు చూపిస్తున్న ఫిగర్స్‌లో తేడా ఉంటోంది. అన్ని పీహెచ్‌సీల్లో ఏఆర్‌వీ అందుబాటులో ఉన్నాయని చెబుతూనే రిజిస్టర్డ్ పేషంట్స్, ట్రీట్మెంట్ విషయంలోనే తలాతోక లేని సమాచారం ఇస్తున్నారు. చారకొండ, తోటపల్లి పీహెచ్‌సీల్లో డాక్టర్లు, సిబ్బంది కొరత కారణంగా డాగ్ బైట్, ఇతర ట్రీట్‌మెంట్ కోసం వస్తున్న పేషెంట్లను కల్వకుర్తికి రెఫర్ చేస్తున్నారు.
ఆహారంలో మార్పులే కారణమా?
ఆహారంలో మార్పులే కుక్కల దాడులకు కారణమని ఎనిమల్ హస్బెండరీ డాక్టర్లు చెబుతున్నారు. పట్టణాలు, గ్రామ శివార్లు, హైవేల పక్కన ఏర్పాటు చేస్తున్న దాబాలు, హోటళ్లు, చికెన్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లతో పాటు, బెల్టు షాపులు, సిట్టింగ్ సెంటర్లలో మిగిలిన నాన్‌వెజ్ ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. దీన్ని తింటున్న కుక్కలు.. ఇది దొరకని సమయంలో మనుషులు, పశువులపై దాడులు చేస్తున్నాయని చెబుతున్నారు.
నియంత్రణ చేసేదెవరు..?
కుక్కల నియంత్రణ, దాడుల కట్టడికి ఎవరు చొరవ తీసుకోవాలనే దానిపై ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకుండా పోయింది. పంచాయితీరాజ్, మున్సిపల్, వెటర్నరీ, ఇతర శాఖలకు ఏమైనా బాధ్యతలు ఉన్నాయా..? అంటే ఎవరికి వారు సంబంధం లేదనే అంటున్నారు. కనీసం కుటుంబ నియంత్రణ ఇంజక్షనైనా ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
జీవాలను చంపేస్తున్నయ్..
మనుషులపై దాడులు చేస్తున్న కుక్కలు గొర్రెలు, మేకలు, కోళ్లను ఏకంగా చంపేస్తున్నాయి. శుక్రవారం రాత్రి ఆమనగల్లు మండలం పోలేపల్లిలో రైతు ఎట్టయ్య వ్యవసాయ పొలంలోని గొర్రెల మందపై దాడిచేసిన కుక్కలు దాదాపు 30 గొర్రె పిల్లలను చంపేశాయి. ఉప్పునుంతల మండలం జప్తి సదగోడు గ్రామంలో కుక్కల దాడిలో 4 గొర్రె పిల్లలు చనిపోయాయి. అలాగే నాలుగు రోజుల కింద వనపర్తి జిల్లా పానగల్ మండలం బండపల్లి గ్రామంలో రైతు మద్దిలేటికి చెందిన మూడు బర్రె దూడలను చంపేశాయి.