- పట్టించుకోని అధికారులు
- రోజురోజుకి ప్రాబ్లమ్స్ అధికం
- ఐపీఎం,ఫీవర్ హాస్పిటల్స్ కి బాధితుల క్యూ
- కుక్కల బర్త్ కంట్రోల్ ను కాగితాల్లోనే చూపుతున్న బల్దియా
“ జనవరి 30న ఓల్డ్ సిటీ అసద్ బాబానగర్‌లో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. అతడు తీవ్రంగా గాయపడి స్పాట్లోనే చనిపోయాడు.
“ఈనెల 4న ఉప్పల్‌లో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనపై బల్దియా అధికారులకు కంప్లయింట్ చేస్తే ఇంతవరకు స్పందించలేదు.’’
హైదరాబాద్,వెలుగు: కుక్కలు కరుస్తున్నాయని బల్దియాకు కంప్లయింట్లు వెళ్తుంటే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నెల రోజుల్లోనే 4,429 కంప్లయింట్లు వస్తే, వీటిలో 91 మాత్రమే వెటర్నరీ వింగ్ అధికారులు సాల్వ్చేశారు. మిగతా 4,338 పెండింగ్‌లోనే పెట్టారు. ప్రస్తుతం సిటీలో వీధి కుక్కల బెడద ఎక్కువైంది. ప్రతి రోజు కుక్కల దాడుల్లో ఎంతో మంది గాయపడి హాస్పిటల్స్‌కు వెళ్తున్నారు. కుక్కల సంఖ్యను నియంత్రిం చాలంటే వాటికి స్టెరిలైజేషన్స్ ( సంతాన నియంత్రణ సర్జరీలు ) చేయడం, రేబిస్ సోకకుండా వ్యాక్సిన్స్ వేయడం చేయాలి. ఇంతకుమించి వేరే మార్గాల్లేవు. కుక్కలను నియంత్రించేందుకు బల్దియా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పే లెక్కలు కాగితాల్లోనే కనిపిస్తున్నాయి. కుక్కల సంఖ్య తగ్గినట్టు చెబుతున్నా పరిస్థితి లో ఎలాంటి మార్పు లేదు. జీహెచ్ఎంసీ అధికారులు సరిగా స్పందించకపోవడంతో జనం ఇబ్బందు లు పడుతున్నారు. గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 33,642 కంప్లయింట్స్ వస్తే వీటిలో కేవలం 1,947 పరిష్కరించారు. ప్రస్తుతం గ్రేటర్ లో 4 లక్షలకుపైగా కుక్కలు ఉన్నట్లు అధికారులు గుర్తించినా, అనధికారికంగా ఆ సంఖ్య 5 లక్షలకుపైనే ఉంది.
ఏటా రూ.10 కోట్లు ఖర్చు
జీహెచ్ఎంసీ ప్రతి ఏటా దాదాపు రూ.10కోట్ల వరకు కుక్కలపై ఖర్చు చేస్తుంది. స్టెరిలైజేషన్ కోసమే అధికంగా ఖర్చు పెడుతుంది. ప్రతి నెల300 వరకు స్టెరిలైజేషన్స్ చేస్తుంటారు. అంటే ప్రతి ఏటా రూ.6 కోట్లకు పైగా వీటికోసమే ఖర్చవుతాయి. అయినా రిజల్ట్ కనిపించడం లేదు. గతంతో పోలిస్తే డాగ్స్ సంఖ్య తగ్గిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కుక్కకాటు కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వెదర్చేంజస్తోనే కుక్క కాటు కేసులు పెరుగుతున్నాయని చెబుతూ అధికారులు తప్పించుకుంటున్నారు. కానీ వాటిని నియంత్రించేందుకు మాత్రం చర్యలు తీసుకోవడంలేదు.
ఏదైనా కాలనీకి కొత్త కుక్క వస్తే..
గ్రేటర్లో ఏ కాలనీకి వెళ్లినా రాత్రుళ్లు కుక్కలు గుంపులుగా తిరుగుతూ అరుస్తూ కనిపిస్తాయి. దీనికి పలు కారణాలు ఉన్నాయని వెటర్నరీ డాక్టర్లు పేర్కొంటున్నారు. కాలనీల్లో కుక్కల సంఖ్య ఎక్కువగా ఉండగా వాటికి సరిపడా ఫుడ్ దొరక్క వింతగా ప్రవర్తిస్తుంటాయి. ఏదైనా ఒక కాలనీలోకి కొత్తగా కుక్క వస్తే దాన్ని చూసి కూడా అరుస్తుంటాయి. అప్పుడు మనుషులు కనిపిస్తే దాడులు చేస్తాయి. స్టెరిలైజేషన్ కోసం జీహెచ్ఎంసీ వెటర్నరీ వింగ్సిబ్బంది కుక్కలను తీసుకెళ్లి ఇతర ప్రాంతాల్లో వదులుతుండగా వాటి బెడద ఎక్కువైందన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై అధికారులను అడిగితే అలాంటిదేం లేదని, ఏ ఏరియా నుంచైతే పట్టుకుని వెళ్తామో, తిరిగి అదే ప్రాంతంలో వదిలిపెడుతున్నామని అంటున్నారు.
ఐపీఎం,ఫీవర్ హాస్పిటల్స్ కి క్యూ
ప్రస్తుతం డైలీ 130 మంది వరకు ఫీవర్, ఐపీఎం హాస్పిటల్స్ కు కుక్కకాటు బాధితులు వస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. రెండు నెలల్లో 7 వేల మంది రేబిస్ వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చారన్నారు. నెలల వారీగా చూస్తే ఫీవర్హాస్పిటల్కి డిసెంబర్ లో 1,545, జనవరి 1,604 మంది వెళ్లగా, ఐపీఎంకి డిసెంబర్లో 2,089, జనవరిలో 2,240 మంది యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకున్నారు.
ఫుడ్ దొరక్కుంటే అరుస్తయ్
కుక్కలు సహజంగా రాత్రి టైమ్ లోనే ఎక్కువగా అరుస్తాయి. ఒకటి ఫుడ్లేక, రెండోది ఇతర కాలనీల కుక్కలు వస్తే ఇలా ప్రవర్తిస్తాయి. డంపింగ్‌యార్డుల వద్దకు వెళ్లి ఫుడ్ కోసం పోటీ పడుతూ అరుస్తాయి. ఆ టైమ్ లో వెహికల్స్‌పై వెళ్లే వారిమీద దాడి కూడా చేస్తుంటాయి. ఇది బ్రీడింగ్ సీజన్ కావడంతో ఈ టైమ్‌లో ఎక్కువగా దాడి చేస్తుంటాయి. సమ్మర్లో కుక్కలు వేడిని తట్టుకోలేవు. చికాకుగా ఉండి దాడి చేస్తాయి. జనం అలర్ట్‌గా ఉండాలి.
– శ్రీనివాస్, వెటర్నరీ డాక్టర్
స్టెరిలైజేషన్స్తో నియంత్రిస్తున్నం
కుక్కల సంఖ్యను తగ్గించేందుకు స్టెరిలైజేషన్ చర్యలు తీసుకుంటున్నం. ఐదు ఎన్జీవో ( నాన్ గవర్నమెంట్ఆర్గనైజేషన్స్) లతో కలిసి డాగ్స్బర్త్ కంట్రోల్నియంత్రిస్తున్నం. ప్రతి నెలా 300 లకుపైగా బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు (స్టెరిలైజేషన్) చేస్తున్నం. సర్జరీ చేసి యాంటి రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వడంతో పాటు రెండు రోజులు అబ్జర్వేషన్లో ఉంచుతున్నం. త్వరలోనే యాంటి బర్త్ కంట్రోల్(ఏబీసీ) యాప్‌ని కూడా లాంచ్చేస్తున్నం.
– డాక్టర్ అబ్దుల్ వకీల్, చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ
For More News..