జగిత్యాల జిల్లాలో రోజు రోజుకు కుక్కలు రెచ్చిపోతున్నాయి. చిన్నా.. పెద్ద తేడా లేకుండా కండలు పీకేస్తున్నాయి. కుక్కల భయంతో వీధుల్లో ఒంటరిగా తిరగాలంటే ప్రజలు భయాందోళనకు గురయ్యే పరిస్థితి నెలకొంది. తాజాగా కోరుట్ల నియోజకవర్గంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి.
కోరుట్ల నియోజకవర్గంలో వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. మూడు వేరువేరు గ్రామాల్లో ఒకేరోజు ఆరుగురిపై కుక్కలు దాడి చేశాయి. మెట్ పల్లి మండలం బండలింగాపూర్ గ్రామంలో ఇద్దరిని కరిచాయి. ఇబ్రహింపట్నం మండలం అమ్మక్కపేటలో మరో ఇద్దరిని, సతక్కపల్లిలో మరో ఇద్దరిపై కుక్కలు తమ ప్రతాపం చూపాయి. కుక్కల దాడిలో తీవ్ర గాయాలైన వారిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి, మరికొందరిని మెట్ పల్లి ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళన కరంగా ఉందని వైద్యులు తెలిపారు. కుక్కల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.