తెలంగాణలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. కనిపించిన ప్రతి మనిషిపై దాడులకు దిగుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై వీధి కుక్కలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామంలో చిన్నారిపై వీధి కుక్క ల దాడి చేశాయి. ఈ దాడిలో జహీదా అనే పాప కు తీవ్ర గాయాలు అయ్యాయి. మెరుగైన వైద్యం కోసం చిన్నారిని హుజూర్నగర్ ప్రభుత్వ హాస్పటల్కు తరలించారు.
అటు గద్వాల్ జిల్లాలో ఐజ మున్సిపాలిటీ పరిధిలో రాత్రి వీధికుక్కలు స్వైర విహారం చేశాయి. కుక్కల దాడిలో 20 గొర్రెలు చనిపోగా, మరో 20కి పైగా గాయపడ్డాయి. గొర్రెలను కుక్కలు చంపడంతో రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు.
మరోవైపు మార్చి 8వ తేదీన సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో 9 ఏళ్ల బాలికపై కుక్కలు దాడి చేసేందుకు ప్రయత్నించాయి. ఇంటి నుంచి షాపునకు వెళ్తున్న సమయంలో వీధి కుక్కలు బాలిక వెంటపడ్డాయి. దీన్ని గమనించిన చేపూరి తిరుపతి అనే మోటార్ మెకానిక్ కుక్కలను తరిమి బాలికను కాపాడాడు.