
గొర్రెల పాకపై కుక్కల దాడి చేయడంతో ఏడు గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లి నియోజకవర్గంలోని డేగానపల్లిలో 2023 జూలై 22 శనివారం రాత్రి చోటుచేసుకుంది.
ఈ ఘటనపై బాధితుడు సురేష్ మాట్లాడుతూ అర్ధరాత్రి ప్రాంతంలో తాను పోషించుకుంటున్న గొర్రెలను పాకలో ఉంచగా,సుమారు ఏడు గొర్రెలపై కుక్కలు విచక్షణారహితంగా దాడి చేశాయని వాపోయాడు,ఈ దాడిలో ఏడు గొర్రెలు మృతి చెందాయని తెలిపాడు.
దీనిని ఉదయం 6 గంటల సమయంలో తాను గమనించానని మరో అయిదు గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపాడు. అధికారులు దీనిపై స్పందించి తనను ఆదుకోవాలని కన్నీరుమున్నీరుగా విలపించాడు. గ్రామంలో కుక్కల బెడద నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.