
‘ఆ! ఏం కాదులే’ అనుకునే విషయాల్లో దంత సమస్యను ముందుగా చెప్పుకోవాలి. అదే తగ్గిపోతుందిలే అని చాలాసార్లు దాన్నలా వదిలేస్తారు.ఇదొక్కటనే కాదు, పంటి నొప్పి వచ్చినా, దుర్వాసన ఇబ్బందిగా మారినా వెంటనే ‘డాక్టర్‌ను కలుద్దాం’ అనుకోరు ఎక్కువమంది. కానీ, డాక్టర్‌ను కలిసి చూస్తే చాలా సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి. మనకు ఎక్కువగా వినిపించే దంత సమస్యలకు, సందేహాలకు డెంటల్ డాక్టర్ వై.ఎస్.రెడ్డి ఇచ్చిన సమాధానాలు ఇవి.
దవడ పళ్ల మీద నల్లటి మచ్చలు కనిపిస్తున్నాయి. దీనికి ఏమైనా చేయగలమా?
దవడ పళ్ల మీద నల్ల మచ్చలు కనిపించడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి తిన్న ఆహారం వల్ల వచ్చిన రంగు మాత్రమే కావొచ్చు. లేదా ఆ పంటికి పట్టిన గార కావొచ్చు. ఈ సమస్యను క్లీనింగ్ లేదా స్కేలింగ్ ద్వారా శుభ్రం చేయవచ్చు. దీంతో మచ్చలు కనిపించకుండా పోతాయి. పళ్లు పుచ్చిపోయినప్పుడు, పిప్పి పడుతున్నప్పుడు కూడా నల్ల మచ్చలు కనిపిస్తాయి. ముందుగా వీటి వల్ల నొప్పి లాంటి ఇబ్బంది లేకపోయినా డెంటిస్ట్‌ని కలవాలి. దాన్ని క్లీన్ చేసి సిమెంట్ ఫిల్లింగ్ చేస్తారు. పంటి రంగులో కలిసిపోయే సిమెంట్‌లు వచ్చాక ఫిల్లింగ్ చేసినట్టు తెలిసే అవకాశం లేదు. పిప్పి పళ్లలో సిమెంట్ ఫిల్లింగ్ చేయించుకోకపోతే.. అక్కడ ఆహారం చేరి.. పిప్పి ఇంకా పెద్దదవుతుంది. దాంతో నొప్పి పుట్టి, ఆ పన్నును తీయాల్సిన పరిస్థితి రావొచ్చు.
పళ్లు వదులుగా అవుతున్నాయి. ఎందుకు? ఏం చేయాలి?
పళ్ల చుట్టూ ఉండే చిగురు కింది ఎముక పళ్లను గట్టిగా పట్టుకుని ఉంటుంది. చిగురు ఎముకకు వ్యాధి సోకినప్పుడు పళ్లు వదులయ్యే అవకాశం ఉంటుంది. అలాగే, పంటికి, చిగురుకి మధ్య గార ఏర్పడినప్పుడు పన్ను చిగురు వాస్తుంది. అక్కడ చేరిన బ్యాక్టీరియా వల్ల చిగురు వ్యాధి వస్తుంది. కాబట్టి, పంటికి , చిగురుకి మధ్యన గారను రోజూ శుభ్రం చేయాలి. చిగురు వ్యాధి లోపలి వరకు ఉంటే క్యూరోటర్జన్‌గానీ, రూట్‌ప్లెయినింగ్ గానీ, పేరో డెంటల్ ఫ్లాప్ సర్జరీగానీ చేయించుకోవాలి. దాంతో ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. ట్రీట్‌మెంట్ తర్వాత కూడా పళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. రెండు పూటలా బ్రష్ చేసుకోవాలి. తిన్న తర్వాత పుక్కిలించడం మర్చిపోవద్దు.
పళ్ల మధ్య ఆహారం ఇరుక్కుంటోంది. దాన్ని సిమెంట్‌తో నింపడానికి వీలవుతుందా?
పళ్లు పుచ్చిపోయినప్పుడు, రెండు పళ్ల మధ్య లోపల పుచ్చిపోయినప్పుడు పళ్ల మధ్య ఖాళీ ఏర్పడుతుంది. తిన్న ఆహారం అక్కడ ఇరుక్కుంటుంది. ఇలాంటప్పుడు ఎక్స్‌రే తీయించాలి. పళ్ల మధ్య పుచ్చు ఉన్నట్టు నిర్ధారణ అయితే.. దాన్ని క్లీన్ చేసి.. సిమెంట్‌తో ఫిల్ చేయొచ్చు. పళ్లు విరిగిపోవడం వల్ల కూడా సందులు ఏర్పడతాయి. వాటిని సిమెంట్ లేదా క్యాప్ ద్వారా పూడ్చొచ్చు. చిగుళ్ల వ్యాధి వచ్చినప్పుడు.. చిగురు తగ్గిపోతుంది. అప్పుడు పళ్ల మధ్య సందు వస్తుంది. అక్కడా ఆహారం చేరుతది. చిగురు తగ్గిపోయిన దగ్గర సిమెంట్ పెట్టడం కుదరకపోవచ్చు. అలాంటప్పుడు క్యాప్‌తో క్లోజ్ చేయాలి. సందులో ఇరుక్కున్న ఆహారాన్ని ఇంటర్ డెంటల్ బ్రష్ తో క్లీన్ చేసుకుంటే మంచిది.
ఉదయం, రాత్రి రెండు సార్లూ పళ్లు తోముకుంటున్నా. అయినా నోటి నుంచి దుర్వాసన వస్తోంది ఎందుకు?
రెండు పూటలా పళ్లు తోముకున్నప్పటికీ పళ్ల మధ్య ఆహారం మిగిలిపోతే నోటి నుంచి దుర్వాసన వస్తుంది. కాబట్టి తిన్న వెంటనే పుక్కిలించాలి. అలాగే పళ్లకు గట్టి గార పట్టినా, పిప్పి పళ్లకు ఇన్‌ఫెక్షన్ సోకినా నోటి నుంచి దుర్వాసన వస్తుంది. వంకర పళ్లు, బయటకు రాని పళ్లు, నోటి ఇన్‌ఫెక్షన్ ఉన్నా కూడా దుర్వాసన వస్తుంది. కొన్ని సార్లు షుగర్, ఊపిరితిత్తులు,ఈఎన్‌టి (చెవి, ముక్కు, గొంతు) సంబంధిత వ్యాధులతో పాటు అజీర్ణం, గ్యాస్ట్రో సమస్యలతో బాధపడుతున్నవాళ్లకు కూడా నోటి నుంచి దుర్వాసన వస్తుంది. కాబట్టి ఇలాంటి టైంలో నోటినే కాకుండా.. జనరల్ హెల్త్ కండిషన్‌ని కూడా చెక్ చేయించుకోవాలి.