ఆంధ్రప్రదేశ్ పేరులోనే దోఖా ఉంది- ‘మేరా సఫర్’

పెద్దమనుషుల ఒప్పందం ఉల్లంఘన, విద్య, ఉద్యోగ రంగాల్లో జరిగిన అన్యాయమే 1969 ఉద్యమానికి కారణం. అసలు ఆంధ్రప్రదేశ్ పేరులోనే దోఖా ఉంది. తెలంగాణాంధ్ర అని రాష్ట్రానికి పేరు పెట్టాలని ఢిల్లీలో రెండు ప్రాంతాల లీడర్లు అనుకున్నరు. ఏం అయిందో ఏమో హైదరాబాద్ వచ్చే లోపట్నే ఆంధ్రప్రదేశ్ అని వాళ్లకు వాళ్లే పేరు పెట్టుకున్నరు. తెలంగాణ నాయకులను ఒక్క మాట కూడా అడగలేదు. ఇక అప్పటి నుంచి ఆంధ్రోళ్ల ధోఖాలు షురూ అయినయ్. పెద్ద మనుషుల ఒప్పందంలో అనుకున్నట్టు ఆంధ్ర వ్యక్తి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ లీడర్ డిప్యూటీ సీఎం కావాలె. కానీ అట్లా జరగలేదు. దాంతో తెలంగాణ లీడర్లు నారాజ్ అయిన్రు. అధిష్టానం భయంతో గప్చుప్ గున్నరు. తెలంగాణ ప్రజలు మాత్రం వీటన్నింటిని మనసుల పెట్టుకున్నరు. సరైన టైం కోసం ఎదురుచూసిన్రు.

సొచ్చేదాక సోమలింగం సొచ్చినంక రామలింగం. ఈ మాట ఆంధ్రోళ్లకు జబర్దస్త్ సెట్ అయితది. విలీనం జరిగేదాక ‘‘మనం మనం అన్నదమ్ములం. మీకు మేమున్నం’’ అని ఎక్కడలేని ప్రేమ చూపించిన ఆంధ్ర నాయకులు ఆంధ్రప్రదేశ్ ఏర్పడంగనే ఆ ముచ్చట యాద్ మరిచిన్రు. ప్రతిక్షణం మనల్ని అవమానించిన్రు. కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని, తెలుగు రాదని, తెలివిలేదని ఆనాటి సర్కార్ పెద్దలు తెలంగాణ ఉద్యోగుల ఇజ్జత్ తీసిన్రు. మన ఉద్యోగులు పనికి రారని ఆంధ్ర నుంచి ఉద్యోగులను సెక్రటేరియట్కు తెప్పించుకున్నరు. రాష్ట్రపతి ఉత్తర్వులను పట్టించుకోలేదు. తలకు దెబ్బ తాకింది.. బేహోష్ అయిన..

ముషీరాబాద్ జైల్ల ఉన్న విద్యార్థి, రాజకీయ నేతల హత్యకు కుట్రలు చేస్తున్నట్లు తెలిసింది. దాంతో విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్య ప్రజలు కొందరు వందలాదిగా ముషీరాబాద్ జైలును ముట్టడించిన్రు. ముషీరాబాద్ విషయం తెలిసిన వెంటనే నేను అక్కడికి పోయిన. నన్ను చూడంగనే ఉద్యమకారులకు ఎక్కడలేని ధైర్యం వచ్చింది. పోలీసులు శాన మంది ఉన్నా, లెక్కచేయకుండా జైలు లోపలికి సొచ్చుకపోవడానికి కోశిశ్ చేసిన్రు. పోలీసులు టియర్ గ్యాస్ వదిలిన్రు. అయినా నిరసనకారులు వెనుకకు తగ్గలేదు. దాంతో ఫైరింగ్ చేసిన్రు.

పోలీస్ కాల్పులల్ల నా పక్కనే ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయిన్రు. నా తలకు దెబ్బ తాకింది. నేను బేహోష్ అయిన. నన్ను ఆసుపత్రికి తీసుకపోవడానికి కొంతమంది జీపు తీసుకొచ్చిన్రు. ఆ జీపుపైనా కాల్పులు జరిపిన్రు. ఆ గందరగోళంల జీపు పల్టీ కొట్టింది. జీపు నా మీద పడ్డది. నా ముక్కు నుంచి, నోట్ల నుంచి మస్తు రక్తం పోయింది. ఆ పరిస్థితిల నన్ను చూసిన ఏ ఒక్కరికీ నేను బతుకుతనన్న నమ్మకం లేకుండె. అయినా ఆశ చావక ఆసుపత్రికి తీసుకపోయిన్రు. నాకు దెబ్బలు తాకిన విషయం తెలవడంతో చెన్నారెడ్డి గాబరాగాబరాగా దవఖానకు వచ్చిండు. అద్దరాత్రి రెండు గంటల దాక నా బెడ్ పక్కనే కూర్చున్నడు. ఈ విషయం నేను స్పృహలోకి వచ్చినంక తెలిసింది. నేను మొండోన్ని. చచ్చిపోతడని అంతా అనుకున్న నాకు ఏం కాలేదు. మూడు రోజుల తరువాత నాకు హోష్ వచ్చింది.

కో– ఆపరేటివ్ సొసైటీలు తెచ్చిన..

1961ల నేను ఐఎన్ టీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ అయినంక కార్మికుల సంక్షేమం కోసం ఏదైనా చేయాలనిపించింది. అందుకే కో– ఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేసిన. ఎందుకంటే కార్మికులు కష్టపడి సంపాదించిందంతా వడ్డీలకే సరిపోయేది. వడ్డీ వ్యాపారులు కార్మికులను పీల్చి పిప్పిచేసేటోళ్లు. అందుకే కార్మికుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కో– ఆపరేటివ్ సొసైటీలను షురూ చేసిన. రాష్ట్రంల ఉన్న కో– ఆపరేటివ్ సొసైటీలన్నింటిని కలిపి స్టేట్ కో– ఆపరేటివ్ ఫెడరేషన్ ను ఏర్పాటు చేయించిన. ఆనాడు రాష్ట్రంల చిన్నా, పెద్ద పరిశ్రమలన్నింట్ల దాదాపు నూటొక్క యూనియన్లను నడిపిన. కొన్నింటికి నేనే ప్రత్యక్షంగా నాయకత్వం వహిస్తే మరికొన్నింటిని నా అనుచరులకు అప్పచెప్పిన. మా యూనియన్ పని విధానాలను మా ప్రత్యర్థులైన ఏఐటీయూసీ లీడర్లు కూడా మెచ్చుకునేవాళ్లు.

గుడిసెల వెంకటస్వామినైన..

గుడిసె వాసులకు నేనంటే ప్రాణం. దేవుడోలె చూసేవాళ్లు.. కల్మషం లేని ఆ మనుషుల ఆప్యాయత, అనురాగం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేది. కాలనీలకు నా పేరు పెడతమని ఒక్కోసారి జిద్దు చేసేది. వద్దని వాళ్లకు నచ్చచెప్పిన వినకపోయేది. ఎట్లనో బుదరకించి పంపించేది. గుడిసెవాసులంత నన్ను “కాకా” అని ప్రేమతో పిలిచేది. ఆ పిలుపే నా మారు పేరయింది. ఇంతేకాదు గుడిసెల పోరాటంతో నా ఇంటి పేరు కూడా మారింది. గడ్డం వెంకటస్వామి గుడిసెల వెంకటస్వామి అయిండు. గుడిసెల పోరాటంల సెంటు భూమిని కూడా నా స్వార్థానికి తీసుకోలేదు. కట్టుబట్టలతో నా ముందుకొచ్చిన ప్రతి పేదోడికీ నేను స్థలం చూపించి గుడిసె వేయించిన. ఇప్పుడా స్థలాల విలువ కోట్లకు చేరింది. పేరు కోసమో, పైసల కోసమో ఇదంతా చెయ్యలేదు. నా కోసం, నా ఆత్మసంతృప్తి కోసం చేసిన. పేదోడి కోసం అట్ల చేయడం మనిషిగా నా కనీస బాధ్యత అనిపించింది. అందుకే ఎన్నో ఆటుపోట్లు, కష్టనష్టాల మధ్య గుడిసెల పోరాటాన్ని యజ్ఞం లెక్క చేసిన. నా వల్ల నిరుపేదలు, కష్టజీవులకు ఇంత ఆసరా దొరికిందన్న సంతృప్తి చాలు. దాని ముందు ప్రపంచంలోని సంపదంతా బలాదూరే.                                                                                                                                              

కాకా ఆత్మకథ మేరా సఫర్ నుంచి