ముంబై: డాలరే అసలైన ఫైనాన్షియల్ టెర్రరిస్టని కోటక్ బ్యాంక్ ఛైర్మన్ ఉదయ్ కోటక్ సంచలనమైన కామెంట్స్ చేశారు. మన డబ్బంతా నోస్ట్రో అకౌంట్లలో ఉంటుంది. అమెరికాలోని వారు రేపు ఉదయం నుంచి మీ డబ్బు విత్‌డ్రా చేసుకోవడం కుదరదని చెప్పొచ్చు. అలాంటప్పుడు మనం ఇరుక్కుపోతామని ఉదయ్ కోటక్ వివరించారు. నోస్ట్రో అకౌంట్ అంటే ఏదైనా బ్యాంక్ మరో బ్యాంక్ వద్ద ఫారిన్ కరెన్సీ రూపంలో అట్టే పెట్టుకునే అకౌంట్. రిజర్వ్ కరెన్సీ పవర్ అంటే ఇదేనని ఉదయ్ కోటక్ వెల్లడించారు. ప్రపంచమంతా ఇప్పుడు మరో రిజర్వ్ కరెన్సీ కోసం ఎదురు చూస్తోందని పేర్కొన్నారు. డాలర్‌కి ప్రత్యామ్నాయంగా రిజర్వ్ కరెన్సీగా అవతరించే సత్తా మన రూపాయికి ఉందని చెప్పారు.
ఈటీ అవార్డుల ఫంక్షన్లో ఉదయ్ కోటక్ మాట్లాడారు. రిజర్వ్ కరెన్సీగా మారే సత్తా యూరప్, యూకే లేదా జపాన్ దేశాల కరెన్సీలకు లేదని చెప్పారు. ప్రపంచంలోని చాలా దేశాలకు చైనాపైన నమ్మకం లేదని పేర్కొన్నారు. రిజర్వ్ కరెన్సీగా అవతరించాలంటే ఇండియా ఏం చేయాలనే దానిని కూడా కోటక్ ప్రస్తావించారు. పటిష్టమైన ఇన్స్టిట్యూషన్స్ను దేశం నిర్మించాలి. ఏ ఒక్కరి ఇష్టాలకు అనుగుణంగానో కాకుండా, స్ట్రాంగ్ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మరోవైపు నిజాయితీగా పన్ను కట్టే వారిని మెచ్చుకోవాలని, ఇదే టైములో ఎగ్గొట్టే వారిని శిక్షించాలని ఫైనాన్స్ మినిస్టర్నిర్మలా సీతారామన్ ఈ అవార్డుల ఫంక్షన్లో పేర్కొన్నారు.