- దోమకొండను మున్సిపాలిటీగా మారుస్తాం
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కామారెడ్డి, భిక్కనూరు, వెలుగు: కామారెడ్డిని అభివృద్ధి చేసేందుకే కేసీఆర్ ఇక్కడ పోటీ చేస్తున్నారని బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బుధవారం భిక్కనూరు, దోమకొండ మండల కేంద్రాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభల్లో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించి ఇక్కడ పోటీ చేయాలని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కోరారని, అందుకే కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారే తప్ప ఎవరి భూములు లాక్కోడానికి కాదన్నారు. సీఎం కేసీఆర్ కామారెడ్డికి వస్తే భూములు తీసుకుంటారని బీజేపీ లీడర్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. గోదావరి జలాలు కామారెడ్డి నియోజకవర్గానికి తీసుకొచ్చి ఇక్కడి ప్రజల కాళ్లు కడుగుతామన్నారు.
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే భిక్కనూరులో మినీ స్టేడియం నిర్మిస్తామన్నారు. దోమకొండను మున్సిపాలిటీగా మార్చడంతో పాటు, ఇక్కడ డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. బీబీపేట మండలం కోనాపూర్(పోసానిపల్లి) మా నాయినమ్మ ఊరని ఆ ఊరితో ఉన్న అనుబంధాన్ని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ..
గత ఎన్నికల్లో షబ్బీర్ అలీని గంప కింద కమ్మానని, ఈ సారి ఆయన వచ్చినా, రేవంత్‌రెడ్డి వచ్చినా మళ్లీ గంప కింద కమ్మడం ఖాయమన్నారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, పార్టీ జిల్లా ప్రెసిడెంట్ముజీబోద్దిన్, ఎంపీపీ గాల్‌రెడ్డి, జడ్పీటీసీలు పద్మ, తిర్మల్‌గౌడ్, పార్టీ మండల ప్రెసిడెంట్లు నర్సింహారెడ్డి, బిక్కాజీ బల్వంత్‌రావు, మధుసూదన్‌రావు, సీనియర్‌నేతలు కొమ్ముల తిర్మల్‌రెడ్డి, రామారావు, తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి, వేణుగోపాల్‌గౌడ్, నల్లవెల్లి అశోక్పాల్గొన్నారు.