సినిమాను తలపించిన దోమలగూడ రాబరీ కేసు

సినిమాను తలపించిన దోమలగూడ రాబరీ కేసు
  • ఈ నెల 2న ఘటన 
  •  ప్రధాన నిందితుడు బాధితుడికి స్వయానా తమ్ముడు 
  • 12 మంది నిందితులు అరెస్ట్​ 
  • రూ.1.20 కోట్ల విలువైన బంగారం స్వాధీనం 


హైదరాబాద్ సిటీ, వెలుగు: దోమలగూడ పరిధిలో ఈ నెల 2న జరిగిన రాబరీ కేసు సినిమాను తలపించిందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. నిందితులు కత్తులు, తుపాకులతో బెదిరించి దొంగతనానికి పాల్పడ్డారని చెప్పారు. కేసులో ప్రధాన నిందితుడు ఇంద్రజిత్ ఘోరాయ్.. బాధితుడు రంజిత్ కు స్వయానా తమ్ముడన్నారు. ఈ కేసు వివరాలను తన ఆఫీస్​లో ఆదివారంసీపీ వెల్లడించారు.

అన్న వ్యాపారంపై ఈర్షతో.. 

కొన్నేండ్ల క్రితం పశ్చిమ బెంగాల్ నుంచి రంజిత్, ఇంద్రజిత్ ఘోరాయ్​కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌‌‌‌కు వలస వచ్చారు. వీరు అరవింద్ నగర్, దోమలగూడ ప్రాంతాల్లో బంగారు ఆభరణాల వ్యాపారం చేస్తున్నారు. ఇంద్రజిత్ ఆన్‌‌‌‌లైన్ గేమింగ్, బెట్టింగులకు అలవాటు పడ్డాడు. దీంతో వ్యాపారంలో 
నష్టపోయాడు. అన్న వ్యాపారం మంచిగా నడుస్తుండడంతో ఈర్శ పెంచుకున్నాడు. అన్నదమ్ముల మధ్య కొన్ని వివాదాలు కూడా ఉండడంతో పగ పెంచుకున్నాడు. రంజిత్ ఇంట్లో దోపిడీకి ప్లాన్ చేశాడు. ఇంద్రజిత్​కు ఆన్​లైన్​బెట్టింగ్ ద్వారా పరిచయమైన అల్తాఫ్ మహ్మద్‌‌‌‌, సయ్యద్ ఇర్ఫాన్ అహ్మద్‌‌‌‌ ద్వారా దోపిడీకి ప్లాన్ చేశాడు. 

 న్యాయవాది సలహాతో.. 

ఇంద్రజిత్​సూచనతో సయ్యద్ ఇర్ఫాన్, తన తమ్ముడు హబీబ్ హుస్సేన్ తో ఒక టీమ్​ఏర్పాటు చేశాడు. పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు ఇంద్రజిత్​ ఓ న్యాయవాది సలహా కూడా తీసుకున్నారు. మైలార్​దేవ్​పల్లికి చెందిన రౌడీషీటర్ మహమ్మద్ అర్భాజ్, హబీబ్ హుస్సేన్​గ్యాంగ్ తో కలిసి రెక్కీ నిర్వహించారు. డిసెంబర్10న మొదటిసారి దోపిడీకి ప్లాన్ చేశారు.

కానీ, ఇంట్లో బంగారు ఆభరణాలు తయారు చేసే కార్మికులు ఉండడంతో ఆ ప్లాన్ విరమించుకున్నారు. తిరిగి రెండు రోజుల తర్వాత ఇంద్రజిత్ ప్లాన్ ప్రకారం, మహ్మద్ అర్బాజ్​ నేతృత్వంలోని దొంగల ముఠా రంజిత్ ఇంటికి చేరుకుంది.12వ తేదీ తెల్లవారుజామున ఇంట్లోకి వెళ్లి కత్తులు, లైటర్​గన్​చూపించి కుటుంబసభ్యులను గాయపరిచి బంగారం దోచుకెళ్లారు.

బయట నంబర్ ప్లేట్ లేని కారు రెడీగా పెట్టుకొని పరారయ్యారు. చోరీ చేసిన సొత్తును ఆరాంఘర్ ఫ్లైఓవర్ పై అల్తాఫ్ మొహమ్మద్ ఖాన్ కు అప్పగించారు. ఈ కేసుపై సెంట్రల్ టాస్క్ ఫోర్స్, దోమలగూడ పోలీసులు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు కొనసాగించారు. ఎట్టకేలకు 12 మంది నిందితులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి  రూ.1.20 కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.