దోమలపెంట, ఈగలపెంట గ్రామాల్లో.. నీటి సరఫరాతో ఇబ్బందులు

దోమలపెంట, ఈగలపెంట గ్రామాల్లో..  నీటి సరఫరాతో ఇబ్బందులు
  • మంచినీటికి కటకట
  • పది రోజులకోసారి నీటి సరఫరాతో ఇబ్బందులు

 అమ్రాబాద్, వెలుగు: పది రోజులకోసారి నీటిని సరఫరా చేస్తుండడంతో అమ్రాబాద్  మండలం దోమలపెంట, ఈగలపెంట గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. 1966లో శ్రీశైలం ప్రాజెక్ట్  నిర్మాణ సమయంలో వచ్చిన కూలీలు, ఇంజనీర్లు, కార్మికులు దోమలపెంట, ఈగలపెంట గ్రామాల్లో ఉంటున్నారు. కృష్ణా నది నుంచి మోటార్ల ద్వారా టూరిజం మృగవని రిసార్ట్  సమీపంలోని తొట్టెల్లోకి నీళ్లు ఎత్తిపోసి వాటిని గ్రామానికి సప్లై చేసేవారు. ప్రస్తుతం పైపులు శిథిలమై లీకేజీలు ఏర్పడడంతో ప్రస్తుతం 10 రోజులకు ఒకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది.

ఆరేండ్లుగా పెండింగ్​లో భగీరథ పనులు..

2020లో గత ప్రభుత్వం రూ.6.58 కోట్ల నాబార్డ్  నిధులతో మిషన్​ భగీరథ పనులు ప్రారంభించారు. కృష్ణానది నుంచి దోమలపెంట వరకు 3.5 కిలోమీటర్ల మేర పైపులైన్  ఏర్పాటు చేసి గ్రామంలో ఇంటింటికీ నల్లాలు బిగించి తాగునీరు అందించాలని నిర్ణయించారు. 

2023 ఆగస్టు నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉన్నా, నేటికి పూర్తి కాలేదు. నాసిరకమైన పైపులు వేయడంలో ఇప్పటికే జాయింట్లు ఊడిపోయాయి. పనులు ప్రారంభించి ఆరేండ్లు గడుస్తున్నా పనులు పెండింగ్​లోనే ఉన్నాయి. ఈ క్రమంలో దోమలపెంటకు చెందిన కటకం వెంకటేశ్, రాములమ్మ ఫౌండేషన్  ద్వారా నీటిని సప్లై చేస్తు న్నారు. ఇంటికి రెండు డ్రమ్ముల నీళ్లు, మూడు బాటిళ్ల ఫిల్టర్  నీటిని అందిస్తున్నారు. ఈ విషయమై ఆర్ డబ్ల్యూఎస్  డీఈ హేమలతను వివరణ కోరగా, మరో రెండు నెలల్లో మిషన్​ భగీరథ పనులు పూర్తి చేసి దోమలపెంట, ఈగలపెంట గ్రామాలకు నీటిని అందిస్తామని తెలిపారు.