
Hyderabad News: రెండు రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం దేశంలో డొమెస్టిక్ అవసరాలకు ఉపయోగించే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల రేట్లను పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. ఈ క్రమంలో ఒక్కో సిలిండర్ రేటు దేశవ్యాప్తంగా రూ.50 చొప్పున పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో 2025లో తొలిసారిగా గృహ వినియోగదారులు వాడే సిలిండర్ల రేట్లు పెంచటం హైదరాబాదీలపై ఎక్కువ భారీగాన్ని మోపింది.
ప్రస్తుతం దేశంలోని వివిధ మెట్రో నగరాల కంటే హైదరాబాదులో సామాన్యులు ఉపయోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల రేటు అత్యధికంగా ఉండటం గమనార్హం. వివిధ నగరాల్లోని పెరిగిన రేట్లను పరిశీలిస్తే.. హైదరాబాదులో రూ.905, కలకత్తాలో రూ.879, చెన్నైలో రూ.868, బెంగళూరులో రూ.855, దిల్లీలో రూ.853గా ఇవి ఉన్నాయి. అయితే హైదరాబాదులో మిగిలిన చోట్ల కంటే 14.2 కేజీల డొమెస్టిక్ లిసిండర్ ధర ఎందుకు ఎక్కువగా ఉందనే అనుమానం అందరిలోనూ ఉంది.
వాస్తవానికి దేశవ్యాప్తంగా సిలిండర్ ధరల పెంపును కేంద్ర ప్రభుత్వం ఒకే మెుత్తంలో చేపట్టినప్పటికీ.. వివిధ నగరాలు, రాష్ట్రాల్లో మాత్రం ధరల్లో వ్యత్యాసం కొనసాగుతోంది. ఈ తేడాలకు అసలు కారణం స్థానిక ప్రభుత్వాలు విధించే పన్నులు, రవాణా ఖర్చులే కారణం. తెలంగాణలోని అదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు అత్యధికంగా రూ.930 వద్ద ఉండగా.. దీని తర్వాత అత్యధిక రేటు మాత్రం నిజాంబాద్ లో రూ.928 వద్ద ఉంది.
కేంద్ర మంత్రి ఏమన్నారంటే..
పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఏప్రిల్ 8 నుండి అమలులోకి వచ్చేలా సబ్సిడీ మరియు సబ్సిడీ లేని డొమెస్టిక్ సిలిండర్‌పై రూ.50 పెంచినట్లు సోమవారం ప్రకటించారు. దీంతో పీఎం ఉజ్వల యోజన కింద సబ్సిడీ సిలిండర్ రేటు రూ.500 నుంచి రూ.550కి పెరగగా.. సాధారణ వినియోగదారులు ఉపయోగించి సిలిండర్ రేటు రూ.803 నుంచి రూ.853కి పెరిగింది. ఇండియా వినియోగిస్తున్న ఎల్పీజీలో 60 శాతం దిగుమతి చేసుకుంటున్నందున అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చే మార్పుల ప్రభావం ధరలపై ఉంటుంది.