న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్‌లో 3,56,752 ప్యాసింజర్ వెహికల్స్ (కార్లు, బస్సులు వంటివి) హోల్‌సేల్స్ జరిగాయి. కిందటేడాది సెప్టెంబర్‌లో అమ్ముడైన 3,61,717 బండ్లతో పోలిస్తే ఒక శాతం తగ్గాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) డేటా ప్రకారం, కిందటి నెలలో 20,25,993 టూవీలర్లు అమ్ముడయ్యాయి. ఏడాది ప్రాతిపదికన 16 శాతం వృద్ధి నమోదయ్యింది. త్రీవీలర్ అమ్మకాలు 74,671 యూనిట్ల నుంచి 7 శాతం పెరిగి 79,683 యూనిట్లకు చేరుకున్నాయి. పండుగ సీజన్‌పై సియామ్ ఆశలు పెట్టుకుంది.
ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3–5 శాతం వృద్ధి చెందుతాయని అంచనా వేస్తోంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో అమ్మకాల గ్రోత్ 5 శాతం నుంచి 8 శాతం మధ్య ఉంటుందని అంచనా వేసింది. ఈ ఏడాది ఏప్రిల్ – సెప్టెంబర్ మధ్య మొత్తం 20,81,143 ప్యాసింజర్ వెహికల్స్ డీలర్‌షిప్‌లకు డిస్పాచ్ కాగా, కిందటేడాది ఇదే టైమ్‌తో పోలిస్తే కొద్దిగా పెరిగాయి.