కొమురెల్లి మల్లన్నపై ఆధిపత్య కుట్ర

కొమురెల్లి మల్లన్నపై ఆధిపత్య కుట్ర

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. బలమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక మూలాలున్న దేశంగా కూడా భారతదేశానికి పేరుంది. ఇదంతా నాణేనికి ఒకవైపు ఉన్న చరిత్ర మాత్రమే. ఒక వర్గపు సంస్కృతి, సంప్రదాయాలు మాత్రమే ఉన్నతమైనవి, మిగతా వారివి నీచమైనవనే అభిప్రాయాలను స్థిరీకరించిన దుర్మార్గమైన వర్ణ వ్యవస్థ నాణేనికి మరోవైపు ఉన్న చరిత్ర. వైదిక, బ్రాహ్మణాధిపత్య సంస్కృతే ‘భారతీయ సంస్కృతి’ అని ఒప్పించేందుకు వర్ణ వ్యవస్థ చాలా బలంగా పనిచేస్తోంది. భారతీయత పేరుతో అగ్రవర్ణ సంస్కృతిని మెజారిటీ ప్రజల్లో చొప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థితి ఎంతకు వచ్చిందంటే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల్లో ఉన్న దేవుళ్లను మాత్రమే పూజించే బ్రాహ్మణ పురోహిత వర్గం, ఇప్పుడు గ్రామీణ జానపదుల సంప్రదాయాల్లోకి కూడా అర్చక సంప్రదాయాన్ని వేగంగా తీసుకువచ్చారు. దేశీయ సంప్రదాయంలో పూజించుకునే బహుజనుల దేవుళ్లను సైతం కబ్జా చేశారు. గ్రామాల్లో ఉండే పోచమ్మల దగ్గరికీ  అర్చక సంప్రదాయం వచ్చింది. ఆగమ శాస్త్రాల ద్వారా జరిగే పూజా కార్యక్రమాలు మాత్రమే శాస్త్రబద్ధమైనవని, ఈ పద్ధతుల్లో జరిగితేనే మంచి జరుగుతుందని చెబుతూ తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న అనేక దేశీయ సంప్రదాయాలను కాలగర్భంలో కలిపే పనిచేస్తున్నారు. దీని వల్ల ఎన్నో ఏండ్లుగా కొనసాగుతూ వస్తున్న దేశీయ సంప్రదయాలు నెమ్మది నెమ్మదిగా కనుమరుగైపోతున్నాయి.
 

ప్రభుత్వాలు ప్రోత్సహించడం తగదు
బహుజనులపై జరుగుతున్న సాంస్కృతిక దాడికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు పెద్దన్న పాత్రను పోషించడం సగటు ప్రజాస్వామికవాదులకు మింగుడుపడని అంశం. ప్రజల మనోభావాలు, దేశీయ సంస్కృతి, సంప్రదాయాలపై సరైన అవగాహనలేని ప్రభుత్వాలు, వాటి సంబంధిత శాఖల పనితీరు బ్రాహ్మణాధిపత్య పూజా విధానాలను మాత్రమే గుర్తిస్తూ, వాటికి సంబంధించిన కార్యాచరణను మాత్రమే రూపొందిస్తున్నాయి. ఉద్యోగ నియామాకాల్లో కూడా వైదిక, ఆగమ శాస్త్ర పండితులను మాత్రమే నియమిస్తోంది. ఈ దేశంలోని మూలవాసుల సంస్కృతి, సంప్రదాయాలను కనీసం గుర్తించడానికి నిరాకరిస్తోంది. ఈ పరిణామాలను గమనిస్తున్న క్రమంలో ఈ దేశ రాజ్యాంగ మౌలిక సూత్రమైన భిన్నత్వంలో ఏకత్వాన్ని కనుమరుగు చేసే ప్రయత్నాలను చాలా బలంగా చేస్తున్నట్లు గమనించవచ్చు.
 

ప్రకృతి దేవుళ్లకు విగ్రహాలా?
సాధారణంగా గ్రామీణ దేవతలను మానవ రూపంలో కాకుండా ప్రకృతి రూపంలో కొలుస్తారు. కానీ, సంస్కృతీకరణలో భాగంగా కురుమల కులదైవం బీరప్పకు మానవరూపం అంటగట్టారు. విగ్రహాలను ప్రతిష్టించారు. యాగాలు చేశారు. నిజానికి బీరప్ప దేవునికి యాగ సంప్రదాయమే లేదు. వాస్తవానికి మంద(గొర్లు) హెచ్చు జరిగి, మంద ఆరోగ్యంగా ఉండాలని కుల పురుషుడు బీరప్పకు లగ్గం చేసి మొక్కుకుంటారు. దేశీ సంప్రదాయంలో జరిగే తంతులను సంస్కృతీకరణ, సంస్కరణల పేరుతో వైదిక సంప్రదాయంగా మార్చే ప్రయత్నాన్ని కొన్ని శక్తులు చేస్తున్నాయి. వారి మాటల్లోనే చెప్పాలంటే డబ్బులు లేక పుస్తె, మెట్టెలు కొనలేక వివాహాలు చేసుకోని చెంచుపెంటల్లోకి వెళ్లి సామూహిక వివాహాలు జరిపించడం అనే దుర్మార్గ ఆలోచనను తెరపైకి తెచ్చారు. ఇది ఎంత మతిలేని వాదననో మనం అర్థం చేసుకోవచ్చు. గ్రామ బొడ్రాయి పండగలకు బ్రాహ్మణులే పూజారులుగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బైండ్ల వ్యక్తి పనికి రాకుండా పోయాడు. మానవ రూపమే లేని ప్రకృతి దేవతలకు మానవ రూపం కలిగించి విగ్రహారాధనను ప్రోత్సహించడం, కురుమల బీరప్ప లింగాలకు విగ్రహ రూపం కల్పించి బ్రాహ్మణులచే ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించడం వంటి కార్యక్రమాల్లో బ్రాహ్మణుల ప్రవేశం జరుగుతోంది.

కొమురెల్లి మల్లన్న జాతరను ఎన్నో శతాబ్దాలుగా దేశీయ పద్ధతుల్లోనే నిర్వహిస్తూ వస్తున్నారు. కానీ ఈసారి జాతరలో దేశీయ సంస్కృతుల ఉనికిని ప్రశ్నార్థకం చేశారు. కొమురెల్లి మల్లన్న గుడి నిర్వహణ, లగ్గం చేయడం, బండారు(పుసుపు) చల్లడం, మేలుకొలుపు, ఎదుర్కోళ్లను ఒగ్గు సంప్రదాయం ప్రకారం నిర్వహించడం తరాలుగా వస్తున్న ఆచారం. ఇది ఒగ్గు వారి హక్కుగా ఉంది. అయితే ఈసారి దానికి భిన్నంగా ఆగమ, వైదిక శాస్త్ర పద్ధతుల ఆధారంగా నిర్వహించడం వివాదాస్పదమవుతోంది. మమ్మల్ని అవమానపరిచారంటూ ఒగ్గు కళాకారులు ఆరోపిస్తున్నారు. వేద శాస్త్ర ప్రకారం మల్లన్న కల్యాణం జరిగిందని మీడియాలో వార్తలు వచ్చాయి. లక్ష బిల్వార్చన పూజను కూడా నిర్వహించారు. ఒగ్గు డోళ్ల నృత్యాలు, నపీర శబ్దాలు కాకుండా కేరళకు చెందిన సింగారి మేళం, బ్యాండు బాజాలతో ఊరేగింపు జరిపారు. దాంతో పాటు నియమాకాలను వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం చేపడతామని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇవన్నీ చూస్తుంటే దేశీయ సంస్కృతి, సంప్రదాయాలపై ఒక వర్గపు ఆధిపత్యం క్రమంగా పెరుగుతున్న వాతావరణం కనిపిస్తోంది. సాంస్కృతిక వైవిధ్యాలకు కాలం చెల్లిపోయే రోజు ఎంతో దూరంలో లేదనే అనుమానాలు, భయాలు మరింత పెరిగాయి.
 

దేశీయ పద్ధతులను గౌరవించాలె
నిజానికి వైదిక, బ్రాహ్మణీయ, ఆగమ శాస్త్రాలకు ఈ దేవుళ్లకు ఎటువంటి సంబంధం లేదు. వీళ్లు శ్రమైక జీవన సౌందర్యంలోంచి పుట్టిన దేవుళ్లు మాత్రమే. శ్రామికులు సృష్టించిన దేవుళ్లు. తమ కష్టసుఖాల్లో, ఆదాయ మార్గాల్లో అండగా ఉంటారనే నమ్మకమే ఈ దేవుళ్ల పుట్టుకకు కారణం. ఈ దేశంలో కులానికో దేవుడు ఉన్నాడు. ఆ దేవుళ్లను పూజించే పద్ధతులు ఉన్నాయి. ఆరాధన పద్ధతులు ఉన్నాయి. భక్తి సాహిత్యం ఉంది. వీటన్నింటినీ కాదని ఏకోన్ముఖ వైదిక, ఆగమ శాస్త్రాల ఆరాధన పద్ధతులనే పాటించేలా కార్యక్రమాలు నిర్వహించి, వాటికి స్థానం, ప్రచారం కల్పించడం దారుణమైన విషయం. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజలకు, శ్రామిక సంస్కృతికి గౌరవం కలిగించాలి. మార్గ దేవుళ్లను పూజించే పద్ధతులను గౌరవిస్తున్నట్లు, దేశీయ దేవుళ్లను పూజించే పద్ధతులను, పూజారులను కూడా సమస్థాయిల్లో గౌరవించాల్సిన అవసరం ఉంది. బ్రాహ్మణ వర్గం వల్లించే వేద మంత్రాలకన్నా గ్రామదేవతల కొలుపు పాటలు తక్కువేమీ కాదు. ఇవి గానయోగ్యమై, శ్రవణానందాన్ని, ఆలోచనలను కల్గిస్తాయి. బీరప్ప, మల్లన్న, ఎల్లమ్మ, జాంబవపురాణాది కథల్ని రోజుల తరబడి గుక్క తిప్పుకోకుండా వల్లించే జ్ఞానానికి గుర్తింపును ఇవ్వవలసిందే. బ్రాహ్మణీయ పురోహిత అర్చకత్వాన్ని గౌరవిస్తున్నట్లుగానే, దేశీయ సంస్కృతిని, ఆరాధనా పద్ధతుల్ని గౌరవించాలి. దేశీయ సంస్కృతులకు సముచిత స్థానం ఇవ్వడమంటే రాజ్యాంగ మూలసూత్రమైన ‘భిన్నత్వంలో ఏకత్వ’ భావనను గౌరవించుకోవడమే.
                                                                                                                                                                                   - ఇమ్మిడి మహేందర్,  రీసెర్చ్​ స్టూడెంట్,ఉస్మానియా యూనివర్సిటీ