US Open 2024: తొలి రౌండ్‌లోనే ఓటమి.. టెన్నిస్‌కు స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్

US Open 2024: తొలి రౌండ్‌లోనే ఓటమి.. టెన్నిస్‌కు స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్

ఆస్ట్రియన్ టెన్నిస్ స్టార్ డొమినిక్ థీమ్ సోమవారం (ఆగస్టు 26) తన అంతర్జాతీయ టెన్నిన్స్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. యూఎస్ ఓపెన్ 2024 లో తొలి రౌండ్ లోనే థీమ్ ఓడిపోయాడు.  బెన్ షెల్టాన్‌తో జరిగిన ఈ మ్యాచ్ లో 4-6, 2-6,2-6 తేడాతో వరుస సెట్లలో చిత్తుగా ఓడిపోయాడు. ఈ మ్యాచ్ అనంతరం తన కెరీర్ కు భావోద్వేగ వీడ్కోలు పలికాడు. తనకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన ప్రేక్షకులకు ధన్యావాదాలు తెలిపాడు. కేవలం 30 ఏళ్లకే థీమ్ తన టెన్నిస్ కెరీర్ ను ముగించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.  
 
"ఇదే కోర్ట్ లో నా కెరీర్ లో ఏకైక టైటిల్ గెలిచాను. ఇక్కడే వీడ్కోలు పలుకుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా కెరీర్ కు సహాయపడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు" అని థీమ్ చెప్పకొచ్చాడు. తన నిర్ణయంతో సంతృప్తిగా ఉన్నానని.. సాధారణ జీవితాన్ని గడపాలని అనుకుంటున్నాని థీమ్ తెలిపాడు. 2021 లో మణికట్టు గాయం థీమ్ కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపించింది.  

Also Read :- ముగ్గురు స్టార్ ప్లేయర్స్ ఔట్

2020 లో థీమ్ యూఎస్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నాడు. 5 సెట్ల పాటు జరిగిన ఫైనల్ పోరులో జ్వరెవ్ ను ఓడించాడు. తొలి రెండు సెట్లు ఓడినా చివరి మూడు సెట్స్ వరుసగా గెలవడం విశేషం. ఫ్రెంచ్ ఓపెన్ లో రెండు సార్లు ఫైనల్ కు వచ్చి నాదల్ చేతిలో ఓడిపోయాడు. భవిష్యత్ స్టార్ గా కితాబులందుకున్నా.. నిలకడ లేమి గాయాలతో గత నాలుగేళ్లలో పేలవ ప్రదర్శన కనబరిచాడు.