- ట్రంప్ పై హత్యాయత్నం గురించి ముందే హింట్ ఇచ్చిన నిందితుడు
వాషింగ్టన్: ఇటీవల ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో త్రుటిలో బయటపడిన అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు సంఘీభావంగా ఆయన సపోర్టర్లు చెవికి బ్యాండేజీ కట్టుకుని కొత్త ట్రెండ్ కు తెరతీశారు. కాల్పుల్లో ట్రంప్ చెవిని తాకుతూ బుల్లెట్ దూసుకెళ్లడంతో ఆ గాయానికి ట్రంప్ బ్యాండేజీ పెట్టుకుని బుధవారం మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ పార్టీ నేషనల్ కన్వెన్షన్ కు హాజరయ్యారు. దీంతో ఆయన మద్దతుదారులు కూడా చాలా మంది చెవికి బ్యాండేజీతో హాజరవడం ఆసక్తికరంగా కనిపించింది.
సరిగ్గా తలమీదే గురి పెట్టిండు..
ట్రంప్ పై హత్యాయత్నానికి సంబంధించిన కొత్త ఫుటేజీనీ అమెరికా జర్నలిస్టు మారియో నాఫాల్ విడుదల చేశారు. షూటర్ థామస్ మాథ్యూ క్రూక్స్ సరిగ్గా ట్రంప్ తలమీద గురిపెట్టాడని, ఆ సమయంలో వేదికపై నిల్చుని ప్రసంగిస్తున్న ట్రంప్.. స్క్రీన్ ను చూసేందుకు తల పక్కకు తిప్పడంతో బతికిపోయారని మారియో పేర్కొన్నారు. ‘‘షూటర్ థామస్ కచ్చితంగా, సరిగ్గా ట్రంప్ తలపై గురిపెట్టాడు. ఆ టైంలో ట్రంప్ తల తిప్పకపోయి ఉంటే, బుల్లెట్ కచ్చితంగా ఆయన తలలోకి దూసుకెళ్లేది” అని ఆయన చెప్పారు.
ట్రంప్ పై హత్యాయత్నం గురించి నిందితుడు క్రూక్స్ ముందే హింట్ ఇచ్చినట్టు కూడా వెల్లడైంది. ‘‘జులై 13న నా ప్రీమియర్ ఉంటుంది. చూడండి” అని సోషల్ మీడియాలో అతడు పోస్టు పెట్టినట్టు గుర్తించారు. కాగా, ట్రంప్ రన్నింగ్ మేట్ (వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి)గా ఉండేందుకు జేడీ వాన్స్ ఓకే చెప్పారు. బుధవారం మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో ఆయన మాట్లాడారు. ట్రంప్ కు రాజకీయాలు అవసరం లేదని, దేశానికే ఆయన అవసరం ఉందన్నారు.