
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు చూపిస్తున్నారు. రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచే అక్రమ వలసదారులు, ఉద్యోగుల తొలగింపుపై ట్రంప్ ప్రధానంగా ఫోకస్ పెట్టాడు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగులను తగ్గించడం ద్వారా ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తక్కువ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టారు అధికారులు.
వీఆర్ఎస్ తీసుకునే ఉద్యోగులకు ప్రభుత్వం వివిధ ఆఫర్లు ఇస్తూ ఇంటికి పంపుతున్నాడు ట్రంప్. తాజాగా మరో 5,400 మంది ఉద్యోగులకు మంగళం పాడాడు ట్రంప్. సమాఖ్య శ్రామిక శక్తి పునర్నిర్మాణంలో భాగంగా 5,400 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు పెంటగాన్ శుక్రవారం (ఫిబ్రవరి 21) తెలిపింది. ఉద్యోగులను ఇంటికి పంపించే ప్రక్రియ వచ్చే వారం నుంచి మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ALSO READ | నా దెబ్బకు బ్రిక్స్ ఆగం.. ఆ దేశాల మాటే వినిపించడంలేదు: ట్రంప్
పెంటగాన్ నియామకాలను నిలిపివేస్తుందని, చివరికి దాని పౌర శ్రామిక శక్తిని 5 శాతం నుండి 8 శాతం వరకు తగ్గించవచ్చని ఉన్నత అధికారి డారిన్ సెల్నిక్ తెలిపారు. ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇప్పటివరకు 20,000 మందికి పైగా కార్మికులను తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఉన్న ఫలంగా ఉద్యోగుల తొలగింపు సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్న ట్రంప్ మాత్రం అవేమి పట్టించుకోకుండా అలాగే ముందుకు వెళ్తున్నారు.