న్యూయార్క్: సివిల్ ఫ్రాడ్ కేసులో కోర్టుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 175 మిలియన్ డాలర్ల బాండ్ (రూ.1400 కోట్లు) ను చెల్లించారు. దీంతో తన ఆస్తులను అధికారులు సీజ్ చేయకుండా ఆయన కాపాడుకున్నారు. లోన్లు, ఇన్సూరెన్స్ టర్మ్ లను పొందేందుకు ట్రంప్ తన ఆస్తుల నికర విలువను కావాలనే బిలియన్ డాలర్ల మేరకు పెంచుకుని బ్యాంకులు, బీమా సంస్థలను మోసం చేశారని డెమోక్రాట్ నేత, న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ కేసు వేశారు.
విచారణ తర్వాత ట్రంప్‌ను దోషిగా తేల్చిన కోర్టు.. ఆయనకు 454 మిలియన్ డాలర్ల (రూ.3,700 కోట్లు) ఫైన్ విధించింది. ఫైన్ తగ్గించాలని, తన ఆస్తులను జప్తు చేయకుండా చూడాలని గత నెల 25న అప్పీల్స్ కోర్టుకు ట్రంప్ విజ్ఞప్తి చేశారు. పది రోజుల్లోగా 175 మిలియన్ డాలర్ల బాండ్ చెల్లించాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆయన బాండ్ ను చెల్లించారు. తదుపరి విచారణను కోర్టు సెప్టెంబరుకు వాయిదా వేసింది.