న్యూయార్క్: డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎంపికయ్యే వరకు కమలా హారిస్‌తో తాను చర్చలో పాల్గొనేది లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ట్రంప్‌తో చర్చలో పాల్గొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని హారిస్ ఇదివరకే ప్రకటించారు. ట్రంప్, ప్రెసిడెంట్ జో బైడెన్ గతంలో రెండు డిబేట్‌లకు అంగీకరించగా.. ఒకటి జూన్ 27న, మరొకటి సెప్టెంబర్ 10న షెడ్యూల్ అయ్యాయి.
అయితే, జూన్ 27న సీఎన్ఎన్ నిర్వహించిన డిబేట్‌లో బైడెన్ ప్రదర్శన పేలవంగా ఉంది. దీంతోపాటు ఇతర కారణాలతో బైడెన్ అధ్యక్ష పోటీ నుంచి వైదిలిగారు. సెప్టెంబర్ 10న చర్చను ఏబీసీ న్యూస్ నిర్వహించనుంది. అయితే, ‘‘సెప్టెంబర్ 10న నాతో చర్చకు ట్రంప్ గతంలో అంగీకరించారు. ఇప్పుడు ఆయన వెనకడుగు వేస్తున్నరు. నేను చర్చకు సిద్ధంగా ఉన్న. రేసులో ఉన్న వారి మధ్య చర్చను చూసేందుకు ఓటర్లు ఆసక్తిగా ఉన్నరు” అని హారిస్ చెప్పారు.
జేడీ వాన్స్ వ్యాఖ్యలపై దుమారం..
పిల్లలు లేనివారు దేశాన్ని పాలించేందుకు పనికిరారంటూ రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలపై ఆ దేశంలో దుమారం రేగుతోంది. 2021లో జేడీ వాన్స్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘పిల్లలు లేని మహిళల జీవితం దయనీయంగా ఉంటుంది. వారు దేశాన్ని కూడా అలాగే దయనీయంగా మార్చాలని అనుకుంటారు. ఇది వాస్తవం. కమలా హారిస్‌ను చూడండి.
డెమోక్రాట్ల భవిష్యత్తును పిల్లలు లేని వ్యక్తులు నియంత్రిస్తున్నారు. దేశానికి సంబంధించి ప్రత్యక్ష వాటా లేని ఇలాంటి వ్యక్తుల చేతిలో అధికారాన్ని పెట్టడంలో అర్థం లేదు" అని వాన్స్ కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.