అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన డోనాల్డ్ ట్రంప్.. సభను ఉద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఫస్ట్ అనేది తన నినాదమని అన్నారు. తన ప్రమాణ స్వీకారానికి వచ్చిన అతిథులందరికీ కృతజ్ఞతలు తెలిపిన ట్రంప్ అమెరికాకు స్వర్ణయుగం మొదలైందని అన్నారు. చిన్న సమస్యలను కూడా పరిష్కరించే స్థితిలో మన ప్రభుత్వం ఉందని.. సరహద్దుల్లో నేరస్తులు పెట్రేగిపోతున్నారని అన్నారు. అమెరికా అనేక ఆటుపోట్లు తట్టుకుని నిలబడిందని.. తుఫానులు అమెరికాను అతలాకుతలం చేశాయని.. గడ్డు పరిస్థితులను సైతం ఎదుర్కొని నిలబడ్డామని అన్నారు ట్రంప్.
శాంతిభద్రతల విషయంలో మరింత కఠినంగా ఉంటామని.. న్యాయ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని అన్నారు. అమెరికాను నంబర్ వన్ గా నిలబెట్టడమే తన లక్ష్యమని అన్నారు ట్రంప్. కాగా.. 2017లో తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్..ఇవాళ ( జనవరి 20, 2025 ) రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
ALSO READ | అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణం
ఈ కార్యక్రమంలో ట్రంప్ తో పాటు జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు ట్రంప్. క్యాపిటల్ హిల్ లోని రోటుండా ఇండోర్ లో భారీ ఏర్పాట్ల మధ్య అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి 25వేల మంది భద్రతా సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అమెరికా మాజీ అధ్యక్షులు బైడెన్, ఒబామా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి భారత్ తరపున విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరయ్యారు. పారిశ్రామిక దిగ్గజాలు ఎలాన్ మస్క్,మార్క్ జుకర్ బర్గ్, ముకేశ్ అంబానీ, సుందర్ పిచాయ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.