
- మన దేశం నుంచి జైశంకర్..
- రికార్డ్ స్థాయిలో విరాళాలు, వీఐపీ పాస్‌లకు కొరత
న్యూఢిల్లీ: అమెరికా 47వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ లీడర్ డొనాల్డ్ ట్రంప్ ఈనెల 20న ప్రమాణం చేయనున్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ బిల్డింగ్ లో ప్రమాణ స్వీకార వేడుక నిర్వహించనున్నారు. అదే రోజు ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ కూడా ప్రమాణం చేయనున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ దేశాల అధినేతలు, బిజినెస్ టైకూన్లు హాజరుకానున్నారు. ఇప్పటికే వారికి ఆహ్వానాలు అందాయి. మన దేశం నుంచి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ వెళ్లనున్నారు. కాగా, ఈ కార్యక్రమానికి రికార్డు స్థాయిలో విరాళాలు అందుతున్నాయని ట్రంప్ మద్దతుదారులు తెలిపారు.
ఇప్పటికే 170 మిలియన్ డాలర్లు అందాయని చెప్పారు. ఒక మిలియన్, అంతకు మించి విరాళం ఇచ్చిన వారికి 6 పాస్‌లు ఇస్తారు. వీటితో ఈ నెల 19న డొనాల్డ్ ట్రంప్,మెలానియాలతో క్యాండిల్ లైట్ డిన్నర్, 20న జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఈ కార్యక్రమాలకు హాజరుకావడం ద్వారా కొత్త ప్రభుత్వంలో చేరుతున్న సెనేటర్లు, అధికారులతో పరిచయాలు పెంచుకునే వీలుంటుంది. వచ్చే నాలుగేళ్ల పాటు ఇది తమ వ్యాపారానికి ఉపయోగపడతాయని కంపెనీలు భావిస్తుంటాయి.
అందుకే వీఐపీ పాస్‌ల కోసం భారీ మొత్తంలో విరాళాలు ప్రకటిస్తాయి. ఈసారి వీఐపీ పాస్‌లు అయిపోయాయని అధికారవర్గాలు తెలిపాయి. కాగా, సాధారణంగా అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రపంచ దేశాల అధినేతలు హాజరు కావడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి డొనాల్డ్ ట్రంప్ సంప్రదాయాన్ని బ్రేక్ చేసి వ్యక్తిగతంగా తనకు కావాల్సిన లీడర్లకు ఆహ్వానాలు పంపారు.