ఎప్పుడో కాని వినిపించని మాట ఇంపీచ్మెంట్. అమెరికా ప్రెసిడెంట్‌కు లింకైంది ఈ ఇంపీచ్మెంట్. ప్రెసిడెంట్ మీద వచ్చిన ఆరోపణలకు పుట్టిన పేరు ఇది. ఆరోపణే నిజమైతే ప్రెసిడెంట్ పదవి ఊడాల్సిందే. ప్రస్తుత ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు ఈ ఇంపీచ్మెంట్నే ఫేస్ చేస్తున్నారు.
ప్రపంచానికే పెద్దన్న అని పిలిపించుకుంటున్న అమెరికాకు పెద్దన్న వంటివారు అక్కడి ప్రెసిడెంట్. అమెరికా ప్రెసిడెంట్‌కు ఉండే అధికారాలు ప్రపంచంలో మరే ఇతర దేశాధినేతకు ఉండవనేది నిజం. ప్రెసిడెంట్ పదవికి ఎలక్ట్ అయ్యాక నాలుగేళ్ల పాటు ఎదురే ఉండదు. కానీ ఈ నాలుగేళ్ల టర్మ్‌లో ఇబ్బందులంటూ ఉంటే అది ఇంపీచ్మెంటే. ఇలాంటి పరిస్థితి రాకూడదని ప్రతి ప్రెసిడెంట్ కోరుకుంటారు. కానీ ఎంత వద్దనుకున్నా ఇప్పటివరకు ముగ్గురు ఈ ఇంపీచ్మెంట్ రుచి చూశారు. తాజాగా డొనాల్డ్ ట్రంప్ మెడకు ఇంపీచ్మెంట్ చుట్టుకుంది.
ఇంపీచ్మెంట్ తీర్మానం అంటే…..
ప్రెసిడెంట్ ను ఇంపీచ్ చేయడం అంటే ఆ పోస్టులో ఉన్న వ్యక్తి పై ఆరోపణలు చేయడం అని అర్థం. ప్రెసిడెంట్ పోస్టులో ఉన్న వ్యక్తిపై ఉన్న ఆరోపణలను రెండు చట్ట సభల ఎదుట పెడతారు. మొదట హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో తీర్మానం ప్రవేశపెడతారు. అక్కడ పాసైతే సెనేట్‌కు వెళ్తుంది. ఆరోపణలకు గురైన ప్రెసిడెంట్ తరఫున ఒక లాయర్ సెనేట్‌లో వాదనలు వినిపిస్తారు. విచారణ ముగిసిన తరువాత తీర్మానంపై ఓటింగ్ చేపడతారు. సంబంధిత ప్రెసిడెంట్ కు వ్యతిరేకంగా మూడింట రెండొంతుల మెజారిటీ వస్తే పదవి పోతుంది.
ట్రంప్ మీదున్న చార్జెస్ ఏంటి ?
డొనాల్డ్ ట్రంప్ మీద మేజర్‌గా రెండు చార్జెస్ ఉన్నాయి. ఇందులో మొదటిది ఇంపీచ్మెంట్ దర్యాప్తునకు సహకరించలేదన్నది. రెండోది డెమొక్రటిక్ పార్టీ నాయకుడు జో బిడెన్ మీద దర్యాప్తు జరిపించాలంటూ ఉక్రెయిన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారన్నది.
అసలు వివాదమేంటి?
2016లో అమెరికాకు జో బిడెన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉండేవారు. ఆ టైమ్ లో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ పై ఒత్తిడి తెచ్చారని బిడెన్ పై ఆరోపణలున్నాయి. ఉక్రెయిన్ లో ‘బురిస్మా హోల్డింగ్స్’ అనే ఆయిల్ కంపెనీలో జో బిడెన్ కొడుకు హంటర్ బిడెన్ కు షేర్లున్నాయి. కంపెనీ బోర్డులో కూడా హంటర్ బిడెన్ ఉండేవాడు. ‘బురిస్మా హోల్డింగ్స్’ లో అక్రమాలు జరిగాయని అప్పట్లో చాలా ఆరోపణలొచ్చాయి. దీనిపై విచారణకు షోకిన్ అనే ఆఫీసర్ ను అపాయింట్ చేశారు. షోకిన్ ను పక్కకు తప్పించాలని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ పై ఒత్తిడి తెచ్చారన్నది జో బిడెన్ పై వచ్చిన ఆరోపణ.
ఈ ఆరోపణలు జూలై నెలలో ట్రంప్ కు తెలిశాయి. ఈ కంపెనీ అక్రమాలపై విచారణ మళ్ళీ జరిపించాలని ఉక్రెయిన్ ప్రెసిడెంట్‌ను ట్రంప్ కోరారు. వచ్చే అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్లలో జో బిడెన్ డెమొక్రటిక్ పార్టీ కేండిడేట్ గా పోటీ చేయవచ్చునని అంచనా. బలమైన కేండిడేట్ గా ఉంటాడనుకుంటున్న బిడెన్ అడ్డు ముందే తొలిగించుకోడానికి ట్రంప్ ఈ పని చేశారన్నది ఇంపీచ్ మెంట్ కు దారి తీసింది. ఉక్రెయిన్ ప్రెసిడెంటుతో ట్రంప్ మాట్లాడిన విషయం ఒక ఇంటిలిజెన్స్ ఆఫీసర్ బయటపెట్టడంతో ట్రంప్ చిక్కుకుపోయారు. ఇదంతా నిజం కాదని ట్రంప్ అంటున్నారు కానీ, ఆధారాలున్నాయని డొమెక్రాట్లు వాదిస్తున్నారు.
ట్రంప్ పదవి డేంజర్ జోన్ లో లేనట్టే !
ఇంపీచ్మెంట్ తీర్మానం సెనేట్‌కు వెళితే అక్కడ ముందుగా విచారణ ఆ తరువాత ఓటింగ్ ఉంటుంది. అయితే సెనేట్ లో కూడా ట్రంప్ కు వ్యతిరేకంగా మూడింట రెండొంతుల మెజారిటీ వస్తేనే ప్రెసిడెంట్ కుర్చీ నుంచి ఆయన దిగాల్సి ఉంటుంది. అయితే వంద మంది సభ్యులున్న సెనేట్ లో రిపబ్లికన్లే ఎక్కువ మంది ఉన్నారు. ట్రంప్ పై పెట్టిన తీర్మానం గట్టెక్కాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలి. ట్రంప్ కూడా రిపబ్లికనే కాబట్టి తీర్మానానికి మూడింట రెండొంతుల మెజారిటీ రావడం దాదాపుగా అసాధ్యం. దీంతో డొనాల్డ్ ట్రంప్ పదవికి ఎలాంటి డేంజర్ ఉండదంటున్నారు ఎనలిస్టులు.
క్లింటన్… కొద్దిలో తప్పింది.
అమెరికాకు 42వ ప్రెసిడెంట్‌గా బిల్ క్లింటన్ కూడా 1998లో ఇంపీచ్మెంట్ ఎదుర్కొన్నారు. సెక్సువల్ హెరాస్మెంట్, వైట్ హౌస్ ఉద్యోగిని మోనికా లెవెన్ స్కీతో శృంగారం బ్యాక్ డ్రాప్ లో ఈ ఇంపీచ్ మెంట్ కథ నడిచింది. మోనికా లెవెన్ స్కీతో తనకు సంబంధాలు లేవంటూ బిల్ క్లింటన్ అబద్ధాలు చెప్పారన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. బిల్ క్లింటన్ ఆర్కాన్సన్ గవర్నర్ గా పనిచేసినప్పుడు తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ పౌలా జోన్స్ అనే ఉద్యోగిని చేసిన ఆరోపణలతో ఈ ఎపిసోడ్ ప్రారంభమైంది. అయితే పౌలా జోన్స్ ఈ ఆరోపణలు చేసేటప్పటికి బిల్ క్లింటన్ ఆమెరికా ప్రెసిడెంట్ గా ఉన్నారు. ప్రెసిడెంట్ పదవిలో ఉన్నాను కాబట్టి తాను ఇలాంటి ఆరోపణలకు అతీతుడినని అని క్లింటన్ అన్నారు. తనకు వ్యతిరేకంగా కేసు వేయడానికి వీల్లేదన్నారు. అయితే కోర్టు ఇందుకు ఒప్పుకోలేదు. తరువాత పౌలా జోన్స్ ఆరోపణలపై కోర్టు విచారణ మొదలెట్టింది. ఈ విషయంలో లిండా ట్రిప్ అనే వైట్ హౌస్ ఎంప్లాయీ సహకరించింది. ఆ టైంలో మోనికా లెవెన్ స్కీ వైట్ హౌస్ లో ట్రైనీగా పనిచేసేది. ప్రెసిడెంట్ గా ఉన్న బిల్ క్లింటన్, ట్రైనీ మోనికా మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను లిండా రికార్డు చేసింది. వాటిని పౌలా జోన్స్ లాయర్లకు సాక్ష్యంగా ఇచ్చింది. వివాదం ముదరడంతో మోనికా తో తనకు సంబంధం లేదని క్లింటన్ అబద్ధాలు చెప్పారు. తరువాత మోనికాతో తనకు సం బంధం ఉందన్న విషయాన్ని బిల్ క్లింటన్ ఒప్పుకున్నారు. ఇండిపెం డెంట్ కౌన్సెల్ కెనెత్స్టార్ ఈ ఇష్యూపై కాంగ్రెస్‌కు నివేదిక ఇచ్చారు. దీనిపై హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ క్లింటన్‌పై ఇం పీచ్ మెంట్ తీర్మానం పాస్ చేసింది. సెనెట్ లో తీర్మానం 55–45 ఓట్ల తేడాతో వీగిపోయింది. దీంతో క్లింటన్ ఇంపీచ్మెంట్ నుండి బయటపడ్డారు. క్లింటన్ పదవి సేఫ్ అయింది.
ఆండ్రూ జాన్సన్ మొదటివాడు
డొనాల్డ్ ట్రంప్ కంటే ముందే ఇద్దరు అమెరికా ప్రెసిడెంట్లు ఇంపీచ్మెంట్ ఎదుర్కొన్నారు. వీరిలో మొదటి వ్యక్తి 17వ ప్రెసిడెంట్ ఆండ్రూ జాన్సన్. 1868లో ఆయన ఇంపీచ్మెంట్ ఎదుర్కొని సెనేట్‌లో ఒక్క ఓటు తేడాతో గట్టెక్కారు. అబ్రహం లింకన్ 1865లో హత్యకు గురవడంతో అమెరికా చట్టాల ప్రకారం వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆండ్రూ జాన్సన్ ప్రెసిడెంట్ అయ్యారు. యుద్ధ విభాగపు కార్యదర్శిగా ఉన్న ఎడ్విన్ స్టాన్టన్ పై కొన్ని ఆరోపణలు రావడంతో ఆయనను జాన్సన్ పదవి నుంచి తొలగించారు. ఆండ్రూ జాన్సన్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ మండిపడింది. చట్టాలను పట్టించుకోకుండా ఎడ్విన్ స్టాన్టన్ ను తొలగించారని ఆరోపణలు వచ్చాయి. ‘టెన్యూర్ ఆఫ్ ఆఫీస్ యాక్ట్ ’ కు కట్టుబడిలేరంటూ ఆండ్రూ జాన్సన్ పై ఇంపీచ్మెంట్ కు రెడీ అయ్యారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో మొదటి ఇంపీచ్మెంట్ తీర్మానం పెట్టగా 126–47 ఓట్లతో గెలిచింది. తరువాత అది సెనేట్ కు వెళ్లింది. 1868 మే16న ఇంపీచ్మెంట్ తీర్మానంపై సెనేట్ లో ఓటింగ్ జరిగింది. మూడింట రెండొంతులు మెజారిటీ రావాల్సి ఉండగా 35–19 ఓట్లతో జాన్సన్ కు అనుకూలంగా సెనేట్ తీర్మానిం చింది. దీంతో ఆండ్రూ జాన్సన్ సేఫ్ గా బయటపడ్డారు.