- సొంత రాష్ట్రంలో హేలీ ఓటమి
- రిపబ్లికన్ అభ్యర్థిత్వ రేసులో ట్రంప్ ముందంజ
సౌత్ కరోలినా: రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వ రేసులో డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. సౌత్ కరోలినాలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఇప్పటికే లోవా, న్యూ హాంప్ షైర్, నెవాడా, వర్జీన్ ఐలాండ్స్ లో ట్రంప్ గెలుపొందారు. ఇప్పుడు నిక్కీ హేలీ సొంత రాష్ట్రమైన సౌత్ కరోలినాలోనూ ఆమెను ఓడించారు. సౌత్ కరోలినా గవర్నర్ గా నిక్కీ హేలీ రెండుసార్లు పని చేశారు.
ఈసారి ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. అయినప్పటికీ ఆమెకు మద్దతు దక్కలేదు. శనివారం జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో మొదటి నుంచి ట్రంప్ కే ఆధిక్యం దక్కింది. ఈ ఓటమితో నిక్కీ హేలీపై ఒత్తిడి పెరిగింది. ఆమె పోటీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ పోటీ నుంచి తప్పుకోవడానికి నిక్కీ హేలీ అంగీకరించడం లేదు. మార్చి 5న జరగనున్న 15 రాష్ట్రాల ప్రైమరీ ఎన్నికల్లో పోటీలో ఉంటానని ఆమె స్పష్టం చేశారు.
ట్రంప్, బైడెన్ మధ్యే పోటీ..
ఇప్పటి వరకు ఉన్న రిజల్ట్ ను బట్టి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ నే విజయం సాధిస్తారని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ అభ్యర్థిగా ఎంపిక కావాలంటే 1,215 మంది డెలిగేట్స్ కావాలి. ఇప్పటి వరకు ట్రంప్ 92 మంది డెలిగేట్స్ ను గెలుచుకోగా, నిక్కీ హేలీ కేవలం 17 మంది డెలిగేట్స్ ను మాత్రమే గెలుచుకున్నారు. మార్చి 5న జరగనున్న ఎన్నికల్లోనూ ట్రంప్ దే పైచేయి అవుతుందని అంచనా వేస్తున్నారు. కాగా, ఈ ఏడాది నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి మళ్లీ ట్రంప్, జో బైడెన్ మధ్యే పోటీ ఉంటుందని అక్కడి మీడియా అంచనా వేస్తున్నది. ఇప్పటికే ట్రంప్, బైడెన్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.