డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక దూకుడు పెంచారు. సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ పొరుగు దేశాలకు వణుకు పుట్టిస్తున్నారు. అక్రమంగా అమెరికాలో తలదాచుకుంటున్న వారికి నిద్రలేని రాత్రులు చేస్తున్నారు. రెండోసారి అధికారంలోకి రావడంతో ట్రంప్ 2.0 పాలన మొదలెట్టారు. అన్ని విషయాల్లోనూ ‘అమెరికా ఫస్ట్’ అనే సిద్ధాంతంతో నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్ తీరుతో భారత్‌తో పాటు అనేక దేశాల్లో కలవరం మొదలైంది. ఎన్నికల హామీలను నిలబెట్టుకునేందుకు ఇప్పటికే అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టారు. పగ్గాలు చేపట్టిన మొదటిరోజే తన మార్క్ స్పష్టంగా కనిపించాలని కీలకమైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకాలు చేసి తేనెతుట్టె కదిపారు. ఇప్పటికే అనేక దేశాలకు వార్నింగ్ ఇచ్చాడు. డ్రగ్స్, అక్రమ వలసలను కెనడా ప్రభుత్వం కట్టడి చేయకపోతే.. ఆ దేశంపై 25 శాతం పన్ను విధిస్తామని చెప్పి కలకలం రేపారు.
ట్రంప్ దెబ్బకు, కెనడాలోని రాజకీయ పరిస్థితులతో ఉక్కిరిబిక్కిరైన జస్టిన్ ట్రూడో రాజీనామా చేయాల్సి వచ్చింది. కెనడాను 51వ రాష్ట్రంగా అమెరికాలో విలీనం చేయాలని ట్రూడోకు షరతు విధించారు. ప్రమాణ స్వీకారం చేయకుండానే చుట్టుపక్కల దేశాలు.. మిత్రులతో గిల్లికజ్జాలు మొదలుపెట్టిన ట్రంప్.. ఇతర దేశాల భూభాగాలను అమెరికాలో కలపాలంటూ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఆ మధ్య కెనడా, మెక్సికో, పనామా, డెన్మార్క్‌ను కూడా టచ్ చేసి, ఆ దేశాలకు కంట్లో నలుసుగా మారారు.
గల్ఫ్ ఆఫ్ మెక్సికో
చుట్టుపక్కల దేశాలతో గిల్లికజ్జాలు మొదలుపెట్టిన ట్రంప్.. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును అధికారికంగా గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చారు. దీంతోపాటు నార్త్ అమెరికాలోని ఎత్తైన అలస్కన్ శిఖరం డెనాలిని మౌంట్ మెకిన్లీగా మార్చారు. అయితే, పేరు మార్పును సూచించాలని జియోలాజికల్ సర్వేకు ట్రంప్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. అంతర్జాతీయంగా ఇది అంత ఈజీగా సాధ్యం కాదని తెలుస్తోంది. నార్త్ అమెరికాలో దాదాపు ఆరు లక్షల చదరపు మైళ్ల సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ మెక్సికోగా పిలుస్తుంటారు. ప్రపంచంలోనే 9వ అతిపెద్ద జల వనరు కూడా ఇదే. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఈ ప్రదేశం అత్యంత కీలకమైంది. ఈ ప్రాంతంలో అమెరికాలో ఉపయోగించే సగానికి పైగా శుద్ధి చేసిన గ్యాస్ తయారీ కేంద్రాలు ఉన్నాయి. అమెరికాలో వినియోగించే 40 శాతం మత్స్యసంపద కూడా ఇక్కడే దొరుకుతోంది. అందుకే ఈ ప్రాంతానికి చాలా ప్రాముఖ్యత ఉండడం వల్లే ట్రంప్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే గ్రీన్‌ల్యాండ్ విషయంలో డెన్మార్క్ మహిళా ప్రధాని మెటె ఫ్రెడరికన్సన్‌కు ఫోన్‌లో బెదిరింపులకు దిగారు.
అక్రమ వలసదారులపై ఉక్కుపాదం
చెప్పినట్టుగానే అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం మోపుతుండడం కీలక అంశంగా మారింది. అక్రమ వలసదారుల్ని గుర్తించే క్రమంలో గురుద్వారాలనూ వదలడం లేదు. ఇప్పటికే ట్రంప్ యంత్రాంగం వందలమంది అక్రమ వలసదారులను అరెస్టు చేసి, వారి దేశాలకు సైనిక విమానాల్లో బలవంతంగా పంపించి వేస్తోంది. కానీ, వారిని పంపించే విధానంపైనే అభాసుపాలవుతోంది అమెరికా. ఎందుకంటే అరెస్ట్ అయినవారంతా ఉగ్రవాదం, మాదకద్రవ్యాల రవాణా, లైంగిక నేరాలు వంటి కేసుల్లో నిందితులుగా ఉన్నవారే అని అమెరికా చెబుతోంది. తమ పౌరులకు సంకెళ్లు వేసి ప్రత్యేక విమానాల్లో తీసుకురావడంపై ఇప్పటికే బ్రెజిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేయడం వల్ల వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లే అవుతుందన్న విషయాన్ని ట్రంప్ మర్చిపోతున్నారా.. తెలియడం లేదు.
జన్మతః పౌరసత్వ చట్టం
ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన వెంటనే జన్మతః పౌరసత్వ చట్టాన్ని రద్దు చేసి.. కాక రేపారు. ఇది విదేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడినవారిపై తీవ్ర ప్రభావితం చూపిస్తుంది. అమెరికాలో నివసిస్తున్న ఇతర దేశాలకు చెందినవారు తమ పిల్లలు అమెరి కన్ పౌరసత్వం పొందాలని కలలు కనేవారికి ట్రంప్ నిర్ణయం కంట్లో కారం పడినట్లైంది. ఓవైపు యుద్ధాల ముగింపు కోరుకుంటున్న ట్రంప్.. కొన్ని దేశాలకు ఆర్థిక సాయం నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. వివిధ దేశాలకు ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని నిలిపివేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చి పడేశారు. రష్యాతో యుద్ధంలో చిక్కుకున్న ఉక్రెయిన్‌కు కూడా ఆర్థిక సాయం నిలిపివేసి, జెలెన్ స్కీకి షాక్ ఇచ్చారు. ఇటు బంగ్లాదేశ్‌కు కూడా అంతే పనిచేశారు. ఎందుకో మరి ఇజ్రాయెల్, ఈజిప్ట్ దేశాలకు మాత్రం సైనిక బలగాల పెంపు కోసం అందించే నిధులకు మినహాయింపులు ఇచ్చి.. ఆ దేశాల పట్ల గొప్ప మనసు చాటుకున్నారు ట్రంప్.
తెరపైకి రహస్య ఫైళ్లు
ప్రస్తుతం ట్రంప్ తీసుకుంటున్న అనేక నిర్ణయాలు ఎంతవరకు అమలు అవుతాయన్నదే ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే కొన్నింటికి టెక్నికల్ అంశాలు చాలా ముడిపడి ఉన్నాయి. వాటిని ఇప్పట్లో పరిష్కరించడం అంత ఈజీ కాదు. దానికి చాలా టైమ్ పడుతుంది. ఈలోపు కోర్టుల్లో పిటిషన్లు దాఖలైతే అంతే సంగతి. అప్పుడెప్పుడో ప్రపంచమంతటా సంచలనం సృష్టించిన అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెనెడీ, ఆయన సోదరుడు, సెనేటర్ రాబర్ట్ ఎఫ్.కెనెడీ, పౌర హక్కుల నాయకుడు మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్ హత్యలకు సంబంధించి త్వరలో సంచలన నిజాలు బయటపెడతానని చెప్పి.. ట్రంప్ కొత్త చర్చకు తెరలేపారు. వారి హత్యోదంతాలకు సంబంధించిన రహస్య ఫైళ్లన్నింటినీ బహిర్గతం చేయాలంటూ తన టీమ్‌కు ఆదేశాలిచ్చారు. గతంలో జరిగిన హత్యలకు తాలుకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఇప్పటికీ ఉన్నాయా లేదా అనేది పెద్ద మిస్టరీ. అమెరికా దర్యాప్తు సంస్థలు మళ్లీ మొదటి నుంచి విచారణ మొదలుపెడితే అది ఎప్పటికి పూర్తయి.. రిపోర్టు బయటకు వస్తుందనేది అంతుచిక్కని విషయం.
అధ్యక్ష పీఠంపై మూడోసారి..
చైనా, రష్యా అధ్యక్షులు తమ దేశాల రాజ్యాంగంలో మార్పులు తీసుకొచ్చి జీవితాంతం వారే పరిపాలన చేస్తున్నారు. ఇదేవిధంగా ట్రంప్ కూడా మూడోసారి అధ్యక్ష పీఠం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు రావడం డెమొక్రటిక్ పార్టీ నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. వాస్తవానికి అమెరికా రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి అయినా రెండుసార్లుకు మించి దేశాధ్యక్ష పదవిని నిర్వహించడానికి వీల్లేదు. దీన్ని మార్చేసి మూడుసార్లు అధ్యక్ష పదవికి ఎన్నికయ్యేలా రాజ్యాంగాన్ని సవరించాలంటూ రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్ (పార్లమెంటు) సభ్యుడు యాండీ ఓగిల్స్ దిగువ సభలో సంయుక్త తీర్మానం ప్రవేశపెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఇది ఆమోదం పొందితే ట్రంప్ మూడుసార్లు అధ్యక్ష పదవికి ఎన్నిక కావడానికి వీలు కలుగుతుంది. ట్రంప్ కలగంటున్నట్లు మూడోసారి అధ్యక్షుడు కావాలంటే 22వ రాజ్యాంగ సవరణను మార్చాలి. దానికి అమెరికా కాంగ్రెస్‌తోపాటు రాష్ట్రాల ఆమోదం పొందడం అంత సులువు కాదు. అమెరికా చరిత్రలో ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ ఒక్కరే నాలుగుసార్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తరవాత ఇటువంటిది జరగకుండా నివారించడానికి 1951లో 22వ రాజ్యాంగ సవరణ తెచ్చారు. దీన్ని సవరించడం ట్రంప్‌కు సులువు కాదు.
జిన్‌పింగ్, పుతిన్, ట్రంప్‌కు తేడా ఎక్కడ?
పనామా కాలువ అమెరికాకే చెందుతుందంటూ ట్రంప్ చేసిన కామెంట్స్‌పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే.. చైనా, రష్యా దేశాల చర్యల కంటే అమెరికా ఏవిధంగా మెరుగైంది? ఉక్రెయిన్ తమదే అని కొన్నేళ్లుగా పుతిన్ దానిపై యుద్ధం చేస్తుంటే.. తైవాన్ మాదే అని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా వాదిస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ కూడా పనామా, గ్రీన్ ల్యాండ్‌లను సైనిక చర్యలతో స్వాధీనం చేసుకుంటామని చెప్పడం ఎంతవరకు సమంజసం. ఆ రెండు దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే అమెరికా... ఇప్పుడు పనామా కాలువ, గ్రీన్ ల్యాండ్ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేదే ఇక్కడ కీలకం. ఒకవేళ ఈ రెండు ప్రాంతాలను టచ్ చేస్తే.. అప్పుడు చైనా, రష్యాలాంటి దేశాలను వేలెత్తి చూపే అవకాశం ట్రంప్‌కు అస్సలు ఉండదు.
- ఉపేందర్ పెండెం,
సీనియర్ జర్నలిస్ట్