- అమెరికాలో నెలలు నిండకముందే పిల్లల్ని కనేందుకు ఇండియన్ల ప్రయత్నం
- బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌కు ఫిబ్రవరి 20 డెడ్‌లైన్
- సీ సెక్షన్ కోసం హాస్పిటళ్లకు భారతీయుల క్యూ
- తల్లీబిడ్డ ప్రాణాలకు ప్రమాదం అంటున్న డాక్టర్లు
వాషింగ్టన్: అమెరికా గడ్డపై విదేశీ పౌరులకు పుట్టే పిల్లలకు ఇకపై ఆటోమేటిక్ సిటిజన్‌షిప్ వర్తించబోదంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అక్కడి ఇండియన్లు తీవ్ర ఆందోళనలో మునిగారు. వచ్చే నెల 20 నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి రానుండటంతో ఆలోపే సిజేరియన్ ఆపరేషన్ చేయించుకుని అయినా పిల్లలను కనాలని ప్రస్తుతం గర్భం దాల్చినవారు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.
డెడ్‌లైన్ కంటే ముందే డెలివరీకి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా ముందస్తు డెలివరీల కోసం వస్తున్న వారిలో ఎక్కువ మంది ఇండియన్లే ఉన్నారని న్యూజెర్సీలోని ఓ మెటర్నిటీ క్లినిక్ డాక్టర్ ఎస్డీ రమా తెలిపారు. బర్త్ రైట్ సిటిజన్‌షిప్ పై ట్రంప్ ప్రకటన తర్వాత.. ప్రీ టర్మ్ బర్త్ కోసం చాలా కాల్స్ వస్తున్నట్లు చెప్పారు. ఏడు నెలల గర్భిణులు కూడా సిజేరియన్ చేయాలని కోరుతున్నారని తెలిపారు.
మూడు రోజుల్లోనే 25 మంది ఇండియన్ కపుల్స్ సీ సెక్షన్ కోసం కాల్ చేసినట్లు వివరించారు. ఫిబ్రవరి 20 దాటితే పుట్టిన పిల్లలకు అమెరికన్ సిటిజన్‌షిప్ రాదని, ఎలాగైనా సిజేరియన్ చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిపారు. అయితే, ఫిబ్రవరి 20కి అటు.. ఇటుగా డెలివరీ డేట్ ఉన్న వారికే సిజేరియన్ అవకాశం ఉంటుందని డాక్టర్ రమా తెలిపారు. ప్రస్తుతం 8 లేదా 9వ నెలలో ఉన్న గర్భిణులతోపాటు 7వ నెలలో ఉన్నవారు కూడా సిజేరియన్‌కు పట్టుబడుతున్నట్లు ఆమె వివరించారు. అయితే ప్రీ టర్మ్ బర్త్ అనేది తల్లీబిడ్డ ప్రాణాలకు ఎంతో ప్రమాదకరమని సూచించినట్లు తెలిపారు.
రిస్క్ వద్దని చెప్తున్న డాక్టర్లు
ప్రీ టర్మ్ బర్త్ కాల్స్ పెరిగినట్లు టెక్సాస్‌లో గైనకాలజిస్ట్‌గా ఉన్న డాక్టర్ ఎస్జీ.ముక్కాల తెలిపారు. ‘‘నాకు రెండు రోజుల్లో 20 మంది ఫోన్ చేశారు. ప్రీ టర్మ్ బర్త్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే, ఫిబ్రవరి 20కి దగ్గర్లో డెలివరీ డేట్ ఉన్నవాళ్లను నార్మల్ లేదంటే సిజేరియన్‌కు వెళ్లాలని చెప్తున్నాను. 7 లేదంటే 8 నెలల గర్భిణులకు మాత్రం ప్రీ టర్మ్ బర్త్ ఎంత రిస్కో వివరిస్తున్నాను. 7, 8వ నెల గర్భిణుల బేబీకి లంగ్స్ కూడా డెవలప్ కావు. ఫీడింగ్ ప్రాబ్లెమ్స్ వస్తాయి. చాలా తక్కువ బరువును కలిగి ఉంటారు. నరాల సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటారు’’అని డాక్టర్ ముక్కాల వివరించారు.
2007లో వచ్చి ఉంటే ఇప్పుడు గ్రీన్ కార్డు
2007లో అమెరికాకు వచ్చి, జాబ్ చేస్తున్న వారికి ఇప్పుడు గ్రీన్ కార్డుకు అర్హులు అవుతారు. అంటే.. ఈ మధ్యకాలంలో అమెరికాకు వచ్చిన వారికి గ్రీన్ కార్డు రావాలంటే మరో 20 ఏండ్లు ఆగాల్సిందే. గతంలో అయితే.. పిల్లలు పుడితే వారి ద్వారా పర్మినెంట్ రెసిడెంట్లుగా మారేవారు. కానీ.. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ బర్త్ రైట్ సిటిజెన్ షిప్ రద్దు చేయడంతో గర్భంతో ఉన్న మహిళలు త్వరగా పిల్లలు కనేందుకు హాస్పిటల్స్‌కు క్యూ కడుతున్నారు.
చట్టబద్ధమైన వలసలకే ఇండియా మద్దతు: కేంద్ర మంత్రి జైశంకర్
సరైన డాక్యుమెంట్లు లేకుండా వలస వెళ్లే ఇండియన్లను.. చట్టబద్ధంగా తిరిగి స్వదేశానికి రప్పించేందుకు భారత్ సిద్ధంగా ఉంటుందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. లీగల్ మైగ్రెంట్ పాలసీకే తాము మద్దతు ఇస్తామన్నారు.
వాషింగ్టన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. అమెరికాలో ఇండియన్లకు మంచి గౌరవం దక్కాలనే కోరుకుంటామన్నారు. ఇండియన్లు ఎవరైనా.. చట్టబద్ధంగానే ఇతర దేశాలకు వలస వెళ్లాలని సూచించారు. అక్రమ వలసదారుల విషయంలో కఠినంగానే వ్యవహరిస్తామన్నారు. అలాంటి వారిని తిరిగి ఇండియాకు రప్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.