2024 పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ట్రంప్.. ఎంపిక చేసిన అమెరికన్ పత్రిక టైమ్

2024 పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ట్రంప్.. ఎంపిక చేసిన అమెరికన్ పత్రిక టైమ్
  • రెండో సారి టైమ్ కవర్ పేజీపై మెరిసిన రిపబ్లికన్ నేత

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్.. 2024 పర్సన్  ఆఫ్  ది ఇయర్ గా టైమ్  మేగజీన్  కవర్  పేజీపై చోటు సంపాదించుకున్నారు. ఈ విషయాన్ని టైమ్  మేగజీన్  గురువారం ప్రకటించింది. 2016లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనపుడు ట్రంప్.. ‘టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికయ్యారు. తాజాగా రెండో సారి టైమ్  కవర్  పేజీపై కనిపించనున్నారు. దీంతో ఈ గుర్తింపు పొందిన 13 మంది అమెరికా అధ్యక్షుల జాబితాలో ట్రంప్  చేరారు. ఔట్ గోయింగ్  ప్రెసిడెంట్  బైడెన్ కూడా ఇందులో ఉన్నారు. పర్సన్  ఆఫ్  ది ఇయర్ కు సంబంధించిన షార్ట్ లిస్టును సోమవారం ప్రకటించారు.

ఈ లిస్టులో ట్రంప్ తో పాటు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, వ్యాపారవేత్త ఎలాన్  మస్క్, ఇజ్రాయెల్  ప్రధాని నెతన్యాహు, బ్రిటన్  రాకుమారి కేట్  మిడిల్టన్  ఉన్నారు. కాగా.. పాప్ స్టార్  టేలర్  స్విఫ్ట్  నిరుడు  పర్సన్  ఆఫ్​ ది ఇయర్ గా నిలిచారు. అలాగే, న్యూయార్క్  స్టాక్  ఎక్స్చేంజ్  ఓపెనింగ్ బెల్ ను గురువారం ఉదయం ట్రంప్  మోగించారు. టైమ్  మేగజీన్  కవర్  పేజీపై తన ఫొటోను ముద్రించిన నేపథ్యంలో స్టాక్  ఎక్స్చేంజ్  బెల్  మోగించే కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఎఫ్బీఐ చీఫ్ రాజీనామాను స్వాగతించిన ట్రంప్
ఎఫ్ బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్  రే రాజీనామాను ట్రంప్ స్వాగతించారు. ఇది అమెరికాకు గొప్ప రోజని వ్యాఖ్యానించారు. ఎఫ్ బీఐ డైరెక్టర్  పదవికి జనవరిలో రాజీనామా చేస్తానని రే బుధవారం ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టే ముందే తాను వైదొలగుతానని చెప్పారు. కాగా.. ఎఫ్​బీఐ డైరెక్టర్ గా రేను 2017లో ట్రంప్  నియమించారు. రే రాజీనామా ప్రకటనకు ముందే ఎఫ్​బీఐ డైరెక్టర్ గా తన నమ్మినబంటు కాష్​ పటేల్ ను ట్రంప్  నామినేట్  చేశారు.