ఆమెకు మరో 692 కోట్లు చెల్లించండి : డొనాల్డ్ ట్రంప్‌కు కోర్టు ఆదేశం

న్యూయార్క్:  అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు న్యూయార్క్ లోని మాన్‌హటన్‌ ఫెడరల్‌ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రచయిత జీన్ కరోల్ దాఖలు చేసిన పరువునష్టం దావా కేసులో 83.9 మిలియన్ డాలర్లు (రూ.692 కోట్లు) చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. జీన్ కరోల్ పరువుకు నష్టం కలిగించినందుకు 18.9 మిలియన్ డాలర్లు, భవిష్యత్తులో ఇలాంటివి చేయకుండా ఉండేందుకు మరో 65 మిలియన్ డాలర్లు చెల్లించాలని స్పష్టం చేసింది. కేసు విచారణ సమయంలో కోర్టులోనే ఉన్న ట్రంప్.. తీర్పు ఇచ్చే సమయంలో బయటికి వెళ్లిపోయారు. ‘‘మన న్యాయ వ్యవస్థ కంట్రోల్ కోల్పోయింది. దీనిని రాజకీయ ఆయుధంగా వాడుతున్నారు’’ అని మండిపడ్డారు. ఈ తీర్పును హైకోర్టులో అప్పీల్ చేస్తానని ప్రకటించారు. 1996లో మాన్‌హటన్‌లోని బెర్గ్ డార్ఫ్ గుడ్‌మ్యాన్స్‌ ఫిఫ్త్ అవెన్యూ స్టోర్‌‌లో ట్రంప్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని గతంలో కరోల్ ఆరోపణలు చేశారు. కానీ తన రచనలు  బాగా అమ్ముడుపోవాలనే ఆమె తనపై అసత్య ఆరోపణలు చేశారని ట్రంప్ మండిపడ్డారు. దీంతో కరోల్ పరువు నష్టం దావా వేశారు.  ఈ కేసులో గతేడాది మే నెలలో 5 మిలియన్ డాలర్లు పరిహారం కింద చెల్లించాలని ట్రంప్ ను కోర్టు ఆదేశించింది.

ట్రంప్ అభ్యర్థిత్వంపై  రిపబ్లికన్ పార్టీ వెనక్కి?

2024 అధ్యక్ష ఎన్నికల్లో తమ అభ్యర్థిగా ట్రంప్ పేరును ఖరారు చేస్తూ రూపొందించిన తీర్మానంపై రిపబ్లికన్ పార్టీ వెనక్కి తగ్గినట్లు తెలుస్తున్నది. పార్టీ అధ్యక్ష అభ్యర్థి ఎంపిక ప్రక్రియను బ్యాలెట్ బాక్స్ ద్వారానే పూర్తి చేయాలంటూ ట్రంప్ తన ‘ట్రూత్’ సోషల్ సైట్‌లో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వ్యక్తులు చెప్పారు.