బాస్ ఎంట్రీ ఇచ్చేశాడు: పూణెలో ట్రంప్ వరల్డ్ సెంటర్.. 27 అంతస్తుల్లో రెండు టవర్స్

బాస్ ఎంట్రీ ఇచ్చేశాడు: పూణెలో ట్రంప్ వరల్డ్ సెంటర్.. 27 అంతస్తుల్లో రెండు టవర్స్

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. యూఎస్ ప్రెసిడెంట్ కావడానికి కంటే ముందు మంచి వ్యాపారవేత్త. ప్రపంచంలోని ప్రముఖ బిజినెస్‎మెన్ల పేర్లు ప్రస్థావనకు వస్తే అందులో ట్రంప్ పేరు ఉంటుందంటే అతిశయోక్తి కాదు. రియల్ ఎస్టేట్ రంగంలో డొనాల్డ్ ట్రంప్‎ది అందెవేసిన చెయ్యి. ట్రంప్ వ్యాపార కార్యాకలాపాలు ఒక్క అమెరికాలోనే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్నాయి. ట్రంప్‎ కుటుంబ సభ్యులు పలు దేశాల్లో రియల్ ఎస్టేట్, హోటల్స్ బిజినెస్ నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగానే ట్రంప్ గ్రూప్స్ భారత్‎లో కూడా తన వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాయి. భారత్‎లో ఇప్పటికే ట్రంప్ నాలుగు ట్రంప్ బ్రాండెడ్ నివాస సముదాయాలు ఉండగా.. తాజాగా ఇండియాలో మరో కొత్త ప్రాజెక్ట్‎ను అనౌన్స్ చేసింది ట్రంప్ ఆర్గనేషన్. ట్రంప్ ఆర్గనైజేషన్ దాని స్థానిక రియల్ ఎస్టేట్ భాగస్వాములు భారతదేశంలో కొత్త వాణిజ్య టవర్ ప్రాజెక్టును ప్రకటించాయి. ట్రంప్ భారత భాగస్వామి ట్రిబెకా డెవలపర్స్ పూణే నగరంలో రియల్ ఎస్టేట్ సంస్థ కుందన్ స్పేసెస్‌తో కలిసి కొత్త "ట్రంప్ వరల్డ్ సెంటర్"ను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది. 

ALSO READ | ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు..? ట్రంప్‎కు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ ఫోన్

ఈ ప్రాజెక్ట్‎లో భాగంగా 1.6 మిలియన్ చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో 27 అంతస్తులకు పైగా కార్యాలయ స్థలంతో రెండు ఐకానిక్ గాజు టవర్లు నిర్మించనున్నట్లు తెలిపింది. ఈ ప్రాజెక్ట్ 289 మిలియన్లకు పైగా అమ్మకాలు లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో మొదటి ట్రంప్-బ్రాండెడ్ వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఇదే. దీంతో అమెరికా బయట అత్యధికంగా ట్రంప్‌ టవర్లు ఉన్న దేశంగా భారత్ నిలవనుంది.