అమెరికా వైస్ ప్రెసిడెంట్​ అభ్యర్థిగా ఆంధ్రా అల్లుడు

అమెరికా వైస్ ప్రెసిడెంట్​ అభ్యర్థిగా ఆంధ్రా అల్లుడు
  • జేడీ వాన్స్​ను తన రన్నింగ్  మేట్​గా ప్రకటించిన ట్రంప్
  • ఏపీ మూలాలున్నఉషా చిలుకూరితో వివాహం 
  • ఒకప్పుడు ట్రంప్​పై విమర్శలు.. తర్వాత విధేయుడిగా మార్పు 

మిల్వాకీ(విస్కాన్సిన్):  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా సోమవారం అధికారికంగా నామినేట్ అయిన డొనాల్డ్ ట్రంప్ తన వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్​గా ఒహాయో సెనెటర్ జేడీ వాన్స్ ను ప్రకటించారు.  జేడీ వాన్స్(39) భార్య ఉషా చిలుకూరి (38) తెలుగు మూలాలు ఉన్నవారు కావడం విశేషం. శనివారం బట్లర్ టౌన్​లో ఎన్నికల ర్యాలీలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన ట్రంప్.. సోమవారం తొలిసారిగా విస్కాన్సిన్ స్టేట్​లోని మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ పార్టీ నేషనల్ కన్వెన్షన్​కు హాజరయ్యారు. చెవికి బ్యాండేజ్​తో వచ్చిన ట్రంప్​కు పార్టీ నేతలు, మద్దతుదారుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా జేడీ వాన్స్ తన భార్య ఉష​తో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు. 
 
గౌరవంగా భావిస్తున్నా: జేడీ వాన్స్ 

వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా తనను ట్రంప్ ఎంపిక చేసుకోవడం పట్ల జేడీ వాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్​తో కలిసి పోటీ చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానని ఆయన ప్రకటించారు. ‘‘ట్రంప్ ఇదివరకే అమెరికాకు ఒకసారి శాంతియుతమైన, సుసంపన్నమైన పాలనను అందించారు. 
మీ సహకారంతో మరోసారి అదే పాలనను అందిస్తారు. మనం విజయం దిశగా పయనిస్తున్నాం” అంటూ వాన్స్ సోమవారం ట్వీట్ చేశారు.

కష్టాల మధ్య పుట్టిపెరిగి.. 

జేడీ వాన్స్ ఒహాయో స్టేట్​లోని మిడిల్ టౌన్​లో 1984లో జన్మించారు. అతడి తల్లి మాదకద్రవ్యాలకు బానిసగా మారడం, చిన్నప్పుడే తండ్రి వదిలేసి వెళ్లిపోవడంతో కష్టాలు చుట్టుముట్టాయి. దీంతో ఆయనను తాతయ్య పెంచి పెద్ద చేశారు. హైస్కూల్ విద్య పూర్తయిన తర్వాత అమెరికా నేవీలో భాగమైన మెరైన్ కోర్ విభాగంలో చేరి మెరైనర్​గా పని చేశారు. ఇరాక్ యుద్ధంలోనూ పాల్గొన్నారు. ఆ తర్వాత ఒహాయో స్టేట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశారు. యేల్ లా స్కూల్ నుంచి లా డిగ్రీ పొందారు. యేల్ లా స్కూల్ లో చదువుతున్నప్పుడు ఉషా చిలుకూరితో పరిచయమైంది.

ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి 2014లో కెంటకీలో పెండ్లి చేసుకున్నారు. రోమన్ క్యాథలిక్ అయిన వాన్స్, సంప్రదాయ హిందూ అమ్మాయి అయిన ఉష.. రెండు మతాల ఆచారాల ప్రకారం పెండ్లి చేసుకున్నారు. అంతకుముందు ఉష సహకారంతో వాన్స్ ‘హిల్ బిల్లీ ఎలిజీ’ అనే పుస్తకరం రాయగా అది అమెరికాలో బాగా పాపులర్ అయింది. జేడీ వాన్స్ 2014లో రాజకీయాల్లోకి ప్రవేశించారు.  జేడీ వాన్స్, ఉష దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

విమర్శకుడి నుంచి వీర విధేయుడిగా.. 

రిపబ్లికన్ పార్టీలో చేరినప్పటి నుంచి తరచూ ట్రంప్ పై తీవ్ర విమర్శలు చేస్తూ లైమ్ లైట్​లోకి వచ్చిన జేడీ వాన్స్ గత కొన్నేండ్లలోనే తన వైఖరిని మార్చుకున్నారు. గతంలో ట్రంప్​ను ఆయన ఇడియట్ అని కూడా ఘాటుగా విమర్శించారు. 2016లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ట్రంప్​ను ‘అమెరికన్ హిట్లర్’ అంటూ కామెంట్ చేశారు. సోషల్ మీడియాలో, టీవీ చానెళ్ల ఇంటర్వ్యూల్లో ఘాటుగా విమర్శలు చేశారు.

2022లో ఒహాయో స్టేట్ సెనెటర్​గా బరిలోకి దిగడానికి ముందు నుంచే జేడీ వాన్స్ వైఖరి మారిపోయింది. ఉన్నట్టుండి ట్రంప్ అనుకూలుడిగా మారిపోయిన వాన్స్.. ఆయన మద్దతుతో సెనెటర్ గా గెలిచారు. రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ట్రంప్​తో పోటీ పడిన వివేక్ రామస్వామితోనూ ఉష, వాన్స్​కు ఫ్రెండ్షిప్ ఉండటం మరో విశేషం.

ఒకే ఇల్లు.. రెండు మతాలు 

వాన్స్​కు ఆధ్యాత్మిక, రాజకీయ ప్రయాణంలో ఉష ఎంతగానో సహకరించారు. ప్రొటెస్టెంట్​గా పెరిగిన వాన్స్ 2016 నుంచి క్యాథలిక్ క్రైస్తవుడిగా కొనసాగుతున్నారు. ఇంట్లో ఉష హిందూ సంప్రదాయాలు పాటిస్తుంటే.. వాన్స్ క్యాథలిక్ క్రైస్తవ సంప్రదాయం అనుసరిస్తున్నారు. తమ పిల్లలకు మాత్రం రెండు మతాల సంప్రదాయాలను పరిచయం చేస్తూ పెంచుతున్నారు. ఉషా చిలుకూరి తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వెళ్లి శాన్ డియాగోలో స్థిరపడ్డారు. హిందువులైన తన పేరెంట్స్ పెంపకంలో తనకు మంచి వ్యక్తిత్వం అలవడిందని ఆమె చెప్పారు.

జేడీ వాన్స్, ఉష చిలుకూరి దంపతులకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. శాన్ డియాగో శివార్లలో పెరిగిన ఉషను లీడర్, పుస్తకాల పురుగు అని ఫ్రెండ్స్ పిలిచేవారు. ఆమె 2014 వరకూ డెమోక్రాట్ సభ్యురాలిగా ఉన్నారు. ముంగర్ లోని ఓ ప్రముఖ కంపెనీకి సివిల్ లిటిగేషన్ అటార్నీగా పని చేశారు. సుప్రీంకోర్టు చీఫ్​ జస్టిస్ జాన్ రాబర్ట్స్ కు క్లర్క్ గా కూడా విధులు నిర్వర్తించారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే.. జేడీ వాన్స్ వైస్ ప్రెసిడెంట్ కానున్నారు. అదే జరిగితే తొలి ఇండియన్ ఆరిజిన్ సెకండ్ లేడీ (వైస్ ప్రెసిడెంట్ భార్య)గా ఉషా చిలుకూరి హిస్టరీ క్రియేట్ చేయనున్నారు.