వాషింగ్టన్ డీసీ: ఉక్రెయిన్ పై రష్యా దాడుల నేపథ్యంలో.. ఇప్పుడు చైనా, తైవాన్ అంశం తెరపైకి వస్తోంది. తైవాన్ మీద చైనా దాడులకు దిగొచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తైవానే తర్వాతి టార్గెట్ అని ఆయన అన్నారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తైవాన్ మీద ఎప్పుడు దండెత్తాలా అని ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఈ యుద్ధాన్ని యూఎస్ ఆపలేదన్నారు. ‘తైవానే నెక్స్ట్ టార్గెట్. ఆ దేశాన్ని జిన్పింగ్ డేగకన్నుతో గమనిస్తున్నారు. తైవాన్ పై చైనా దాడులకు దిగితే ఆపడం అమెరికా వల్ల కాదు. ఎందుకంటే మా దేశ నేతల్లో సమర్థత కొరవడింది. తైవాన్ పై పక్కాగా దాడులు జరుగుతాయి. ఇప్పుడు వారి టైమ్ నడుస్తోంది’ అని చైనా, రష్యాను ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు.
రష్యా, ఉక్రెయిన్ వివాదాన్ని జిన్పింగ్ నిశితంగా గమనిస్తున్నారని ట్రంప్ చెప్పారు. అఫ్గానిస్థాన్ నుంచి తమ బలగాలను యూఎస్ ఉపసంహరించుకున్న తీరుతోపాటు కొందరు అమెరికన్ పౌరులను అక్కడే వదిలేయడాన్ని చైనా ప్రెసిడెంట్ గమనించారని అన్నారు. జిన్పింగ్ ఓ మేధావి అని.. ఆయన చేయాలనుకున్నది చేసి తీరుతారని స్పష్టం చేశారు. ఇకపోతే, తైవాన్ పై చైనా దాడులకు దిగనుందా అనే సందేహం ప్రపంచ దేశాల్లో కలుగుతోంది. అసలు చైనా, తైవాన్ కు మధ్య ఉన్న తగాదా ఏంటంటే.. ఇప్పుడున్న తైవాన్ ఒకప్పుడు చైనాలో అంతర్భాగంగా ఉండేది. కానీ 1949లో వచ్చిన అంతర్యుద్ధంతో చైనా, తైవాన్ విడిపోయాయి. అప్పటి నుంచి తైవాన్ ప్రత్యేక ప్రాంతంగా ఉంటోంది. కానీ చైనా ఈ చీలికను ఒప్పుకోవడం లేదు. తైవాన్ చైనాలో అంతర్భాగమంటూ మొండిగా వాదిస్తోంది. అందుకే విలీనం కావాలంటూ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తైవాన్ కు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. తైవాన్‌ను రెచ్చగొట్టే ధోరణిని చైనా కొనసాగిస్తోంది. అయితే చైనా దురాక్రమణకు దిగితే ఊరుకునే ప్రసక్తే లేదని తైవాన్ ప్రెసిడెంట్ త్సాయ్ ఇంగ్ వెన్ హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ తైవాన్ సమస్యను మళ్లీ తెరపైకి తీసుకొచ్చాయి.
మరిన్ని వార్తల కోసం: