
- అమెరికాను అన్ని దేశాలు దోచుకున్నాయ్
- దేశ ఆర్థిక ప్రయోజనాలే నాకు ముఖ్యం
- పరస్పర సుంకాల అమల్లో మార్పులేదని కామెంట్
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలపై పన్నులు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ‘‘ఇకముందు ఏమవుతుందో చూద్దాం’’అంటూ కామెంట్లు చేశారు. కేవలం 10 నుంచి 15 దేశాలతోనే తమ టారిఫ్ వార్ పరిమితం కాదన్నారు. అమెరికాకు ఏ ఏ దేశాల నుంచి అయితే వస్తువులు దిగుమతి అవుతున్నాయో.. వాటన్నింటిపై పన్నులు విధిస్తామని తేల్చి చెప్పారు.
ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. అమెరికాకు పూర్వ వైభవం తీసుకురావాలంటే పన్ను విధించక తప్పదని తెలిపారు. అమెరికాలో బుధవారం లిబరేషన్ డే వేడుకలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎయిర్ఫోర్స్ వన్లో ప్రయాణిస్తూ ట్రంప్ మీడియాతో మాట్లాడారు.
‘‘గడిచిన నాలుగేండ్లు ఏ దేశాన్నీ దోచుకోని విధంగా చాలా దేశాలు అమెరికాను దోచుకున్నాయి. నేను అధికారంలో ఉన్నంతవరకు ఇది మళ్లీ జరగనివ్వను. ఇప్పటివరకు ఎంతో ఉదారంగా వ్యవహరించాం. ఇకపై అలా ఉండదు. టారిఫ్ల విషయంలో కఠినంగా ముందుకెళ్తాం. పరస్పర పన్ను విధానం కచ్చితంగా అమలు చేస్తాం. 10 నుంచి 15 దేశాలపైనే పన్నులు విధిస్తున్నామనే పుకార్లను ఖండిస్తున్నాను.
అమెరికా ప్రయోజనాలే నాకు ముఖ్యం. అన్ని దేశాలు నాకు సమానమే. అమెరికా ఫస్ట్ అనే నినాదానికి కట్టుబడి ఉన్నాను. బుధవారం నుంచే పరస్పర సుంకాల విధానం అమల్లోకి రాబోతున్నది. ఆయా దేశాలు మాపై ఎంత పన్ను విధిస్తే.. మేము కూడా అంతే పన్ను వసూలు చేస్తాం. ఎవరైతే అమెరికాతో మంచి సంబంధాలు కొనసాగిస్తారో.. వాళ్లతో ఉదారంగా ఉంటాం’’అని ట్రంప్ అన్నారు.
మిత్ర దేశాలు దారుణంగా ప్రవర్తించాయ్..
ట్రేడ్ పాలసీల విషయంలో కొన్ని సార్లు అమెరికా మిత్ర దేశాలు.. శత్రు దేశాల కంటే దారుణంగా ప్రవర్తించాయని ట్రంప్ ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు వివిధ దేశాలు అమెరికాపై విధించిన టారిఫ్ల కంటే తాను వసూలు చేస్తున్న పన్ను చాలా తక్కువన్నా రు. ‘‘మాతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న ప్రపంచ దేశాలన్నింటిపై పన్నులు విధిస్తాం’’ అని ట్రంప్ చెప్పారు. కాగా, అన్ని దేశాలపై 20% పన్ను విధించాలని అడ్వైజర్లు సూచించగా.. ట్రంప్ మాత్రం 15శాతం మేర పన్ను విధించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.