ఇండియాకు డబ్బులివ్వాల్సిన అవసరం లేదు : ట్రంప్

ఇండియాకు డబ్బులివ్వాల్సిన అవసరం లేదు : ట్రంప్
  • ఇప్పటికే భారీగా ట్యాక్స్​లతో అమెరికా నుంచి లాభపడ్డది: ట్రంప్​
  • మళ్లీ ఆ దేశంలో ఎలక్షన్స్​ కోసం ఎందుకు నిధులివ్వాలని కామెంట్

వాషింగ్టన్:  యునైటెడ్​ స్టేట్స్​ ఏజెన్సీ ఫర్​ ఇంటర్నేషనల్​ డెవలప్​మెంట్​ (యూఎస్​ఎయిడ్​​) నిధులను అవకాశంగా తీసుకొని భారత్​ భారీగా ప్రయోజనం పొందుతున్నదని అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ అన్నారు. అమెరికా వస్తువులపై ప్రపంచంలోనే అధిక సుంకాలు విధించే దేశాల్లో ఒకటైన భారత్ వద్ద చాలా డబ్బు ఉందని, ఆ దేశానికి తామెందుకు నిధులు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. వాషింగ్టన్​నిర్వహించిన కన్జర్వేటివ్​ పొలిటికల్ యాక్షన్​ కాన్ఫరెన్స్​ (సీపీఏసీ)లో ట్రంప్​ మాట్లాడారు. ‘‘భారత్​ఎన్నికల్లో పోలింగ్​శాతం పెంచేందుకు అమెరికా ప్రభుత్వం రూ. 182 కోట్లు (21 మిలియన్​డాలర్లు) ఇచ్చింది. వారికి ఎందుకు మనం డబ్బులు ఇవ్వాలి. మన దేశంలో ఓట్ల సంఖ్య పెంచుకునేందుకు ఉపయోగించుకోవచ్చు కదా?.. వారి దగ్గరే చాలా డబ్బు ఉంది. అలాంటప్పుడు యూఎస్​ ఎయిడ్​ ఇవ్వాల్సిన అవసరమేంటి?” అని ప్రశ్నించారు. భారత ఎన్నికల్లో ఓటు వేసేవారి సంఖ్యను పెంచేందుకు అమెరికా ఇస్తున్న రూ. 182 కోట్లు నిధులను రద్దు చేస్తూ ఎలాన్ మస్క్  సారథ్యంలోని డోజ్  తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ సమర్థించారు.

చెత్తను తొలగిస్తున్నాం..

యూఎస్​లో అక్రమ వలసదారుల బహిష్కరణపై ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి పత్రాలు లేకుండా దేశంలో ఉంటున్న విదేశీయులను వారి స్వదేశాలకు పంపడాన్ని సమర్థించుకున్నారు. తన ప్రభుత్వం మోసగాళ్లను ఇంటికి పంపిస్తూ దేశంలో పేరుకున్న చెత్తను తొలగిస్తున్నదని అన్నారు.