అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం.. విద్యా శాఖ మూసివేత.. ఉత్తర్వులపై సంతకం చేసిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం.. విద్యా  శాఖ మూసివేత.. ఉత్తర్వులపై సంతకం చేసిన ట్రంప్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న డొనాల్డ్  ట్రంప్.. తాజాగా యూఎస్ ఎడ్యుకేషన్  డిపార్ట్ మెంట్ను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. విద్యా శాఖ మూసివేత ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలోనే విద్యా శాఖలో భారీగా మార్పులు తెస్తానని ట్రంప్  హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ట్రంప్ ఆ హామీల అమలులో భాగంగానే విద్యా శాఖ మూసివేత నిర్ణయం తీసుకున్నారు. యూఎస్ ఎడ్యుకేషన్  డిపార్ట్మెంట్ పనికిమాలినదని, ఉదారవాద భావజాలంతో ఆ విభాగం కలుషితమైందని ట్రంప్ ఇది వరకే వ్యాఖ్యానించారు.

‘‘ఎడ్యుకేషన్  డిపార్ట్మెంట్ మూసివేస్తున్నాం. ఎడ్యుకేషన్ అథారిటీని తిరిగి రాష్ట్రాలకు అప్పగిస్తు్న్నాం. అదే సమయంలో దేశ పౌరులకు అందుతున్న సర్వీసులకు ఆటంకం రాకుండా చూస్తాం” అని వైట్ హౌస్ అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ నిర్ణయంపై పబ్లిక్  స్కూల్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా శాఖను రద్దు చేస్తే విద్యార్థులు వెనుకపడే అవకాశం ఉందని, ఇది వారి ప్రాథమిక హక్కులను కాలరాయడమే అవుతుందని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా.. భారత్ తమపై టారిఫ్లు తగ్గిస్తుందని ఆశిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్ అన్నారు. ఏప్రిల్ 2 నుంచి రెసిప్రోకల్  ట్యాక్సులు యథావిధిగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఓ వార్తా సంస్థతో ట్రంప్ మాట్లాడారు. ‘‘ఏప్రిల్ 2 నుంచి అమెరికాపై భారత్ ఎంత టారిఫ్  విధిస్తుందో మేము కూడా ఇండియాపై అంతే టారిఫ్​వేస్తాం” అని ట్రంప్ కుండబద్ధలు కొట్టారు.