నెవాడా కాకస్​లోనూ డొనాల్డ్​ ట్రంప్​ గెలుపు


లాస్ వెగాస్: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ ఎన్నికల్లో నెవడా స్టేట్ లో రిపబ్లికన్  పార్టీ నిర్వహించిన పోలింగ్ లో మాజీ ప్రెసిడెంట్  డొనాల్డ్  ట్రంప్  విజయం సాధించారు. ఆయనకు ఇది మూడో విజయం. నెవడాలో జరిగిన ఓటింగ్ లో ట్రంప్  తప్ప మరెవరూ పోటీ చేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ట్రంప్  ప్రత్యర్థి నిక్కీ హేలీ ఈ పోలింగ్ లో పోటీ చేయలేదు. ట్రంప్ కు అనుకూలంగా, అక్రమ పద్ధతిలో ఓటింగ్  నిర్వహించారని హేలీ ఆరోపించారు.

కాగా, నెవడాలో గెలవడంతో ట్రంప్ కు 26 మంది ప్రతినిధుల బృందం మద్దతు దక్కింది. రిపబ్లికన్  పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలంటే ఆయనకు ఇంకా 1215 మంది ప్రతినిధుల మద్దతు అవసరం. నెవడాలో గురువారం నిర్వహించిన పోలింగ్ కు ఆయన మద్దతుదారులు భారీగా తరలివెళ్లి ఓటువేశారు. ట్రంప్  హ్యాట్లు, టీషర్టులు ధరించి ఆయనకు మద్దతు తెలిపారు. రిపబ్లికన్  పార్టీ అభ్యర్థిగా ట్రంప్​ను బలపరుస్తున్నామని తెలిపారు