
- వీసా రూల్స్‌ను కఠినం చేసిన అమెరికా ప్రెసిడెంట్
- సగానికి సగం పడిపోయిన ఎఫ్1 వీసా అప్రూవల్స్
- ఎఫ్1 వీసా రెన్యువల్ గడువు ఒక్క ఏడాదికే కుదింపు
- గ్లోబల్ ప్రోగ్రామ్స్ ఎంచుకునేవాళ్లు..
- దేశం బయట ఉండేందుకు 5 నెలలే గడువు
- ఇంటర్న్‌షిప్, స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్‌లకు ఆటంకాలు
- క్యాంపస్ పార్ట్టైంలపైనా విపరీతమైన ఆంక్షలు
- గత ఐదేండ్లతో పోలిస్తే రెట్టింపైన ఫీజుల భారం
- జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్‌లాంటి దేశాలవైపు విద్యార్థుల చూపు
హైదరాబాద్, వెలుగు:అమెరికాలో చదువుకోవాలనుకునే మన దేశ విద్యార్థులకు.. ప్రత్యేకించి తెలుగు స్టూడెంట్స్‌కు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. వీసా రూల్స్‌ను కఠినతరం చేయడం, వలస చట్టాలకు ట్రంప్ పదును పెడుతుండడంతో అక్కడ చదువుకోవాలనుకునే వారికి భారంగా మారుతున్నది. గతంలో ఎన్నడూ లేనంతగా విద్యార్థుల వీసాలు తిరస్కరణకు గురవుతున్నాయి. వీసా వచ్చినవాళ్లు అక్కడ చదువుకుందామని అనుకున్నా.. ఆ చదువుల ఖర్చూ తడిసి మోపెడవుతున్నది. ఇటు పార్ట్ టైం జాబ్‌లు చేసుకోవడానికీ అవకాశాలు లేకుండా పోతుండడంతో అమెరికా మీద స్టూడెంట్స్ ఆశలు వదిలేసుకుంటున్నారు. ఆ దేశానికి బదులు ఇతర దేశాలపై ఆసక్తి చూపిస్తున్నారు.
సగానికి పడిపోయినయ్..
స్టూడెంట్ వీసా పర్మిట్లను అమెరికా గణనీయంగా తగ్గించేస్తున్నది. ట్రంప్ అధికారం చేపట్టడానికి ముందువరకు ఎఫ్1 స్టూడెంట్ వీసాలకు అప్లై చేసుకున్న వాళ్లలో 85% వరకు ఆమోదం పొందేవి. కానీ, ఇప్పుడు సగానికి సగం పడిపోయినట్టు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. నిరుడు డిసెంబర్లో 7,630 ఎఫ్1 వీసాలకు ఆమోదముద్ర పడగా.. ఈ ఏడాది జనవరిలో ఆ సంఖ్య 1,167 మాత్రమే. ఇటు 2024 జనవరితో పోల్చినా సగానికి సగం తగ్గాయి.
ఆ ఏడాది జనవరిలో 2,623 ఎఫ్1 వీసాలకు అమెరికా ఆమోదం తెలిపింది. మామూలుగా అమెరికాలో ఫాల్ (సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ), వింటర్ (డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి)లో స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది ఫాల్లో అడ్మిషన్లకు సంబంధించి వీసా అప్రూవల్స్ చాలా వరకు పడిపోయాయి. మరోవైపు గతంలో ఎఫ్1 వీసా ఎక్స్పైర్ అయ్యాక 48 నెలల పాటు దానిని రెన్యూవల్ చేయించుకునేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు దానిని ట్రంప్ సర్కారు కేవలం ఒక్క ఏడాదికే పరిమితం చేసింది. దీంతో స్టూడెంట్లు వీసా రెన్యూవల్‌కు తిప్పలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే, గతంలో ఎఫ్1 వీసాను ఒకసారి జారీ చేస్తే.. కోర్సు పూర్తయ్యే వరకు వ్యాలిడ్ స్టేటస్‌లో ఉండేది. కానీ, ఇప్పుడు కోర్సు పూర్తయ్యేలోపు నాలుగుసార్లైనా రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
పార్ట్ టైం జాబ్స్ కష్టమే
ట్రంప్ అధికారంలోకి వచ్చాక ప్రైవేట్, ప్రభుత్వ వర్సిటీలపై అనేక ఆంక్షలు విధించారు. గ్లోబల్ ప్రోగ్రామ్స్‌కు ఎన్రోల్ చేసుకోవాలనుకునే విద్యార్థులకు మింగుడుపడని నిబంధనలు విధించారు. గ్లోబల్ ప్రోగ్రామ్స్ చేయాలనుకునే విద్యార్థులు.. అమెరికాలో ఏదైనా వర్సిటీలో చదువుతూనే విదేశాల్లో ఇంటర్న్‌షిప్‌లు చేసుకునేందుకు అవకాశం ఉండేది. కానీ, ప్రస్తుతం ట్రంప్ దానికి బ్రేకులేశారు. గ్లోబల్ ప్రోగ్రామ్స్ ఎంచుకునే విద్యార్థులు.. అమెరికాలో చదువుకునే సమయంలో 5 నెలలకు మించి బయట దేశాల్లో ఇంటర్న్‌షిప్‌లు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది.
ఇటు గతంలో క్యాంపస్‌లో పార్ట్‌టైం చేసుకునేందుకు అవకాశం ఉన్నా కూడా.. ఇప్పుడు అనేక రూల్స్‌ను పాటించాల్సి ఉంటుందని చెబుతున్నారు. నిర్దేశించిన సమయం కన్నా ఎక్కువగా పనిచేసేందుకు అవకాశం ఇవ్వడం లేదు. ఇక, బయట పార్ట్‌టైం చేసుకునే విద్యార్థుల పరిస్థితి అయితే మరింత దారుణంగా తయారైంది. మన విద్యార్థులు అక్కడ చదువు పూర్తి చేసినా.. ఉద్యోగాలు దొరకడం కష్టంగానే మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత అమెరికన్లకు అవకాశమిచ్చాకే, వేరే ఎవరికైనా అవకాశాలు ఇవ్వాలని ట్రంప్ రూల్స్ తెచ్చి పెట్టారు.
ఇతర దేశాల వైపు స్టూడెంట్స్ మొగ్గు..
అమెరికాలో నిబంధనలు కఠినతరం కావడం, ఫీజులు కూడా భారంగా మారుతుండడంతో విద్యార్థులు జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ఐర్లాండ్ వంటి దేశాలవైపు మొగ్గు చూపుతున్నారు. అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాల్లో రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చయితే.. జర్మనీలో ఏడాదికి కేవలం రూ.లక్షన్నరకు మించి చదువులకు ఖర్చు కావని నిపుణులు చెబుతున్నారు. చదువయ్యాక 18 నెలలపాటు వీసా వ్యాలిడ్ స్టేటస్‌లో ఉంటుంది. ఫ్రాన్స్‌లో ఖర్చు రూ.2 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఉంటుందని అంటున్నారు. చదువు అనంతరం రెండేండ్ల పాటు వీసా ఉంటుంది. ఇటలీలోనూ చదువుల ఖర్చు రూ.10 లక్షల లోపే ఉంటున్నదని అంటున్నారు. కాగా, 2023లో ఇటలీ, జర్మనీకి వెళ్లిన ఇండియన్ స్టూడెంట్లలో 20% మంది తెలుగు వాళ్లే ఉన్నారు. మరోవైపు ఎంబీబీఎస్‌కు రష్యాకే మొగ్గు చూపుతున్నారు.
ఫీజులు భారం
అమెరికాలో ఫీజులు కూడా భారంగా మారుతున్నాయి. గత ఐదేండ్లతో పోలిస్తే అక్కడ చదువుల ఖర్చులు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం ప్రైవేట్ వర్సిటీల్లో చదవాలంటే రూ.40 లక్షల దాకా ఖర్చు చేయాల్సి వస్తున్నది. గతంలో రూ.25 లక్షల వరకు ఖర్చయ్యేది. ప్రభుత్వ వర్సిటీల్లో చదివేందుకు రూ.17 లక్షల దాకా ప్రస్తుతం ఖర్చు చేయాల్సిన పరిస్థితులు న్నాయని, గతంలో అందులో సగమే ఉండేదని స్టూడెంట్స్ చెబుతున్నారు. ఇప్పుడు తిండి తిప్పలు, ఇతరత్రా ఖర్చులకూ ఏటా రూ.12 లక్షలు, హెల్త్ ఇన్సూరెన్స్‌కు మరో రూ.లక్షన్నర దాకా ఖర్చు చేయాల్సి వస్తున్నదని అంటున్నారు.
గ్రీన్ కార్డున్నా.. హెచ్1బీపై వెళ్లినా కఠినమే
ఎఫ్1 వీసాలే కాదు.. అప్పటికే అమెరికాలో సెటిల్ అయి గ్రీన్ కార్డు ఉన్నవాళ్లు, హెచ్1బీ వీసాపై జాబ్ చేసే వాళ్లకూ ట్రంప్ సర్కారు కఠిన నిబంధనలు విధించింది. గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అది అమెరికా పౌరసత్వం అయిపోదని ట్రంప్‌తోపాటు అక్కడి అధికారులు తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రీన్ కార్డు ఉన్నవాళ్లు అమెరికా నుంచి తమ సొంతూళ్లకు వెళ్లి చాలా కాలం తర్వాత మళ్లీ అమెరికాకు వెళ్లినా సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇమిగ్రేషన్ నిపుణులు అంటున్నారు.
6 నెలలకన్నా ఎక్కువ అమెరికా బయట ఉండి తిరిగి వచ్చేటోళ్లు ఇమిగ్రేషన్ ఆఫీసులు, ఎయిర్‌పోర్టుల్లో కఠినమైన పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. వారు అన్ని రోజులు వేరే ప్రాంతాల్లో గడపడానికి గల కారణాలపై కస్టమ్స్, బోర్డర్ సెక్యూరిటీ అధికారులు ప్రశ్నిస్తున్నారని అంటున్నారు. ప్రతి డాక్యుమెంట్‌నూ నిశితంగా పరిశీలిస్తున్నారని అంటున్నారు. సొంత దేశ పాస్‌పోర్టు, గ్రీన్‌కార్డు, హెచ్1బీ వీసా పర్మిట్, రీఎంట్రీ పర్మిట్, ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ లెటర్, ట్యాక్స్పేమెంట్ ప్రూఫ్, పే స్లిప్స్, స్టూడెంట్లయితే యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్, అమెరికా బ్యాంక్ అకౌంట్, అమెరికా డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్లన్నింటినీ క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నట్టు చెబుతున్నారు.