వాషింగ్టన్: అమెరికా ప్రజలు దేశ చరిత్రలోనే ఎన్నడూ ఊహించనంతటి అద్భుత తీర్పు చెప్పారని, దేశానికి 47వ ప్రెసిడెంట్‌గా తనను ఎన్నుకున్నందుకు వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని కాబోయే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా బుధవారం తెల్లవారుజామున ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కన్వెన్షన్ సెంటర్లో ఆయన విక్టరీ స్పీచ్ ఇచ్చారు. తాను యుద్ధాలు ప్రారంభించబోనని, వాటిని ఆపుతానని ట్రంప్ ప్రకటించారు.
‘‘ఇక ఇప్పుడు దేశాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రస్తుతం దేశం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మనం బార్డర్లను పటిష్టం చేసుకోవాలి. సెక్యూరిటీ పెంచుకోవాలి. మిలటరీని పవర్ ఫుల్ చేసుకోవాలి. కానీ దానిని వాడుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకోకూడదు. నేను ప్రెసిడెంట్‌గా ఉన్న నాలుగేండ్ల సమయంలో యుద్ధాలు చేయలేదు. ఐఎస్ఎస్ను అతి తక్కువ టైంలో ఓడించడం తప్ప ఎలాంటి యుద్ధాలకు దిగలేదు. ఇప్పుడు కూడా నేను యుద్ధాలు ప్రారంభించబోను. యుద్ధాలను ఆపుతాను” అని తెలిపారు.
స్వర్ణయుగం తీసుకొస్తా..
‘‘ఇది అమెరికాకు ఒక స్వర్ణయుగం అవుతుంది. ఈ అద్భుతమైన విజయం అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా నిలబెట్టేందుకు దోహదం చేస్తుంది” అని చెప్పారు. తాను ఇంతటి ఘన విజయం సాధించడం వెనక వేదికపై ఉన్న తన భార్య మెలానియా, కాబోయే వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ కృషి ఎంతో ఉందని ట్రంప్ కొనియాడారు. బిలియనీర్ ఎలాన్ మస్క్ కూడా తనకు మద్దతు ఇచ్చి విజయానికి సాయం చేశారని ధన్యవాదాలు తెలిపారు. ‘‘ఇలాంటి ఉద్యమం ఎవరూ ఎప్పుడూ చూసి ఉండరు. ఇది చరిత్రలోనే ఒక గొప్ప రాజకీయ ఉద్యమం. ఇలాంటి విజయం గతంలో ఎవరికీ దక్కలేదు.. భవిష్యత్తులోనూ ఎవరికీ దక్కకపోవచ్చు” అని ఆయన అన్నారు.
మాట నిలబెట్టుకుంటా..
ఈ ఎన్నికల్లో చరిత్రత్మాకమైన పోరాటం జరిగిందని ట్రంప్ అన్నారు. ‘‘ఈ ఎన్నికల్లో నేను 900 ర్యాలీలు నిర్వహించాను. మనం దేశవ్యాప్తంగా అందరినీ ఏకం చేశాం. యువత, వృద్ధులు, మహిళలు, పురుషులు, పట్టణాలు, గ్రామాలను ఒక్కతాటిపైకి తెచ్చాం. యూనియన్, నాన్ యూనియన్, ఆఫ్రికన్ అమెరికన్, హిస్పానిక్ అమెరికన్, ఏసియన్ అమెరికన్, అరబ్ అమెరికన్.. ఇలా ప్రతి వర్గం నుంచీ మనకు మద్దతు లభించింది. అందరూ మన వెంటే ఉన్నారు”అని చెప్పారు. స్వింగ్ స్టేట్స్‌లోనూ మనమే గెలిచాం. మొత్తం 315కుపైగా ఎలక్టోరల్ ఓట్లను సాధించబోతున్నాం.
రిపబ్లికన్ పార్టీ మళ్లీ సెనేట్‌లో తిరిగి ఆధిక్యంలోకి వచ్చిందని, ప్రతినిధుల సభలోనూ మెజార్టీని నిలబెట్టుకుంటున్నామని చెప్పారు. ‘‘నా ఫస్ట్ టర్మ్‌లో మాదిరిగానే.. ఇప్పుడు కూడా ఇచ్చిన మాటను నిలెబెట్టుకోవాలన్న నియమం ఆధారంగానే పని చేస్తా. మేం అమెరికాను మళ్లీ సురక్షిత, శక్తిమంతమైన, స్వేచ్ఛాయుతమైన, సుసంపన్నమైన దేశంగా తీర్చిదిద్దుతాం. ఇందుకోసం దేశ ప్రజలంతా నాతో కలిసి నడవాలి. మన మధ్య వచ్చిన విభజనలను పక్కనపెట్టాల్సిన సమయం వచ్చింది. మనం ఏకమవుదాం. అమెరికాను గొప్ప స్థానంలో నిలబెడదాం” అని దేశ ప్రజలకు ట్రంప్ పిలుపునిచ్చారు.
అందుకే బతికించాడేమో..
దేవుడు ఒక కారణం కోసమే తనను బతికించాడని చాలామంది తనతో చెప్పారని జులైలో తనపై జరిగిన హత్యాయత్నం ఘటనను ట్రంప్ ప్రస్తావించారు. ‘‘అమెరికాను కాపాడ్డం కోసమే ఆ దేవుడు నన్ను బతికించాడు. ఇప్పుడు మనం ఆ మిషన్‌ను కలిసికట్టుగా విజయవంతం చేద్దాం. మన ముందు ఉన్న పని అంత ఈజీ కాదు. కానీ నా శక్తినంతా కూడబెట్టి శ్రమిస్తా. ప్రపంచంలో ఇంతకంటే గొప్ప పని ఇంకేమీ లేదు” అని ఆయన చెప్పారు.
దేశ రాజకీయాల్లో కొత్త స్టార్
ఎలాన్ మస్క్ ఎంతో మంచి వ్యక్తి అని డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. ఇక్కడి రాజకీయాల్లో కొత్త స్టార్ పుట్టుకొచ్చిందని, అదే మస్క్ అని తెలిపారు. ‘‘మస్క్ అద్భుతమైన వ్యక్తి. మేము నిన్న రాత్రి కలుసుకుని ఎన్నికల గురించి మాట్లాడుకున్నం. మీకు తెలుసా.. ఫిలడెల్ఫియాతో పాటు పెన్సిల్వేనియాలోని పలు ప్రాంతాల్లో మస్క్ రెండు వారాలు నాకు మద్దతుగా ప్రచారం చేశారు’’ అని ట్రంప్ తెలిపారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ట్రంప్ సంబురాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఎలాన్ మస్క్‌తో ఏదైనా సాధ్యం. స్పేస్ ఎక్స్ లాంచ్ ప్రోగ్రామ్ చూశాను. ఎంతో బాగుంది. నా గెలుపులో మస్క్ కీలక పాత్ర పోషించాడు. స్టార్ లింక్ ద్వారా ప్రపంచానికి ఇంటర్నెట్ కొత్త టెక్నాలజీని పరిచయం చేశాడు. ఎవరికీ సాధ్యం కానిది.. మస్క్ చేసి చూపించాడు. అందుకే అతనంటే నాకెంతో ఇష్టం. ఇలాంటి జీనియస్‌లు అమెరికాకు ఎంతో అవసరం. అలాంటి వారిని కాపాడుకుంటాం’’ అని ట్రంప్ తెలిపారు.