ట్రంప్ ట్రేడ్ వార్.. టూరిజంపై ఎఫెక్ట్: ఈ ఏడాది అమెరికాకు 5.1% తగ్గిన విదేశీ పర్యాటకులు

ట్రంప్ ట్రేడ్ వార్.. టూరిజంపై ఎఫెక్ట్: ఈ ఏడాది అమెరికాకు 5.1% తగ్గిన విదేశీ పర్యాటకులు
  • యూఎస్ టూరిజం సెక్టార్​కు 64 బిలియన్ డాలర్ల నష్టం 
  • ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నివేదిక 

లండన్:  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో ఇటీవల తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు.. వివిధ దేశాలతో ట్రేడ్ వార్ వల్ల ఆ దేశ పర్యాటక రంగంపై ప్రభావం చూపుతోందని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ఆక్స్ ఫర్డ్ ఎకానమిక్స్ శాఖ ఓ నివేదికలో వెల్లడించింది. అమెరికాలో 2025 చివరి నాటికి విదేశీ పర్యాటకుల రాక 5.1% తగ్గనుందని, ఫలితంగా గణనీయమైన ఆదాయ నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నివేదిక తెలిపింది. 

కఠినమైన వలస విధానాలు, సుంకాలతోపాటు గాజా, ఉక్రెయిన్ పై అమెరికా తీరు కారణంగా పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ సందర్శకుల రాక తగ్గుతోందని, అలాగే వివిధ సంస్థలు అమెరికాలో కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా వెనకడుగు వేస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలో ధరల పెరుగుదల, డాలర్ బలపడటం వల్ల కూడా విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గడానికి కారణమని చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం.. 2025లో అమెరికా పర్యాటక రంగం సుమారు 64 బిలియన్ డాలర్ల(రూ. 5.5 లక్షల కోట్లు) ఆదాయాన్ని కోల్పోవచ్చని ఈ నివేదిక అంచనా వేసింది. 

అలాగే పర్యాటకులు చేసే వ్యయం కూడా 10% మేర తగ్గనుందని తెలిపింది. 2024లో 77.7 మిలియన్ల విదేశీ పర్యాటకులు అమెరికాను సందర్శించారని, అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది టూరిస్టుల సంఖ్యలో 17% పెరుగుదల అని పేర్కొంది. కానీ 2025లో మాత్రం టూరిజం పెరగడానికి బదులుగా తగ్గుదల నమోదు చేస్తోందని వివరించింది. కెనడా నుంచి పర్యాటకుల సంఖ్య భారీగా పడిపోయిందని వెల్లడించింది. 

ఈ ఫిబ్రవరిలోనే కెనడా నుంచి టూరిస్టుల రాక 23% తగ్గిందని, వరుసగా రెండో నెల కూడా తగ్గుదల నమోదవుతోందని పేర్కొంది. దేశీయంగా కూడా పర్యాటకుల రాక తగ్గిపోతోందని తెలిపింది. అమెరికాలో జరగనున్న 2025 రైడర్ కప్, 2026 ఫిఫా వరల్డ్ కప్, 2026 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ వంటి ప్రధాన స్పోర్ట్స్ ఈవెంట్లపై కూడా టూరిజం ప్రభావం గణనీయంగా ఉండవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.