ట్రంప్ యాక్షన్ షురూ..ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఎగ్జిట్​

ట్రంప్ యాక్షన్ షురూ..ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఎగ్జిట్​
  • డబ్ల్యూహెచ్​వోకు అమెరికా గుడ్ బై.. పారిస్ ఒప్పందానికి బై బై
  • అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వరుస ఉత్తర్వులు
  • ​వలసదారులకు పుట్టే పిల్లలకు బర్త్ రైట్ సిటిజన్ షిప్ రద్దు 
  • మెక్సికో బార్డర్​లో ఎమర్జెన్సీ.. డ్రగ్ కార్టెల్స్​కు ‘టెర్రర్’ గుర్తింపు 
  • ట్రాన్స్ జెండర్లకు షాక్..  బ్రిక్స్ దేశాలకు ఝలక్  
  • వర్క్ ఫ్రం హోం రద్దు.. రిక్రూట్మెంట్లు నిలిపివేత 
  • ‘క్యాపిటల్’పై దాడి కేసులో తన సపోర్టర్లు 1,500 మందికి క్షమాభిక్ష 
  • బైడెన్ జారీ చేసిన మొత్తం 78 ఆర్డర్లను రద్దు
  • సోషల్ మీడియా ప్లాట్​ఫామ్ టిక్ టాక్ పై నిషేధం.. 75 రోజుల పాటు నిలిపివేత
  • 2021లో క్యాపిటల్ బిల్డింగ్​పై దాడి కేసులో 
  • శిక్ష అనుభవిస్తున్న తన మద్దతుదారులు 1500 మందికి క్షమాభిక్ష
  • డాలర్​కు ఆల్టర్నేట్​గా కరెన్సీని తెచ్చేందుకు బ్రిక్స్ దేశాలు ప్రయత్నిస్తే ఆ దేశాలపై 100% టారిఫ్​లు

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. యూఎస్ 47వ ప్రెసిడెంట్ గా సోమవారం బాధ్యతలు చేపట్టిన వెంటనే వరుసగా అనేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలతో ఆయన యాక్షన్ షురూ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ వో) నుంచి, పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ నుంచి అమెరికా బయటికి రావడం, యూఎస్ లో పుట్టే వలసదారుల పిల్లలకు బర్త్ రైట్ సిటిజన్ షిప్ హక్కు రద్దు, ఫెడరల్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం రద్దు.

ట్రాన్స్ జెండర్లకు హక్కుల తొలగింపు, విదేశాలకు సాయం తాత్కాలికంగా నిలిపివేత వంటి నిర్ణయాలు ఇందులో ఉన్నాయి. గత అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో తీసుకున్న కీలక నిర్ణయాలతోపాటు ఆయన గద్దె దిగడానికి కొద్ది రోజుల ముందు తీసుకున్న పలు నిర్ణయాలను కూడా రివర్స్ చేస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు.

డబ్ల్యూహెచ్​వో నుంచి బయటికి.. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) నుంచి అమెరికా బయటకు వచ్చేలా ట్రంప్ ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ గా పని చేసినప్పుడు కూడా డబ్ల్యూహెచ్ వో నుంచి అమెరికా బయటకు వచ్చింది. ట్రంప్ తర్వాత అధికారంలోకి వచ్చిన జో బైడెన్ సర్కారు మళ్లీ డబ్ల్యూహెచ్ వోలో అమెరికా చేరాలని నిర్ణయించారు. ఇప్పుడు మళ్లీ ట్రంప్ రావడంతో అమెరికా డబ్ల్యూహెచ్ వో నుంచి బయటకు వచ్చేసింది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన డబ్ల్యూహెచ్ వోకు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనా కంటే తక్కువ జనాభా ఉన్న అమెరికా ఎక్కువ నిధులు ఇస్తోందని, ఇది న్యాయంగా లేనందుకు 
తాము వైదొలగుతున్నామని పేర్కొన్నారు.

పారిస్ అగ్రిమెంట్​కు గుడ్ బై.. 

వాతావరణ మార్పుల నివారణకు అత్యంత కీలకమైన పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ కు కూడా ట్రంప్ సర్కార్ గుడ్ బై చెప్పింది. గ్లోబల్ వార్మింగ్ ను కట్టడి చేసి, ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పారిశ్రామిక విప్లవం నాటి కంటే 1.5 డిగ్రీలకు మించి పెరగకుండా చూడాలన్న ఈ ఒప్పందంలో 190కి పైగా దేశాలు ఉన్నాయి. అయితే, సంపన్న దేశాలు ఎక్కువ నిధులు ఖర్చు చేయాల్సి వస్తుందన్న కారణంతో మొదటి నుంచీ ఈ ఒప్పందాన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. ప్రెసిడెంట్ గా ట్రంప్ ఫస్ట్ టర్మ్ లోనూ ఈ ఒప్పందం నుంచి అమెరికా బయటకు వచ్చింది.

మెక్సికో బార్డర్​లో ఎమర్జెన్సీ..

అమెరికాలోకి వలసలు, శరణార్థులకు ఆశ్రయం ఇచ్చే విషయంలో నిబంధనలను కఠినతరం చేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. అక్రమ వలసలను ఆపేందుకు దక్షిణాదిన మెక్సికో బార్డర్​కు పెద్ద ఎత్తున బలగాలను పంపుతున్నట్టు పేర్కొన్నారు. దక్షిణ బార్డర్​లో నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించారు. అలాగే, దేశవ్యాప్తంగా ఇంధన వెలికితీత ఆపరేషన్లు పెంచేందుకు గాను నేషనల్ ఎనర్జీ ఎమర్జెన్సీని కూడా ట్రంప్ డిక్లేర్ చేశారు. ప్రపంచమంతా అమెరికా ఇంధనాన్ని ఎగుమతిచేసే దిశగా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

బర్త్ రైట్ సిటిజన్ షిప్ రద్దు..అమలు అంత ఈజీ కాదు!  

అమెరికాకు వలసవెళ్లినవాళ్లకు అక్కడ పిల్లలు పుడితే.. వారికి ఆటోమేటిక్​గా యూఎస్ సిటిజన్ షిప్ వర్తించే చట్టాన్ని కూడా ట్రంప్ రద్దు చేశారు. ఈమేరకు ‘బర్త్ రైట్ సిటిజన్ షిప్’ హక్కును రద్దు చేస్తూ  ఎగ్జిక్యూటివ్ ఆర్డర్​పై సంతకం చేశారు. వచ్చే నెల 19 తర్వాత పుట్టే పిల్లలకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. దీంతో చదువు, ఉద్యోగాల కోసం అమెరికాకు వలస వెళ్లి సెటిల్ అయినా.. గ్రీన్ కార్డు లేనివారికి పుట్టే పిల్లలకు ఇకపై ఆ దేశ పౌరసత్వం లభించదు. దీంతో భారతీయులతో సహా లక్షలాది మంది వలసదారులకు ఇబ్బందులు తప్పవు. 

అమెరికా జనాభాలో భారతీయులు దాదాపు 1.47% (55 లక్షలు) వరకూ ఉన్నారు. వీరిలో 34% మంది అమెరికాలోనే జన్మించారు. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో వీళ్లలో ఇంకా గ్రీన్ కార్డు రాని వాళ్లకు పుట్టే పిల్లలకు పౌరసత్వం రాదు. అమెరికా గడ్డపై పుట్టినవారంతా ఆ దేశ పౌరులే అన్నది గత వందేండ్లుగా అమెరికాలో అమలవుతున్న చట్టం. 1868లో14వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇమిగ్రెంట్లకు అమెరికా ఈ ‘బర్త్ రైట్ సిటిజన్ షిప్’ హక్కును కల్పించింది. తాజాగా ట్రంప్ ఆ చట్టానికి ముగింపు పలుకుతూ ఉత్తర్వులు జారీ చేశారు. 

ట్రంప్ సంతకం చేసినప్పటికీ, ఈ ఉత్తర్వు అమలుకు రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉండటంతోపాటు  న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున దీని అమలు అంత సులభం కాదని చెప్తున్నారు. కాగా, ఈ ఆర్డర్​ను సవాల్ చేస్తూ సోమవారమే న్యూ హాంప్ షైర్ జిల్లా కోర్టులో లా సూట్ దాఖలైంది. ట్రంప్ ఆదేశాలు రాజ్యాంగ వ్యతిరేకమని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్, ఏసియన్ లా కాకస్, తదితర సంఘాలు ఈ దావా వేశాయి.

1,500 మంది సపోర్టర్లకు క్షమాభిక్ష..

గత అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోవడంతో ఆయన మద్దతుదారు లు 1,500కుపైగా మంది 2021, జనవరి 6న క్యాపిటల్ బిల్డింగ్​పై దాడి చేసి జైలుపాలు కాగా.. ఇప్పుడు వారందరికీ క్షమాభిక్ష ప్రసాదిస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు.

వర్క్ ఫ్రం హోం ఇక ఉండదు..

అమెరికాలో కరోనా విపత్తు సమయం నుంచీ ఫెడరల్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పిస్తున్నారు. ఇకపై ఫెడరల్ ఉద్యోగులకు ఈ అవకాశాన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులంతా వారానికి ఐదు రోజులు ఆఫీసుకు వచ్చి పని చేయాల్సిందేనని ఆదేశించారు. వర్క్ ఫ్రం హోంను రద్దు చేస్తామని ఇదివరకే ప్రకటించిన ట్రంప్.. ఆదేశాలను ఉల్లంఘించే ఉద్యోగులను సర్వీస్ నుంచి తొలగిస్తామని కూడా హెచ్చరించారు. 

రిక్రూట్మెంట్లు నిలిపివేత..

ఫెడరల్ సర్కారు స్టాఫ్ ను తగ్గిస్తామని, ఖర్చులను కట్టడి చేస్తామని ఇదివరకే ప్రకటించిన ట్రంప్.. ఆ మేరకు కొత్తగా ఫెడరల్ ఉద్యోగాల్లో నియామకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. జాతీయ, ప్రజా భద్రత, మిలిటరీ వంటి విభాగాల్లో తప్ప మిగతా ప్రభుత్వ శాఖల్లో కొత్తగా ఉద్యోగాల భర్తీని నిలిపివేస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, బైడెన్ సర్కారు ట్రాన్స్​జెండర్ల సమానత్వం, రక్షణ కోసం కల్పించిన హక్కులను కూడా ట్రంప్ రద్దు చేశారు.

ఉషా చిలుకూరిపై ట్రంప్ ప్రశంసలు

వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరిపై డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. ఉషా చిలుకూరి చాలా తెలివైన అమ్మాయి అని అన్నారు. పరిస్థితులు అనుకూలించి ఉండి ఉంటే.. తాను ఉషానే ఉపాధ్యక్షురాలిగా ఎంపిక చేసేవాడినని చెప్పారు. సోమవారం ఆమె తన భర్త జేడీ వాన్స్.. అమెరికాకు 50వ ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఉషా చిలుకూరి.. తొలి భారత సంతతి, తొలి హిందూ సెకండ్ లేడీగా చరిత్రలో నిలిచారు. వాన్స్ ప్రమాణం చేస్తున్నప్పుడు.. ఉషా ఒక చేతిలో బైబిల్‌‌‌‌, మరో చేతిలో కుమార్తె మిరాబెల్ రోజ్‌‌‌‌ను పట్టుకున్నారు.

బైడెన్ జారీ చేసిన 78 ఆర్డర్లు నిలిపివేత 

గత అధ్యక్షుడు బైడెన్ తీసుకున్న అనేక నిర్ణయాలను ట్రంప్ రద్దు చేశారు. మొత్తంగా బైడెన్ హయాంలో జారీ అయిన 78 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను నిలిపివేస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇజ్రాయెల్ అధీనంలో ఉన్న వెస్ట్ బ్యాంక్​లో పాలస్తీనియన్లను వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఇజ్రాయెలీ సెటిలర్లపై గత బైడెన్ సర్కారు ఆంక్షలు విధించగా, ట్రంప్ తాజాగా ఈ ఆంక్షలను ఎత్తేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

అలాగే, క్యూబాలో రాజకీయ ఖైదీలను విడుదల చేసేందుకు కుదిరిన ఒప్పందంలో భాగంగా ఆ దేశాన్ని టెర్రరిజానికి సపోర్ట్ చేస్తున్న దేశాల జాబితా (బ్లాక్ లిస్ట్) నుంచి తొలగిస్తూ బైడెన్ సర్కారు ఇటీవలే నిర్ణయం తీసుకోగా.. ఆ నిర్ణయాన్నీ ట్రంప్ రివర్స్ చేశారు. అదేవిధంగా బైడెన్ సర్కారు పెండింగ్​లో పెట్టిన పలు చట్టాల అమలునూ ట్రంప్ నిలిపివేశారు. తన సర్కారు పూర్తి స్థాయిలో కుదురుకునే దాకా బ్యూరోక్రాట్లు ఎవరూ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయరాదంటూ ఆదేశించారు.   

డ్రగ్స్​ దందా చేసేటోళ్లూ టెర్రరిస్టులే.. 

వివిధ దేశాల మధ్య డ్రగ్స్ దందా చేస్తున్న డ్రగ్ కార్టెల్స్ ను విదేశీ టెర్రరిస్ట్ సంస్థలుగా గుర్తిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ఆయన సంతకం చేశారు. ప్రధానంగా మెక్సికన్ డ్రగ్ కార్టెల్స్, లాటిన్ అమెరికాలోని వెనెజులా, సాల్వెడార్, ఇతర దేశాల డ్రగ్ మాఫియా, క్రిమినల్ గ్రూపులపై సైన్యం తరహాలో చర్యలకు ఈ ఉత్తర్వులు వీలు కల్పిస్తాయి.

మరణశిక్షలకు ఇంజెక్షన్లు సిద్ధం.. 

వివిధ కేసుల్లో దోషులకు విధించిన మరణ శిక్షలను అమలు చేయడంలో రాష్ట్రాలకు సహాయం చేయాలని కూడా ట్రంప్ ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. మరణశిక్షలను అమలు చేసేందుకు కావలసిన విషపు ఇంజెక్షన్లు అన్ని రాష్ట్రాలు సమకూర్చుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఈమేరకు 
అటార్నీ జనరల్​ను ట్రంప్ ఆదేశించారు.

నలుగురు ఆఫీసర్లపై వేటు..మరో వెయ్యి మందిని తొలగిస్తా: ట్రంప్ 

ఫెడరల్​ గవర్నమెంట్​లో నలుగురు ఉన్నతాధికా రులను డిస్మిస్ చేశానని ట్రంప్ ప్రకటించారు. జోస్ ఆండ్రెస్ (ప్రెసిడెంట్ కౌన్సిల్ ఆన్ స్పోర్ట్స్), మార్క్ మిల్లీ (నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వైరీ కౌన్సిల్), బ్రియాన్ హుక్ (విల్సన్ సెంటర్ ఫర్ స్కాలర్స్), కీషా లాన్స్ బాటమ్స్ (ప్రెసిడెంట్స్ ఎక్స్ పోర్ట్ కౌన్సిల్)ను వెంటనే తొలగించాలని ఆదేశించినట్టు ట్రంప్ మంగళవారం తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా వెల్లడించారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే తన విజన్ కు సరిపోని ఇలాంటి ఆఫీసర్లను మరో వెయ్యి మందిని త్వరలోనే డిస్మిస్ చేస్తానని ఆయన తెలిపారు. ఆఫీసర్ల జాబితా ను తన స్టాఫ్ సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు.