అమెరికా ఆధిపత్యం స్వలాభమా...క్షేమమా!

అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు చేపట్టబోతున్న  ట్రంప్.. అమెరికా దేశ ఆస్తిత్వ పునరుద్ధరణకు వ్యూహ రచన చేశారు.   కెనడా  దేశాన్ని  అమెరికా  51వ రాష్ట్రంగా చేర్చడానికి తన ప్రయత్నాలు జరుగుతున్నవని,  తన నిర్ణయాన్ని రెండు దేశాల ప్రజలు స్వాగతిస్తారని డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.  2017-2021 మధ్యకాలంలో  రెండు దేశాల మధ్య దౌత్య, వాణిజ్య, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు అత్యున్నత స్థాయిలో కొనసాగాయి.  మరికొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గత ఏడాది నవంబర్ 5వ తేదీన జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ రికార్డు స్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్‌‌‌‌‌‌‌‌ను ఓడించటంలో కొన్ని ప్రధాన వాగ్దానాలు ఎన్నికల నేపథ్యంలో మలుపు తిప్పాయి.  ఈ నెల 20వ తేదీన అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

కొత్త ప్రణాళికలతో  సరికొత్తగా  తన పాలన ముందుకు సాగాలి అనే ఉద్దేశంతోనే..  డొనాల్డ్ ట్రంప్ సరికొత్త వివాదానికి, సంచలనానికి తెర తీశారనేది  కొందరి అభిప్రాయం.  వాస్తవానికి ఒక దేశం  అస్తిత్వం మరొక దేశానికి సరిపోదు. నేటి కాలంలో స్వతంత్రతను  కోరుకునేటటువంటి  పరిణామక్రమం ఉన్నప్పటికీ పరిస్థితుల ప్రభావం కూడా ఉంటుంది.  అమెరికా పొరుగు దేశమైన  కెనడాను  తమ దేశంలో విలీనం చేసుకోడానికి ఉద్దేశించిన ట్రంప్​ చేసిన ప్రతిపాదన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.  రెండు దేశాల విలీనానికి  సంబంధించిన రెండు కొత్త మ్యాప్‌‌‌‌‌‌‌‌లను కూడా తన సొంత, అధికారిక ట్రూత్ సోషల్ ప్లాట్​ఫామ్‌‌‌‌‌‌‌‌పై  ట్రంప్​ పోస్ట్ చేశారు.   అమెరికా, కెనడా దేశాలపై  జాతీయ జెండా పరిధిలోకి తీసుకొచ్చారు.  ఈ పరిణామం జరిగే  కొన్ని గంటల ముందే  దీనికి సంబంధించిన ప్రతిపాదనలను తెర మీదికి తీసుకొచ్చారు.  తన సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కెనడాను తమ రాష్ట్రంగా  గుర్తిస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ తరువాతే ఈ కొత్త మ్యాప్‌‌‌‌‌‌‌‌ను పోస్ట్ చేశారు.

అమెరికా ఆధిపత్యంపై భిన్నాభిప్రాయాలు

కెనడాను  అమెరికాలో  విలీనం చేయడానికి  కొన్ని విషయాలను లోతుగా పరిశీలిస్తే.. కెనడాలోకి వలసలను అరికట్టాలని యత్నం చేస్తున్న నేపథ్యం పునరావృతం అవుతుందని చెప్పవచ్చు.  భద్రతా విషయంలో రక్షణ శాఖను పటిష్టం చేయాలని  ప్రతి దేశం ప్రధానంగా ఆలోచిస్తుంది.  కెనడాపై  ట్రంప్ చేస్తున్న ప్రతిపాదన వ్యూహం సరియైనదా.. కాదా! అనే విషయంలో భిన్న అభిప్రాయాలు విశ్లేషకుల నుంచి వెలువడుతున్నాయి.  ఒక దేశానికి మరొక దేశానికి మధ్యగల దౌత్య సంబంధాలు ప్రత్యేకంగా ఉంటాయి. అవి బహిర్గతం చేసే విషయంలో పరిస్థితులపై ప్రభావాన్ని ఏ విధంగా చూపుతాయో ఆలోచించి  సహజంగా ఆ  దేశ  అధ్యక్షుడు  స్పందిస్తాడు. అక్రమ వలసలు, మాదక ద్రవ్యాలను అడ్డుకోవడం అనే అంశాలు కీలకంగాఉన్నాయి.  మరోవైపు..  కెనడా దేశం  ఆర్థిక పరిస్థితి బలంగా ఉన్నదని ఆ దేశ విదేశాంగ మంత్రి మెలని జోలి అన్నారు.  ట్రంప్  బెదిరింపులకు తగ్గేది లేదని,  ఆయనకు  మా దేశంపై పూర్తి అవగాహన లేదని,  మా ఆర్థిక వ్యవస్థ పూర్తి బలంగా ఉంది.. మా ప్రజలే మా  బలం అని  ట్రంప్​ని హెచ్చరించారు. కాగా, 2009లో  ట్రంప్​...  గ్రీన్ ల్యాండ్, పనామా, మెక్సికో  దేశాల గురించి మాట్లాడుతూ గ్రీన్​ల్యాండ్​ను కొనుగోలు చేస్తానని అనడంతో  ఆ దేశంలో అత్యధిక ఖనిజ సంపద ఉన్నదని  తెలుస్తోంది.  ఇతర దేశాలపై  అగ్రరాజ్యం అమెరికా ఆధిపత్యం చూపే ప్రభావం భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తోంది.  ఏదిఏమైనప్పటికీ ఒక దేశం  స్వేచ్ఛాయుత వాతావరణంలో మనుగడ సాగినప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని చెప్పక తప్పదు. 

అమెరికాపై ఆధారపడుతున్న కెనడా రక్షణశాఖ

ఫ్లోరిడాలో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ... జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని కెనడాను విలీనం చేసుకోవాలని భావిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. కెనడా భద్రత దృష్ట్యా అమెరికాలో విలీనం కావడమే మంచిదన్నారు.  కెనడా రక్షణ శాఖ  ఎక్కువగా తమ  దేశ సైనిక శక్తి  మీద ఆధారపడుతోందని రక్షణ విషయంలో అధిక మొత్తంలో కెనడా ఖర్చు చేస్తోందని డొనాల్డ్ ట్రంప్ గుర్తు చేశారు.  అది దేశ ఆర్థిక మనుగడకు,  స్థిరత్వానికి భంగం కలిగిస్తుందని  అభిప్రాయాన్ని  తెలిపారు.  సైనిక చర్య ద్వారా  కెనడాను  విలీనం  చేసుకోవాలనుకుంటున్నారా?  అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు నో అంటూ సమాధానం ఇచ్చారు. ఎకనమిక్ ఫోర్స్ ద్వారా కెనడాను  విలీనం చేసుకోవాలనుకుంటామని అన్నారు. దీనివల్ల కెనడా ఆర్థికంగా ఎంతో శక్తిమంతం అవుతుందని, అమెరికాను మళ్లీ స్వర్ణయుగంలోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు.  2017-– 2021 మధ్యకాలంలో తమ రెండు దేశాల మధ్య దౌత్య, వాణిజ్య, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు అత్యున్నత స్థాయిలో కొనసాగాయని ట్రంప్​ పేర్కొన్నారు.

-  డా. చిటికెన కిరణ్ కుమార్