- కమల రాకతో డెమోక్రటిక్ పార్టీకి పెరిగిన విరాళాలు
- గంటలోనే వచ్చిపడ్డ 46.7 మిలియన్ డాలర్లు
- అధ్యక్ష రేసులోకి మరో పేరు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులోకి కమలా హారిస్ రావడంతో డెమోక్రాట్లలో కొత్త ఉత్సాహం కనబడుతున్నది. అధ్యక్ష రేసు నుంచి తాను వైదొలుగుతున్నట్లు బైడెన్ ప్రకటించగానే ఇప్పటివరకు నామమాత్రంగా ఉన్న డెమోక్రాట్ల విరాళాల సేకరణ కార్యక్రమం ఒక్కసారిగా ఊపందుకున్నది. విరాళాలు పెరుగుతుండడంతో హారిస్ వైపు మొగ్గుచూపుతున్న నేతల సంఖ్య కూడా పెరుగుతోంది. కమలా బృందం కూడా ఫండ్స్ కోసం తన సపోర్టర్లకు మెయిల్స్ పంపడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కోసం విరాళాలు సేకరించే యాక్ట్ బ్లూ సంస్థ.. సోమవారం ఒక్కరోజే గంటలో 46.7 మిలియన్ డాలర్లను సమీకరించింది. అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ ను బైడెన్ ప్రతిపాదించిన 5 గంటల్లో చిన్న మొత్తాల్లో వచ్చిన విరాళాలే 27.5 మిలియన్ డాలర్లని యాక్ట్ బ్లూ వెల్లడించింది. విరాళాలు ఇంకా పెరిగే చాన్స్ ఉందని తెలిపింది.
ఆగస్టు 19న షికాగోలో జరిగే పార్టీ సమావేశంలో డెమోక్రాట్లు తమ అధ్యక్ష అభ్యర్థిని అధికారికంగా నామినేట్ చేయనున్నారు. పార్టీలో 263 మంది చట్ట సభ్యులు, 23 మంది గవర్నర్‌లు ఉన్నారు. వారిలో ఇప్పటికే 178 మంది హారిస్‌కు మద్దతు తెలిపారు. పార్టీ ప్రెసిడెంట్ నామినేషన్ గెలవడానికి 1,976 మంది డెలిగేట్‌లు అవసరం కాగా..గతంలో బైడెన్ 3,896 మంది డెలిగేట్‌ల మద్దతును సాధించారు. ఇప్పుడు బైడెన్ మద్దతు ఉండటంతో కమలాకు షికాగో మీటింగ్ ఎదుర్కొవడం కొంత సులభమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, బైడెన్ మద్దతు ఉన్నప్పటికీ హారిస్ ను డెమోక్రాట్లు అందరూ కొత్త అభ్యర్థిగా అంగీకరిస్తారా అంటే అనుమానమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ షికాగో సమావేశంలో కమలా హారిస్ ఏకగ్రీవమైతే..ఆమె తరఫున ఎన్నికల ప్రచార ఖర్చులకు విరాళాలను ఉపయోగించనున్నారు.
ట్రంప్‌ను ఓడించడమే నా లక్ష్యం: కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ తన పేరును ప్రతిపాదించడంపై కమలా హారిస్ సంతోషం వ్యక్తం చేశారు. ట్రంప్‌ను ఓడించడమే తన లక్ష్యమని వెల్లడించారు. " దేశ అధ్యక్షుడిగా బైడెన్ అద్భుతమైన సేవలు అందించారు. దశాబ్దాల పాటు దేశానికి సేవలందించిన ఆయనకు అమెరికా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయన అధ్యక్షుడిగా ఉండగా వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేయడం నాకు దక్కిన గొప్ప గౌరవం. నిజాయతీ, చిత్తశుద్ధి, దేశభక్తి వంటి లక్షణాలను ఆయనలో చూశాను. ఆయన ఎప్పుడూ దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఏడాదికాలంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నా. ఎన్నికల్లో ఎవరివైపు ఉండాలో ప్రజలకు వివరిస్తున్నా. రాబోయే కొన్నివారాల పాటూ అదే చేస్తా. ట్రంప్ ను, ఆయన ప్రాజెక్టు 2025ను ఓడించేందుకు ప్రజల్ని ఏకం చేసేందుకు శాయాశక్తులా కృషిచేస్తా. ఎన్నికలకు ఇంకా 107 రోజులు ఉన్నాయి. మనందరం కలిసి పోరాడితే కచ్చితంగా గెలుస్తాం" అని హారిస్ పేర్కొన్నారు.
రేసులోకి జో మంచిన్ !
డెమోక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష రేసులో కమలా హారిస్ తర్వాత ప్రముఖంగా వినిపిస్తున్న మరో పేరు వెస్ట్ వర్జీనియా సెనేటర్ జో మంచిన్. అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకోవాలంటూ మంచిన్ ఇటీవల మీడియా ముఖంగా డిమాండ్ చేశారు. కొత్తతరం నాయకులకు అవకాశం ఇచ్చేందుకైనా బైడెన్ తప్పుకోవాలని కోరారు. డెమోక్రాట్ల నేతల్లో కొందరి చూపు జో మంచిన్ వైపు కూడా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏమైనా, మరి కొన్నిరోజుల్లో డెమోక్రాట్ల కొత్త అభ్యర్థి ఎవరనేది తేలిపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు.