శ్రీశైలంలో వైభవంగా శాకాంబరీ ఉత్సవం

శ్రీశైలం, వెలుగు : ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఆదివారం శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి అమ్మవారికి శాకాంబరీ ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయాన్ని, అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని రాజరాజేశ్వరీ దేవికి, ఆలయం ఎదురుగా ఉన్న గ్రామదేవత అంకాలమ్మకు పూజలు చేసి శాకాలంకరణ చేశారు. అమ్మవారిని శాకాలతో అర్చించడం వల్ల సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండుతాయని అర్చకులు తెలిపారు. శాకాంబరీ అలంకారంలో ఉన్న అమ్మవారిని భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.