ప్రాజెక్టుల పేరుతో రైతుల నుంచి భూములు తీసుకుంటున్న ప్రభుత్వాలు పరిహారం విషయంలో అన్నదాతలకెప్పుడూ మొండిచెయ్యే చూపుతున్నాయి. తెలంగాణ సర్కారు భూసేకరణలో దుర్మార్గ విధానాలు అవలంబిస్తోంది. సీఎం కేసీఆర్ కొన్ని రోజులుగా ఏ మీటింగ్కు వెళ్లినా ‘‘రాష్ట్రంలో ఏ మూలకు పోయినా.. ఎకరాకు రూ.20 లక్షలకు ఎక్కడా తక్కువ లేదని, ప్రభుత్వ సుపరిపాలనతోనే భూముల రేట్లు పెరిగాయి’ అని గొప్పలు చెప్పుకుంటూ జబ్బలు చరుచుకుంటున్నారు. రాజధాని నగరం చుట్టుపక్కల ఎకరం కోట్లకు చేరడాన్ని తమ ప్రభుత్వ ఘనతగానే ప్రచారం చేసుకుంటుంటారు. మరో పక్క పేదల భూములను గుంజుకుంటూ.. ఓపెన్మార్కెట్లో అర్రాస్పెట్టి ఒక్కో ఎకరాన్ని కోట్లకు అమ్ముకుంటున్నారు. సర్కారు భూమి కోట్లకు అమ్ముకోవాలి, ఎకరానికి ఎక్కడా రూ.20 లక్షలకు తక్కువ లేదని మాటలు చెప్పాలి, పేద రైతుల నుంచి ప్రాజెక్టులకని తీసుకున్న భూమికి మాత్రం ఎకరానికి రూ.5 లక్షలే ఇయ్యాలి. ఇదేం న్యాయం? కడుపుకట్టుకొని, నోరుకట్టుకొని చేస్తున్న పారదర్శక పాలన ఇదేనా? ఇచ్చే ఈ పాటి పరిహారం కూడా అర్ధరాత్రి అరెస్టులు, ఆందోళనలు, లాఠీదెబ్బలు తిననిదే నిర్వాసితుల ఇల్లుజేరదాయే!.
పరిహారం అడిగితే నిర్బంధం
ఎన్నో పోరాటాల తర్వాత, అందరికి మేలు చేసేలా తీసుకువచ్చిన 2013 భూసేకరణ చట్టం అమలును ప్రభుత్వాలు పక్కన పెట్టేశాయి. భూమి రిజిస్ట్రేషన్ విలువలు చట్టప్రకారం సవరిస్తే, 2013 కేంద్ర భూ సేకరణ చట్టం అమలు చేస్తే, బాధితులకు ఎక్కువ పరిహారం ఇవ్వాల్సి వస్తుందని భావించిన సర్కారు.. భూమి విలువలు సవరించలేదు. పాత రేట్లనే లెక్క గడుతూ మార్కెట్రేటుకు మూడు రెట్లు ఇస్తున్నామని రైతులను మభ్యపెట్టడమే తప్ప వారికి న్యాయం చేసిందిలేదు. భూసేకరణను వేగవంతం చేయడానికి ప్రత్యేక చట్టం తీసుకురావడానికి చొరవ చూపిన ప్రభుత్వం, ఆ ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం పెంచే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. పారదర్శక పద్ధతులకు పునాది వేయలేదు. శాసనసభలో మందబలంతో, చర్చ లేకుండా, ప్రజలకు తెలియకుండా చట్టాన్ని తీసుకువచ్చి, భూమి త్యాగం చేయాల్సిన ప్రజల మీద కుట్రపూరిత పాలనా సంస్కృతికి నాంది పలికింది. న్యాయమైన పరిహారం అడిగారన్న ఒకే ఒక్క కారణంతో సిద్దిపేట జిల్లా గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులపై రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో దమనకాండ సాగించింది.
మొత్తం సమకూరిన ఆదాయం రూ.2,000 కోట్ల పైనే
సర్కారు భూములకు మార్కెట్ రేటు ప్రకారం అర్రాస్ పెట్టి ఆమ్దానీ పొందే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, పేదల నుంచి తీసుకునే భూమికి మాత్రం పాత రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా ఎంతో కొంత ముట్టజెప్పి బయటపడాలని చూస్తున్నది. 2021–-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర పన్నేతర ఆదాయం రూ.30,557.35 కోట్లుగా అంచనా వేయగా, ఇందులో కేవలం భూముల అమ్మకం ద్వారానే రూ.20 వేల కోట్లు రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నిరుడు నిర్వహించిన ఓ వేలంలో ప్రభుత్వం నిర్ణయించిన ధర ఎకరాకు రూ.25 కోట్లు కాగా ఎకరా సగటు ధర రూ.40.05 కోట్లు పలకడం గమనార్హం. మొత్తం సమకూరిన ఆదాయం రూ.2,000 కోట్ల పైనే. ప్రభుత్వం ప్రాథమిక బాధ్యత మరిచిపోయింది. విధానంలో, తన చర్యలలో సామాజిక న్యాయం ఉండాలన్న విషయం చెవినపెట్టడం లేదు. వనరులను అందరికి సమానంగా పంచే బాధ్యత ప్రభుత్వం మీద ఉందనే కనీస పాలనా సూత్రాన్ని తుంగలో తొక్కింది. ఎంతో కొంత భూమి ఉంది వ్యవసాయం చేసుకుని, లేదా ఆ భూమి ఆధారంగా ఇతరత్రా జీవనోపాధి పొందే అవకాశం ఉన్న కొన్ని వేల కుటుంబాలకు భూమిని దూరం చేస్తోంది. రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టులతో కలిపి చేస్తున్న భూసేకరణ కనీసం3 లక్షల ఎకరాలైనా ఉండొచ్చు.
అన్నిటికి పేదల భూములేనా?
ప్రాజెక్టుల కోసమే భూసేకరణ అని చెప్పిన ప్రభుత్వం, ఆ తర్వాత కలెక్టరు బంగ్లాలు, శ్మశాన వాటికలు, చెత్త కేంద్రాలు, ఎమ్మెల్యే ఆఫీసులు, కాలుష్య కర్మాగారాలు, రియల్ ఎస్టేట్ సంస్థల కోసం ల్యాండ్ పూలింగ్, క్రీడా మైదానాలు, పారిశ్రామిక కేంద్రాలు కోసం పేదల భూములు సేకరించే ప్రక్రియలకు తెరలేపింది. రోడ్డు విస్తరణలో, నీటి పైపులైన్లు, విద్యుత్ టవర్లు వంటి వాటికి కూడా భూమి ఇవ్వాల్సి వచ్చిన కుటుంబాలకు ఒక విధానపర దిక్సూచి లేదు. మార్గదర్శకాలు లేవు. అడ్డగోలు భూసేకరణ రైతు కుటుంబాలను గోస పెడుతుండగా, భూ బదలాయింపు భూమి మీద ఆధారపడి బతికే రైతులతో పాటు ఇతరుల జీవనోపాధిని దెబ్బతీసింది. భూమిలేని పేదల పరిస్థితి దారుణంగా తయారైంది. భూముల రేట్లు లక్షలు పలుకుతున్నాయని సర్కారు చెప్పుతుంటే.. గుంట భూమి లేని పేదోడు కనీసం ఇల్లు జాగా కూడా కొనలేని స్థితిలో బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి ఉంది.
అసైన్డ్ భూములు, పేదల భూములనే గురి పెట్టారు
గత దశాబ్దంలో పోలేపల్లి సెజ్ ఏర్పాటు ప్రకటనను ప్రజలు వ్యతిరేకించినా అప్పటి ప్రభుత్వం ముందుకు సాగింది. ఆ పారిశ్రామిక పార్కు ప్రణాళిక ఎక్కువ శాతం పేదలు, చిన్న, సన్నకారు రైతులు, అసైన్డ్ భూములు ఉండే విధంగా తయారు చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రాజెక్టులకు అసైన్డ్ భూములు, పేదల భూములనే గురి పెట్టారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వమే ముందుండి మరీ అదే పద్ధతిని కొనసాగిస్తోంది. భూసేకరణలో సర్కారు అసైన్డ్ భూములనే లక్ష్యంగా పెట్టుకుంటోంది. దాని వల్ల పరిహారం ఖర్చులను తగ్గించుకోవచ్చని, పేదలు తిరగబడలేరని, వారిది కోర్టుకు పోలేని స్తోమతని, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వారు నిస్సహాయులు అనే భావనతోనే వారి భూములను గుంజుకుంటోంది. భూమి ఉన్న పేదల నుంచి తక్కువ ధరకు సేకరించి కంపెనీలకు, ప్రైవేటు వ్యక్తులకు అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకోవాలనే ఒక కుత్సితపు వ్యాపార ఆలోచన ప్రభుత్వ విధానంగా మారింది. సుస్థిరాభివృద్ధి, రాజ్యాంగం అంగీకరించే విధానం కాదిది.
అధికారులు ఏం చేస్తున్నట్టు?
రోడ్లు, రైల్వేలకు భూమి కోల్పోతున్న కుటుంబాల తరఫున కేంద్ర సంస్థలతో సంప్రదింపులు జరిపి మెరుగైన పరిహారం, పునరావాస ప్యాకేజీ సాధించాల్సిన జిల్లా కలెక్టర్లు ఆ పని చేయడం లేదు. కేంద్ర సంస్థలతో చేస్తే రాష్ట్ర ప్రాజెక్టుల పట్ల అదే పద్ధతి అడుగుతారని భయం కావచ్చు. ప్రజల సమస్యల పట్ల, భూమి పోతుందని ఆందోళన చెందే కుటుంబాల పట్ల జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కోర్టుల్లో కూడా ప్రజలకు పూర్తి న్యాయం దొరకడం లేదు. అధికారులు కోర్టుల్లో వారి అపర తెలివితేటలు వాడుతున్నారు. ప్రజాధనంతో జీతాలు తీసుకుంటూ ప్రజల కోసం చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన ఆఫీసర్లు భూసేకరణ కేసుల విషయంలో వేస్తున్న తింగరి వేషాలు చూస్తే అసహ్యం వేస్తోంది. పలు సందర్భాల్లో న్యాయస్థానాలు పేదరైతుల పక్షం వహించి న్యాయబద్ధమైన ఆదేశాలు ఇచ్చినా, వాటిని బేఖాతరని అధికారులు న్యాయధిక్కార కేసులకూ సిద్ధపడుతున్నారు. భూసేకరణలో జరుగుతున్న అవినీతి, అక్రమాల సంగతి ఇంకా దారుణం. ప్రభుత్వం భూసేకరణ మీద గణాంకాలు విడుదల చేయలేదు. పారదర్శకంగా ఎన్ని ఎకరాలు సేకరించారు, ఎంత పరిహారం చెల్లించారు, ఆయా కుటుంబాల సామాజిక, ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందనే అంశాల మీద అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు పారదర్శక భూసేకరణ విధానం కావాలి. ప్రజల భాగస్వామ్యం ప్రణాళికా స్థాయి నుంచి పెంచాలి. సమగ్ర పునరావాస పథకం రూపకల్పన జరగాలి. భూమికి, భూ వినియోగానికి సంబంధించి ప్రజలతో సంప్రదించి అందరూ ఆమోదించే విధాన పత్రం తీసుకురావాలి. రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరు మీద, అభివృద్ధి నినాదం ముసుగులో జరుగుతున్నది భూబదలాయింపు. భూమి లేకుండా మిగులుతున్న కుటుంబాలు పరోక్షంగా భూమి–నిర్వహణపైనే ఆధారపడే పేదకుటుంబాలు, భూమిలేని వారు ఆర్థికంగా చితికిపోయే దురవస్థ అంతటా కళ్లకు కడుతోంది. ఈ పాపం సర్కారుదే!
- దొంతి నర్సింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్